డా. తిరుణహరి శేషు :
తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి సమాయత్తమవుతున్నది. ఈ సంవత్సరం చివరినాటికి గ్రామ పంచాయతీ, మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాల ఎన్నికలను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండబోతున్నాయి? ప్రజలు ప్రధానంగా ఎవరివైపు నిలువబోతున్నారు? ఏ పార్టీ స్థానిక సంస్థల ఎన్ని కలలో పై చేయి సాధిస్తుందనే చర్చలు జరుగుతున్నాయి.
2019 స్థానిక సంస్థల ఎన్నికలలో అప్పటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని సాధించింది. కానీ, ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో భారీ విజయాన్ని నమోదు చేయడానికి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు అటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ లు మూడు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో 16వ ఆ ర్థిక సంఘం పర్యటించింది. ఈ నేపథ్యం లో గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులను పొందటానికి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సిన అనివార్యత ఏర్పడింది. కొత్తగా ఏర్పడే గ్రామ పంచాయతీలు సహా మొత్తం 12,966 గ్రామ పంచాయతీలకు (ప్రస్తుతం 12,769 గ్రామ పంచాయతీలు) 538 జిల్లా ప్రాదేశిక నియోజక వర్గాలకు, 5817 మండల ప్రాదేశిక నియోజక వర్గాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది.
అప్పుడు బీఆరెస్‌దే పైచేయి
2019 స్థానిక సంస్థల ఎన్నికలలో నాటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించిందని చెప్పాలి. 12,751 గ్రామ పంచాయతీలలో 7,774 గ్రామ పంచాయతీలలో అంటే 60 శాతం గ్రామ పంచాయతీలలో బీఆర్‌ఎస్ సానుభూతిపరులే గెలుపొందారు. అలాగే, 538 జడ్‌పీటీసీలలో 446 జడ్‌పీటీసీలను, 5817 ఎంపీటీసీలలో 356 ఎంపీటీసీలను ఈ పార్టీ గెలుపొందింది. ఒక రకంగా ప్రత్యర్థులకు అందనంత దూరంలో బీఆర్‌ఎస్ ఈ విజయాన్ని నమోదు చేసిందనే చెప్పాలి. ఆనాడు 32 జిల్లా పరిషత్‌లకుగాను మొత్తం జిల్లా పరిషత్తులను కైవసం చేసుకుని 100 శాతం విజయాన్ని బీఆర్‌ఎస్ నమోదు చేసి తన బలాన్ని నిరూపించుకుంది.
అయితే, సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకే చాలావరకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి, దీని ఆధారంగానే 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్‌ఎస్ అంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందని చెప్పాలి. కానీ, ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ వాతావరణం పూర్తిగా తలకిందులైంది. అసలే, శాసనసభ ఎన్నికలలో ఎదురైన ఓటమికితోడు లోక్‌సభ ఎన్నికలలో ఎదురైన దారుణ పరాజయం నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్‌ఎస్ ఏ విధంగా నెగ్గుకు రాగలుగుతుందనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గతంలో బీఆర్‌ఎస్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ మారటం వల్ల కూడా ఆ పార్టీ క్షేత్రస్థాయిలో కొంత బలహీన పడినట్లుగానే కనిపిస్తున్నది.
అంతటి విజయం సాధ్యమేనా?
స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలంగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీ 2019లో బీఆర్‌ఎస్ సాధించిన స్థాయి విజయాన్ని ఇప్పుడు అందుకోగలుగుతుందా? అనే చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతున్నది. 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో 2,079 గ్రామ పంచాయతీలను అంటే 21 శాతం గ్రామ పంచాయతీలను, 75 జడ్‌పీటీసీలను, 1,377 ఎంపీటీసీలను మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలువగలిగింది. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండటం, క్షేత్ర స్థాయిలో పార్టీ బలం పెరగడంతో గతంలోకంటే ఎక్కువ స్థానాలలో విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.
ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాలలో కాంగ్రెస్‌కి పూర్తి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. కానీ, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌ల నుండి గట్టి పోటీనే ఎదురవుతుంది. రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీలో కేవలం 23 లక్షల మంది రైతులకే లబ్ధి జరగటం, చాలామంది రైతులు రుణమాఫీకి అర్హత సాధించలేక పోవడం కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలపై కొంతవరకు ప్రభావం చూపవచ్చునని తెలుస్తున్నది.
మూడో పార్టీ మాటేమిటి?
2019 స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ 163 గ్రామ పంచాయతీలు అంటే 1.2 శాతం గ్రామ పంచాయతీలను, ఎనిమిది జడ్పీటీసీలను, 211 ఎంపీటీసీలను మాత్రమే గెలువగలిగింది. అప్పట్లో గ్రామీణ ప్రాంతాలలో బీజేపీకి పెద్దగా సంస్థాగతంగా బలం లేదు. దీనివల్ల స్థానిక సంస్థలలో ఆ పార్టీది పేలవమైన ప్రదర్శనగానే చెప్పాలి. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికలలో ఎనిమిది లోక్‌సభ స్థానాలలో గెలుపొందింది. తద్వార తన ఓటు బ్యాంకుని 35 శాతానికి పెంచుకోగలిగింది. ఫలితంగా బీజేపీ గతంలోకంటే మెరుగైన విజయాలు సాధించే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నాయి.
గ్రామ స్వరాజ్యం ఎప్పటికి?
తెలంగాణ రాష్ట్రంలో 61 శాతం జ నాభా గ్రామీణ ప్రాంతాలలోనే ఉంది. రా ష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ప్రధానంగా గ్రామీ ణ వ్యవస్థ బలోపేతంపైనే ఆధారపడి ఉంటాయి. రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం కో సం స్థానిక సంస్థలను ముఖ్యంగా గ్రామ పంచాయతీల వ్యవస్థను మరింత బలోపే తం చేయాల్సిన అవసరం ఉందనే వాస్తవాన్ని అందరూ గుర్తించాలి. ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి గ్రామ్ ఆవాస్ యోజన, రూరల్ హెల్త్ మిషన్ లాంటి కేం ద్ర ప్రాయోజిత పథకాలతోపాటు రాష్ట్ర ప్ర భుత్వ గ్రామీణ ప్రాయోజిత పథకాలనూ సమన్వయం చేసుకోవలసి ఉంది. ఈ నేతృత్వంలో స్వయం సహాయక బృందాలను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను బలోపేతం చేయగల అంకితభావం, సమర్థత, నైపుణ్యం గల గ్రామీణ నాయకత్వం ఎన్నిక కావాల్సి ఉంది.
అప్పుడే స్థానిక సంస్థలు ఆశించిన స్థాయిలో పరిపుష్టమవుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు బడ్జెట్‌లలో కేటాయిస్తున్న నిధులను పక్కదారి పట్టించకుండా పూర్తిస్థాయిలో వినియోగించవలసి ఉంటుంది. ఈ రకమైన కృషి జరిగినప్పుడే మహాత్మా గాంధీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు ఓటములు ఆయా పార్టీల బలాబలాలతోపాటు స్థానిక నాయకత్వం, సమస్యలపైనా ఒకింత ఆధారపడి ఉంటాయి. పార్టీల జయాపజయాలను ఇవి కూడా తగిన మేరకు ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. కాబట్టి, రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా పై మూడు (కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్) పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారాయనే చెప్పాలి.
వ్యాసకర్త సెల్: 9885465877