calender_icon.png 19 April, 2025 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీలిమిటేషన్‌కు ఎందుకు వ్యతిరేకం?

25-03-2025 12:00:00 AM

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు ఎందుకింతగా వ్యతిరేకిస్తున్నాయి? దీనివల్ల ఆ రాష్ట్రాలకు కలిగే నష్టం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ముందు డీ లిమిటేషన్ ప్రక్రియకు సంబంధించిన చరిత్రను ఓ సారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. 

రాజ్యాంగం లోని 82వ ఆర్టికల్ ప్రకారం ప్రతి పదేళ్ల కో సారి జరిగే జనగణన ప్రకారం జనాభాలో వచ్చిన మార్పుల ఆధారంగా లోక్‌సభ, ఆ యా రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలను జనాభా దామాషా ప్రకారం పుర్వ్యవస్థీకరించాలి. చట్టబద్ధంగా ఏర్పటయిన డీ లిమిటేషన్ కమిషన్ ఈ ప్రక్రియను కొనసాగించాలి.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో నాలుగు సార్లు డీలిమిటేషన్ ప్రక్రియ జరిగింది. 1951, 1961, 1971లో జనగణన ఆధారంగా 1952, 1963, 1973లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగింది. ఫలితంగా లోక్ సభ స్థానాల సంఖ్య 494 నుంచి 522కు పెరిగాయి. చివరగా 1971తర్వాత అవి 543కు చేరుకున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో పాటుగా వాటి సరిహద్దుల్లో మార్పులు కూడా ఇదే సమయం లో చోటు చేసుకుంది.

అయితే 1976లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను స్తంభింపజేసింది. జనా భా నియంత్రణను విజయవంతంగా అమ లు చేసిన రాష్ట్రాలు (ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల)నష్టపోయి జనాభా విపరీతంగా పెరిగిన రాష్రాలు (ఉత్తరాది రాష్ట్రాలు) ఎ క్కువ సీట్ల్లు పొందుతాయన్న భయాందోళనలు వ్యక్తమయిన నేపథ్యంలో జనాభా నియంత్రణ చర్యలను మరింతగా ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ తీసుకున్న చర్య వెనుక ముఖ్య ఉద్దేశం.

2001తో ఈ ని యోజకవర్గాల స్తంభన ముగియాల్సి ఉం డగా, 2002లో వాజపేయి హయాంలో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 2026 వరకు పొడించడం జరిగింది. ఫలితంగా 2002లో నియోజకవర్గాల పునర్వి భజన ప్రక్రియ నియోజకవర్గాల సరిహద్దుల్లో మార్పులు, ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మార్పుల వరకే పరిమితమైంది. ఇప్పుడు పూర్తిస్థాయి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సిన అతిపెద్ద సవాలు దేశానికి ఎదురవుతోంది. 2021లో జనగణన జరగాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ మహమ్మారి కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమయింది. 

సీట్ల పెంపు తప్పదా?

కొత్త పార్లమెంటు భవనాన్ని 888 మం ది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా డిజైన్ చేసిన నేపథ్యంలో లోక్‌సభ స్థానాల సం ఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు బలం గా ఉన్నాయి. ప్రతి జనగణన తర్వాత లోక్‌సభ స్థానాల సంఖ్యలో మార్పులు చేయా లని రాజ్యాంగంలోని 82వ ఆర్టికల్ చెప్తుండగా అదే రాజ్యాంగంలోని 81వ ఆర్టికల్ నియోజకవర్గాల సంఖ్యను 550కు( రా ష్రాలకు 530, కేంద్రపాలిత ప్రాంతాలకు 20) పరిమితం చేస్తోందని రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచార్య చెబుతున్నారు. అంటే మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచాలంటే 81వ అధికరణను సవరించాల్సి ఉంటుంది.

ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ గనుక అనుకున్నట్లుగా జరిగితే ఉ త్తరాది, దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ప్రాతినిధ్యంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటాయి. లోక్‌సభ స్థానాలు సంఖ్య 543గానే ఉంటే ఉత్తరాది రాష్ట్రాలు ము ఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 31 స్థానాలు పెరగనుండగా, దక్షిణాది రాష్ట్రాలయిన తమిళ నాడు, కేరళ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా లు 26 స్థానాలు కోల్పోనున్నాయి.

ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అధి కంగా ఉండడంతో పాటు సంతానోత్పత్తి కూడా ఎక్కువగానే ఉండడంతో రాజకీయ ప్రాధాన్యతల్లో అసమానతలకు దారి తీస్తుంది. అయితే 2019నాటి ఓ అధ్యయనం ప్రకారం లోక్‌సభ స్థానాల సంఖ్య గనుక 848కి పెరిగినట్లయితే నాలుగు ఉత్తరాది రాష్ట్రాల్లో 150 స్థానాలు పెరగనుండ గా దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం 35 సీట్లు మాత్రమే పెరుగుతాయి.

