calender_icon.png 11 February, 2025 | 12:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరి ఎత్తుగడలేంటి!

11-02-2025 12:57:02 AM

రాష్ట్రంలోని ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు

  1. మూడుచోట్లా బరిలో బీజేపీ అభ్యర్థులు 
  2. కేవలం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ పోటీ
  3. ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ పూర్తిగా దూరం 
  4. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మద్దతు ఎవరికనే అంశంపై చర్చ

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): తెలంగాణలో కరీంగనర్ -ఆది లాబాద్- నిజామామాద్-మెదక్,  నల్లగొండ-ఖమ్మం-వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు, కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నడుస్తున్నది. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజే పీ మాత్రమే మూడింటా తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించింది.

రెండు టీచర్ ఎమ్మెల్సీల స్థానాల్లో బీజేపీ అభ్యర్థులుగా మల్క కొమురయ్య, సరోత్తమ రెడ్డిని బరిలో నిలిచారు. రెండుచోట్లా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయి. కరీంనగర్- ఆదిలాబాద్- నిజామాబాద్  మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి బరిలో  ఉన్నారు.

ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ స్థానంలోనూ బీఆర్‌ఎస్ పోటీకి దూరం ఉంది. ఇలా  బీజేపీ మూడుచోట్ల బరిలో ఉండడం, కాంగ్రెస్ కేవలం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేయడం, బీఆర్‌ఎస్ ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండడంపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. ఎన్నికలపై మూడు పార్టీల ఎత్తుగడలేంటనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

బీఆర్‌ఎస్ అనాసక్తిపై చర్చ..

నల్లగొండ- వరంగల్- ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి పీసీసీ అధికార ప్రతినిధి, పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు గాలిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఈయనకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందా? అనే అంశంపై ఎవరికీ స్పష్టత లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరులైన టీచర్లు ఎవరిపక్షాన నిలుస్తారనే ప్రశ్న తలెత్తింది.

మరోవైపు బీఆర్‌ఎస్ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ పోటీకి దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. పార్టీ ఆవిర్భా వం నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు పోటాపోటీగా ఎన్నికల్లో చేసిన బీఆర్‌ఎస్.. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత పోటీకి దూరంగా ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

బీజేపీతో లోపాయికారి ఒప్పందాలు చేసుకునే మండలి ఎన్నికలకు బీఆర్‌ఎస్ దూరంగా ఉందని కాంగ్రెస్ నేత లు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు సోమవారంతో గడువు ముగిసింది. ఆయా స్థానాల్లో పలువురు ఉపా ధ్యాయ సంఘాల నేతలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా మంది నామినేషన్లు వేశారు.

నామినేషన్ల ఉప సంహరణ తర్వా త, వీరిలో ఎంతమంది బరిలో ఉంటారనే అంశం పై మూడు రోజుల్లో  స్పష్టత రానున్నది. ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వారికి మద్దతుగా రాజకీయ పార్టీలు, ఉపాధ్యా య సంఘాలు జిల్లాలు, నియోజక వర్గాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల మద్దతు కూడగట్టుకునే పనిలో బిజీ బిజీగా ఉన్నాయి.

  1. బీఆర్‌ఎస్ శ్రేణుల అసంతృప్తి 

    ఏఎఫ్‌బీ నుంచి రవీందర్ సింగ్ నామినేషన్

    కరీంనగర్, (విజయక్రాంతి): పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్‌ఎస్ బరిలో నిలవకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక లు ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో జరుగ నున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ స్థానాలు, ఆరు పార్లమెంటరీ సెగ్మెంట్లు ఉండగా, 3.41 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు.

    ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోనే గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యేగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీశ్‌రావు, నిజామా బాద్ నుంచి ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ తరఫున అభ్యర్థిని బరిలో దించితే బాగుంటుందని పార్టీ శ్రేణులు భావించాయి.

    దీనిలో భాగంగానే తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుందని కరీంనగర్  మాజీ మేయర్ రవీం దర్ సింగ్ ఆశించారు. నామినేషన్ దాఖలుకు చివరి రోజైనా సోమవార మూ పార్టీ నుంచి స్పందన లేకపోవడంతో ఆయన ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఎఫ్‌బీ) తరఫున నామినేషన్ వేశారు.

    ఈయనతోపాటు ఆ పార్టీకి చెందిన మరో నేత డాక్టర్ బీఎన్ రావు కూడా ఎమ్మెల్సీ సీటు ఆశించి భంగపడ్డారు. పోటీ చేయకపోవడంతో పార్టీ శ్రేణులు అసంతృప్తివ్యక్తంచేస్తున్నారు.

      ముగిసిన నామినేషన్ల పర్వం

      1. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ౬౭ దాఖలు
      2. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి 100 దాఖలు


      కరీంనగర్/నల్లగొండ, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు సోమవారంతో ముగిసింది. వరంగల్ (వరంగల్- ఖమ్మం-నల్లగొండ) ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 23 మంది అభ్యర్థులు 50 నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం వరకు 18 మంది 23 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. సోమవారం ఏకంగా 27 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.

      కరీంనగర్(కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.