- శ్రీలక్ష్మీశ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ వ్యవహారంలో వెలుగు చూస్తున్న నిజాలు
- 2018లో 20 ఎకరాల్లో 360 విల్లాల నిర్మాణం
- అందులో 300 విల్లాలు నకిలీవని నిర్ధారించి 2021లో సీజ్ చేసిన కలెక్టర్ హరీశ్
- రాజకీయ నాయకుల ఎంట్రీతో అంతా సైలెంట్
- ఇప్పటికే 360 విల్లాలను సేల్ చేసిన బిల్డర్ విజయలక్ష్మి
- తాజాగా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో 26 విల్లాలను గుర్తించిన హైడ్రా
- 11 కూల్చివేత, మరో 15 విల్లాలకు నోటీసులు
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ఆమె ఒక ఎన్‌ఆర్‌ఐ మహిళ. పేరు విజయలక్ష్మి. విదేశాల్లో సంపాదించిన డబ్బుతో నగర శివా రులోని దుండిగల్ గ్రామ రెవెన్యూ పరిధిలో మాజీ సైనికులకు సంబంధించిన సుమారు 15 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఆ భూమి పక్కనే ఉన్న మరో 5 ఎకరాల చెరు వు (ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లకు సంబంధించి న) భూమిని కలిపేసుకుంది. శ్రీలక్ష్మీశ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ సంస్థను స్థాపించి అన్ని పార్టీల రాజకీయ నాయకుల మద్దతును కూడ గట్టుకుంది.
పంచాయతీ, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను తన చెప్పుచేతల్లో పెట్టుకుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 360 విల్లాలను నిర్మించి రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్లకే ఒక విల్లా అంటూ ప్రచారం చేసింది. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోనే ఉండడంతో మెజా ర్టీ ఐటీ ఉద్యోగులు ఎగబడి కొనుగోలు చేశా రు. కానీ, హైడ్రా ఎంట్రీతో విల్లాలు కొనుగోలు చేసిన అమాయక ప్రజల కలల సౌధా లు నేలమట్టమయ్యాయి. విల్లాలను విక్రయించిన ఎన్‌ఆర్‌ఐ మహిళ, ఆమెకు అండ గా నిలిచిన అన్ని పార్టీల రాజకీయ నాయకులు పత్తాలేకుండా పోయారు. కానీ, కోట్లు పోసి ఖరీదైన విల్లాలను కొనుగోలు చేసిన వారు రోడ్డున పడ్డారు.
అది మాజీ సైనికుల భూమి..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూ ర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 170/3, 170/4, 170/5 లో వందల ఎకరా ల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని సాగు చేసుకునేందుకు మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించింది. ఇందు లోని సుమారు 15 ఎకరాల స్థలంను భూములను ఎన్‌ఆర్‌ఐ విజయలక్ష్మి అనే మహిళ కొనుగోలు చేసింది. ఈ స్థలం పక్క నే ఉన్న మల్లంపేట కత్వ చెరువుకు సంబంధించిన ఓ ఐదు ఎకరాల స్థలాన్ని కలిపి మొత్తం 20 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పా టు చేసింది. అనంతరం రియల్టర్‌గా మారిన విజయలక్ష్మి 2018లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను స్థాపించింది.
360 విల్లాల నిర్మాణం..
శ్రీలక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ సంస్థ పేరు తో 20 ఎకరాల స్థలంలో 360 విల్లాలను నిర్మించేందుకు విజయలక్ష్మి స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా 2018లో 360 విల్లాలకు పంచాయతీ అనుమతులు ఇచ్చిందం టూ నమ్మబలికి నకిలీ అనుమతులను గ్రామ పంచాయతీ అనుమతులుగా చూపు తూ మొత్తం 20 ఎకరాల్లో 360 విల్లాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
కానీ పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. దీంతో హెచ్‌ఎండీఏను ఆశ్రయించి 2020లో 60 విల్లాలకు అనుమతులు పొందింది. కానీ 2021లో స్థానిక ప్రజల ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టిన అప్పటి మేడ్చల్ కలెక్టర్ హరీశ్.. నకిలీ అనుమతులతో నిర్మించిన సుమారు 300 విల్లాలను సీజ్ చేసి విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు పెట్టారు. హెచ్‌ఎం డీఏ అనుమతులు ఉన్న విల్లాలను సేల్ చేసుకోవచ్చని, అనుమతులు లేని విల్లాలను మాత్రం సేల్ చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.