దీంతో నిర్ణయా లు తీసుకునే విషయంలో ఉత్తరాది ప్రాధాన్యత పెరిగిపోయి దక్షిణాది ప్రాధాన్యత గణనీయంగా తగ్గిపోతుంది. దేశ జీడీపీలో ఉత్తరాది రాష్ట్రాల వాటా 24 శాతం మాత్ర మే ఉండగా దక్షిణాది వాటా 31 శాతంగా ఉన్న నేపథ్యంలో ఇది ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. ఇప్పటికే నిధుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు కేవలం జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండరాదని వాదిస్తున్నాయి.

ఆర్థిక ఉత్పత్తి, పన్నుల చెల్లింపులు, అభివృద్ధి సూచికలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈ రాష్ట్రాలు వాదిస్తున్నాయి. ఉదాహరణకు దేశ జనాభాలో  కేవలం 2.8 శాతం మాత్రమే కలిగి ఉన్న తెలంగాణ రాష్ట్రం దేశ జీడీపీకి 5.2 శాతం అందిస్తోందన్న వాదనలో కూడా వాస్తవం ఉంది. 

దక్షిణాది రాష్ట్రాల భయం

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలి న్ ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాల నేతలందరినీ ఒక్క తాటిపైకి తేవడానికి నడుం బి గించడం వెనక రాజకీయ కారణాలకన్నా కూడా తమ రాజకీయ వాణిని, దేశ ఆర్థికాభావృద్ధికి తాము అందిస్తున్న తోడ్పాటు, ఫెడరల్ స్వయంప్రతిపత్తిని కాపాడుకోవ డం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మోదీ హయాంలో బీజేపీ దేశవ్యాప్తంగా తన రా జకీయ ఉనికిని విస్తరించుకొంటున్న నేపథ్యంలో  డీలిమిటేషన్ ప్రక్రియ ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతను కల్పించి తమ రాజకీయ ప్రభావాన్ని తగ్గించి వేస్తుందన్న భయాలే ఎక్కువగా ఉన్నట్లు కనిపి స్తుంది.

మూడు రోజుల క్రితం చెన్నైలో డీ లిమిటేషన్‌పై జరిగిన దక్షిణాది రాష్ట్రాల సమావేశంలో నేతలు వ్యక్తం చేసిన అభిప్రాయాలే దీనికి నిదర్శనం. రాజకీయాకు అతీతంగా సమావేశంలో పాల్గొన్న ప్రతి నేత కూడా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే ఇప్పటికే తగ్గిపోతున్నదక్షిణాది రాజకీయ ప్రాధాన్యత మరింత కనుమరుగవుతుందన్న ఆందోళనే వ్యక్తం చేయడం గమనార్హం.

అందుకే ఈ అంశంపై దేశవ్యాప్తంగా కలిసివచ్చే అన్ని పార్టీలతో జాతీయ స్థాయిలో  ఉద్యమానికి సిద్ధం కావాలని నిర్ణయించారు. అంతేకాదు ఒక వేళ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగిన పక్షంలో జనాభాతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడానికి రాజ్యసభను పునర్నిర్మించాలని దక్షిణాదికి చెందిన కొందరు నేతలు వాదిస్తున్నారు. ఈ వాదనలో కూడా కొంత న్యాయం ఉందనిపిస్తుంది.

రాజకీయాల ఉద్దేశాలు!

అయితే ఎంకే స్టాలిన్  త్రిభాషా సమస్యతో పాటుగా డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తేవడం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఇప్పటికి జనగణన ప్రక్రియ మొదలే కాలేదని, అది పూర్తయిన తర్వాత డీ లిమిటేషన్ కమిషన్ ఏర్పాటు, నియోజకవర్గాల పునర్విభజన జరగడానికి చాలా సమయం పడుతుందనేది వారి వాదన.

ఏమీ లేని అంశాన్ని భూతద్దంలో చూపించి దాన్ని ఒక జాతీయ అంశంగా చేయాలని చూడడం సరికాదనేది వారి వాదన. అంతేకాదు డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ లాంటి నేతలు స్పష్టంగా చెబుతున్నారని కూడా వారంటున్నారు. అయితే దక్షిణాది సీట్లు తగ్గవని మాత్రమే అంటున్నారు తప్ప ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరగవన్న మాట ఆ నేతలు చెప్పడం లేదనేది దక్షిణాది నేతల వాదన.

అయితే ఉత్తరప్రదేశ్‌లో సగటున ఒక ఎంపీ 31 లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తుంటే తమిళనాడులో  కేవలం 20 లక్షల ఓటర్లకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న మాట నిజం. ఈశాన్య రాష్ట్రాలో ఈ ప్రాతినిధ్యం మరీ తక్కువ. ఈ తేడాను సరిచేయాల్సిన అవసరం అయితే ఉందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఈ డీ లిమిటేషన్ ప్రక్రియ అనేది ఓ తేనెతుట్టెను కదపడమే. ఆ పని జరిగిపోయింది. పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.  

--- కె.రామకృష్ణ