19-02-2025 12:00:00 AM
‘స్త్రీ2’ తర్వాత బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్‌రావు మరో చిత్రం ‘భూల్ చూక్ మాఫ్’తో వస్తున్నాడు. ఇందులో రాజ్‌కుమార్ సరసన వామికా గబ్బి తొలిసారి తెరపై రొమాన్స్ చేయనుంది. వారణాసి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి కరణ్ శర్మ రచనాదర్శకత్వం వహి స్తుండగా, మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు.
ఏప్రిల్ 10 న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ సినిమా ఫస్ట్ టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో వామికా ప్రేమను పొందడానికే ప్రభుత్వోద్యోగం సంపాదించే లవర్‌గా కనిపించనున్నాడు రాజ్‌కుమార్. పెద్దల సమక్షంలో వీరిద్దరి పెళ్లి తేదీ గురించి చర్చించుకోవడంతో టీజర్ మొదలైంది.
పెళ్లి నెలాఖరున.. అంటే 30న నిశ్చయించటం, హల్దీ వేడుకతో ఉల్లాసంతో ఉన్న రాజ్‌కుమార్.. మరుసటి రోజు కంగారు పడుతూ నిద్ర మేల్కొనే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
ప్రతిసారీ 29వ తేదీన హల్దీ వేడుకతో పెళ్లి ఆగిపోతోందంటూ నిరుత్సాహానికి గురవుతాడు రాజ్‌కుమార్. మరి అతని పెళ్లి ఒక్కరోజు ముందు ఎందుకు ఆగిపోతోందో తెలియాలంటే తమ చిత్రాన్ని చూడాల్సిందే అన్న ఆసక్తిని ప్రేక్షకుల్లో రేకెత్తించేలా టీజర్ కట్ చేశారు.