హైడ్రా ఎంట్రీతో సీన్ రివర్స్..
విజయలక్ష్మి చెరువు స్థలం ఆక్రమించి 5 ఎకరాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల స్థలం లో 27 విల్లాలను నిర్మించినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. విచారణ చేపట్టి న హైడ్రా అధికారులు.. మల్లంపేట కత్వ చెరువుకు సంబంధించిన సుమారు 5 ఎకరాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ స్థలం ఆక్రమించి 26 విల్లాలను నిర్మించినట్లు గుర్తించారు. అలాగే ఎఫ్‌టీఎల్, బఫర్ పరిధిలోకి వస్తున్న విల్లాలకు మార్కింగ్ చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు 11 విల్లాలను కూల్చివేశారు. అయితే, మరో 15 విల్లాలో ప్రజలు నివాసం ఉంటుండడంతో వారికి 15 రోజుల్లో ఖాళీ చేయా లని సూచిస్తూ నోటీసులు జారీ చేశారు. మరో 15 రోజుల్లో వాటిని కూడా కూల్చేస్తామని హైడ్రా అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
నాడు కోట్లు పోసి కొన్నారు.. నేడు రోడ్డున పడ్డారు
శ్రీలక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ సంస్థ నిర్మించిన విల్లాలు హైటెక్‌సిటీకి దగ్గరగా ఉండడంతో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగులు ఈ విల్లాలను కొనుగోలు చేసిన వారిలో ఉన్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో విల్లాలకు రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ధర పలుకుతున్నప్పటికి విజయలక్ష్మి కేవలం రూ.1.50 కోట్లు మొదలుకొని రూ.2 కోట్లకు ఒక విల్లా చొప్పున విక్రయించారు. దీంతో అత్యాశకు పోయిన చాలా మంది విల్లాలను ఎగబడి కొనుగోలు చేశారు. అయితే, హైడ్రా 11 విల్లాలను నేలమట్టం చేయడంతో కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ప్రజలు రోడ్డున పడ్డారు. కాగా, రెండు నెలల క్రితం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలోకి వస్తున్నాయని ఏడు విల్లాలకు మాత్రమే అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం 26 విల్లాలకు మార్కిం గ్ ఇవ్వడంతో విల్లాలను కొనుగోలు చేసిన వ్యక్తులు హైడ్రా అధికారులపై మండిపడుతున్నారు.
ఇప్పటికి ఇంటి పన్ను, కరెంట్ బిల్లు ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని, ప్రభుత్వం విధించే అన్ని రకాల పనులు చెల్లిస్తున్నా తమ విల్లాలను ఎలాంటి ముందస్తు నోటీసులు జారీ చేయకుండా కూల్చడం పై కోర్టును ఆశ్రయిస్తామని బాధితులు పేర్కొంటున్నారు.
ఆమె మన మనిషే..
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రాజకీయ నాయకులు విజయలక్ష్మికి మద్దతుగా నిలిచారు. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాకుండా అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. విజయలక్ష్మి పంచే కాసులకు కక్కుర్తి పడిన రాజకీయ నాయకులు ఆమె మన మనిషే అంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో అప్పటి వరకు హల్‌చల్ చేసిన అధికారు లు అందినకాడికి దండుకొని సైలెంట్ అయ్యారు. పూర్తిస్థాయి బిల్డర్ అవతా రం ఎత్తిన విజయలక్ష్మిముందస్తు ప్లాన్ ప్రకారం 20 ఎకరాల్లో 360 విల్లాలను నిర్మించి రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్లకు ఒక విల్లా చొప్పున మొత్తం విల్లాలను సేల్ చేసింది.ఇందులో పార్కు స్థలంలో నిర్మించిన విల్లాలు కూడా ఉన్నాయి. ఇటీవల పార్కు స్థలాన్ని సైతం ప్లాట్లుగా చేసి నిర్మాణాలు జరిపేందుకు విక్రయించగా స్థానికులు అడ్డుకున్నారు.