calender_icon.png 30 September, 2024 | 4:48 AM

మగాళ్లలోనే గుండెజబ్బులు ఎందుకెక్కువ?

30-09-2024 02:08:09 AM

  1. 70 శాతం పురుషులే హృద్రోగాలకు బలి
  2. హార్మోన్లు, జీవనశైలి, ఆహార అలవాట్లే కారణం
  3. ధూమపానం, మద్యపానంతో మరింత ప్రమాదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: సాధారణంగా మహిళల కన్నా పురుషులు గుండె జబ్బుల కు ఎక్కువగా గురవుతారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం ఏటా హృద్రోగాలతో 1.79 కోట్ల మంది చనిపోతున్నారు. ఇందులో పురషుల సంఖ్యే ఎక్కువ.

అంతేకాకుండా చిన్న వయసులో గుండె జబ్బులతో చనిపోయేవారిలోనూ పురుషులే 70 శాతం ఉంటున్నారు. ఇందు కు అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జీవసంబంధమైన కారణాలతో పాటు హార్మోన్లు, జీవనశైలిలో స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసమే హృద్రోగ సమస్యలు మగవాళ్లలో ఎక్కువగా రావడానికి కారణమనిపేర్కొంటున్నారు.  

అనేక కారణాలు

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషులు ధూమపానం, మద్యపానం ఎక్కువగా సేవిస్తారు. అంతేకాకుండా పురుషులు అధికంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండే ఉద్యోగాలు చేయడమూ మరో కారణం. పని ఒత్తిడిని నియంత్రించుకోకపోతే బీపీ పెరుగుతుందని, తద్వారా హృద్రోగాలకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు.

అంతేకాకుండా జన్యుపరమైన అంశం కూడా తోడవుతుందని, కొంతమందిలో ఆవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని, ఇది చర్మం కింద నిల్వ ఉండే కొవ్వు కన్నా ప్రమాదకరమైందని వివరిస్తున్నారు. ఆవయవాల చుట్టూ ఉండే కొవ్వుతో బీపీ, మధుమేహానికి దారి తీస్తాయని చెబుతున్నారు. చెడు కొలస్ట్రాల్ (ఎల్ డీఎల్) కూడా పురుషుల్లోనే ఎక్కువగా చేరుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 

హార్మోన్లలో వ్యత్యాసం

గుండెజబ్బులు రావడంలో హార్మోన్లలో వ్యత్యాసం ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆడవాళ్లలో రుతుక్రమం ఆగిపోవడానికి ముందు ఉత్పత్తయ్యే ఈస్ట్రోజెన్.. కొలస్ట్రాల్ స్థాయిలతో పాటు రక్తనాళాలను మెరుగుపరచడంతో గుండెకు రక్షణను అందిస్తుంది. రుతుక్రమం ఆగిపోయిన తర్వాత స్త్రీలలోనూ ప్రమాదం పెరుగుతుందని కానీ, పురుషుల కంటే దాదాపు 10 ఏళ్లు వెనకబడే ఉంటారు. మగవాళ్ల విషయానికి వస్తే ఈస్ట్రోజన్ ప్రయోజనం ఉండదు.

అంతేకాకుండా ధూమపానం, బయటి ఆహారం, నిశ్చలమైన ప్రవర్తన వంటి జీవనశైలి కారకాలు పురుషుల్లో గుండె జబ్బులకు దారితీస్తున్నాయి. పొగతాడటం వల్ల కరోనరీ ధమనులు తొంద రగా కుచించుకుపోతాయి. వీటిల్లో ఫల కం వంటి అడ్డుగోడ ఏర్పడి రక్త ప్రసరణ ను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.