టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై హైకోర్టు వ్యాఖ్య
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్ల ( ఎస్జీటీ) కు ఓటు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీచేసింది.
తదుపరి విచారణను ౪ వారాలకు వాయిదా వేసింది. ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించకుండా ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 27ను తీసుకురావడాన్ని సవాల్ చేస్తూ బీమనబోయిన కృష్ణమూర్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు చట్టబద్ధమే అయినా ఆర్టికల్ 19 1(ఏ) ప్రకారం ఈసీ నిర్ణయం సరికాదన్నారు. విచారణ చేపట్టి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఎస్జీటీలకు ఓటు హక్కు కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది.
‘ఫిరాయింపు’లపై నేడు తీర్పు
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయింపులపై సింగిల్ జడ్జి తీర్పును శాసనసభ కార్యదర్శి సవాలు చేస్తూ వేసిన రెండు అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించనుంది.
ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి జస్టిస్ బి.విజయేంద్రసేన్‌రెడ్డి తీర్పునిచ్చారు. ఆ తీర్పును రద్దు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు దాఖలు చేసిన రెండు అప్పీల్ పిటిషన్లపై జస్టిస్ అలోక్ అరాథే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన డివిజన్ బెంచ్ 12న తీర్పును రిజర్వు చేసింది.
కాగా నేడు ధర్మాసనం తీర్పును వెలువరించనున్నది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై స్పీకర్ నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదించారు. దీనిపై బీఆర్‌ఎస్ తరఫు సీనియర్ న్యాయవాదులు మోహన్‌రావు, జె.రామచందర్‌రావు ప్రతివాదనలు చేస్తూ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల తుది నిర్ణయాన్ని స్పీకర్‌కే వదిలిపెట్టారని చెప్పారు.
ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, వివేకానంద, దానంపై విడిగా బీజేపీ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా వేసిన పిటిషన్లల్లో సింగిల్ జడ్జి తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాలు చేస్తూ రెండు అప్పీళ్లపై శుక్రవారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పనున్నది.