పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): మోదీ ప్రభుత్వం గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను 10 శాతం వరకు తీసుకొస్తే తాము వ్యతిరేకించలేదని, కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కులగణన చేస్తుంటే బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ప్రశ్నించారు.
కులగణనతో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని రాహుల్‌గాంధీ అంటుంటే.. గాంధీ కుటుంబం రాజరిక పాలన అంటూ విమర్శలు చేయడం సరికాదన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. మొన్నటి వరకు మతాల పేరుతో ప్రజలను విడదీసిన బీజేపీ, ఇప్పుడు కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని దుయ్యబట్టారు.
పదేళ్లలో మోదీ ఏమి చేశాడో చెప్పకుండా.. కాంగ్రెస్ ఏమి చేయలేదంటూ ప్రచారం చేయడం తగదన్నారు. సమగ్ర కుటుంబ సర్వే చేసిన బీఆర్‌ఎస్, ఇప్పుడు కులగణను వ్యతిరేకించడం హాస్యాస్పందంగా ఉందన్నారు. బీజేపీలోకి వెళ్లిన సృజనాచౌదరి, సీఎం రమేశ్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నా ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.
మహారాష్ట్ర, జార్ఖండ్‌కు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాల నుంచి మహారాష్ట్ర, జార్ఖండ్‌కు ఎన్నికల నిధులను కాంగ్రెస్ పంపిస్తోందని మోదీ అనడం సరికాదన్నారు. ఇందిర కుటుంబంపై మోదీకి అంత కోపమెందుకని ప్రశ్నించారు.