calender_icon.png 16 January, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్ణయాలు ఎవరివి?

16-07-2024 12:45:46 AM

కాళేశ్వరంపై ఐఏఎస్‌లను విచారించిన జస్టిస్ ఘోష్ కమిషన్

డీపీఆర్, డిజైనింగ్‌లో వారి పాత్రపై ఆరా

బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖకు నోటీసులు

ఆగస్టు 5లోపు అఫిడవిట్ ఇవ్వాలని రామకృష్ణారావుకు ఆదేశం

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్‌కు వివరించిన కే రఘు

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ సోమవారం పలువురు ఐఏఎస్ అధికారులను ప్రశ్నిం చింది. బరాజ్‌ల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై 10 మంది ఐఏఎస్‌లను విచారించింది. వికాస్‌రాజ్, రామకృష్ణారావు, స్మితా సబర్వాల్, రజత్‌కుమార్, రాహుల్ బొజ్జా, ఎస్‌కే జోషీ తదితరులు కమిషన్ ముందు హాజరయ్యారు. విద్యుత్ శాఖ అధికారి కంచర్ల రఘు సైతం కమిషన్ ముందు హాజరై వివరాలు అందించారు.

కాళేశ్వరం ప్రాజె క్టుల నిర్మాణం డీపీఆర్, డిజైన్, కీలక నిర్ణయాలు, అమలు చేసిన విధానాలు, నిర్మాణ లోపాలపై కమిషన్ వారిని ప్రశ్నించింది. తుమ్మిడిహట్టి వద్ద కాకుండా మేడిగడ్డ దగ్గర బరాజ్ నిర్మాణం, అక్కడ జియోలాజికల్ సర్వే విషయంలో ఉన్నతాధికారులు ఏం పరిశీలన చేశారని ఐఏఎస్‌లను కమిషన్ ప్రశ్నించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టులపై తీసుకున్న నిర్ణ యాలు, వాటి అమలుతీరు తదితర అంశాలన్నీ అధికారులు కమిషన్‌కు వివరించారు. నిర్మాణ లోపాలు, బిల్లుల చెల్లింపులపై నివేదికల ఆధారంగా కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. గత ప్రభుత్వం చెప్పినట్లే తాము చేశామని, కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినా పాలకులు పరిగణనలోకి తీసు కోలేదని అధికారులు సమాధానమిచ్చినట్టు తెలిసింది.

కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక అంశాలపై రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో సీఎం కార్యాలయంలో నీటిపారుదలశాఖ బాధ్యతలను చూసిన స్మితా సబర్వా ల్‌పై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణ వివరాలను స్మి తాసబర్వాల్‌ను కమిషన్ ప్రశ్నించినట్లు తెలి సింది. అధికారులు చెప్పిన విషయాలన్నీ అఫిడవిట్ రూపంలో వారంలోగా సమర్పించాల ని కమిషన్ ఆదేశించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో మరింత గడువు కావాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కోరగా, ఆగస్టు 5లోపు అఫిడవిట్ సమర్పించేందుకు అనుమతించింది. విచారణకు స్మితా సబర్వాల్, రజత్‌కుమార్, వికాస్‌రాజ్, రామకృష్ణారావు, రాహుల్ బొజ్జా, కంచర్ల రఘు ప్రత్యక్షంగా, మాజీ సీఎస్ ఎస్కే జోషి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

నాకేం సంబంధం లేదు: స్మితా సబర్వాల్

సోమవారం విచార ణలో ఐఏఎస్ అధికారులకు ఒక్కొక్కరికి కమిషన్ సుమారు 20 నిమిషాల వరకు సమయమిస్తే... గత ప్రభుత్వంలో సీఎంవో కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్‌ను మాత్రం సుమారు గంటపాటు విచారించినట్టు సమాచారం. ప్రధానంగా సీఎంవోలో జరిగిన అంశాలు, నివేదికలపై ప్రశ్నించింది. స్మితా సబర్వాల్ మాత్రం తనకేం సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. తాను సీఎంవో కార్యదర్శిగా పనిచేశానని, తనకు కాళేశ్వరం ప్రాజెక్టుతో సం బంధం లేదని, పాలనాపరమైన అంశాలను మాత్ర మే పర్యవేక్షించానని చెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుతో తనకు ఏ విధంగానూ సంబంధం లేదని, ఏ నివేదిక కూడా తన వద్దకు రాలేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి పదవీ విరమణ చేసిన రజత్‌కుమార్‌ను ఆయ నపై వచ్చిన ఆరోపణలను ఉటంకిస్తూ కమిషన్ సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఓ నిర్మాణ సంస్థ నుంచి లబ్ధి పొందారనే ఆరోపణలను కూడా ప్రస్తావించినట్టు తెలిసింది. 

మేడిగడ్డకు మార్చటమే తప్పు: రఘు

ప్రాణహిత- చేవెళ్ల మార్పు, మూడు బరాజ్‌ల నిర్మాణం, నాణ్యత అంశాలతో పాటు పంప్‌హౌస్‌ల మునకపై సమగ్రం గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిషన్‌కు వివరించినట్లు విద్యుత్ శాఖ అధికారి కంచర్ల రఘు తెలిపారు. ప్రాజె క్టు ప్రారంభాన్ని తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడమే ప్రధాన తప్పు అని చెప్పారు. 148 మీటర్ల వద్ద కూడా పూర్తి నీటిని ఎలా తీసుకోవచ్చో కమిషన్‌కు వెల్లడించినట్లు పేర్కొన్నారు. బరాజ్ నిర్మాణం మార్పువల్ల ప్రజలపై ఊహించని భారం పడిందని, ఏటా నిర్వహణ కూడా చాలా కష్టమన్నారు. ౨ లక్షల ఎకరాల ఆయకట్టును కోల్పోవడమే కాకుం డా వేల ఎకరాలు ఏటా ముంపునకు గురవుతోందన్నారు. బరాజ్‌ల నిర్మా ణం, కాంట్రాక్టుల నిర్వహణ గురించి కూడా కమిషన్‌కు వివరించినట్లు తెలిపా రు.

డీపీఆర్ ఆమోదానికి ముందే బరాజ్‌లు నిర్మించటంతో డిజైన్లలో లోపాలు వచ్చాయన్నారు. బరాజ్‌ల స్థలాల ఎంపికలో కూడా చాలా లోపాలున్నాయని, ఈపీసీ ఒప్పందం ప్రకారం ప్రక్రియ జరగలేదని చెప్పారు. కాంట్రాక్టర్‌కు నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారని ఆరోపించారు. 2019లో బరాజ్‌ల నిర్మాణం పూర్తయ్యాక కనీసం వాటి నిర్వహణ కూడా చేపట్టలేదని, అందుకే దెబ్బతిన్నాయని కమిషన్‌కు వివరించారు. పంప్ హౌస్‌లను నదిమట్టం కంటే దిగువన నిర్మించారని, దీంతో మేడిగడ్డ, అన్నారం పంప్‌హౌస్‌లు మునిగిపోయాయన్నా రు. ప్రాజెక్టుల్లో సమస్యలుంటాయని, కానీ సమస్యలకు గల కారణం ముఖ్యమన్నారు. అంచనాలు తప్పుగా వేయ డంతోపాటు డిజైన్లలో అనేక లోపాలున్నాయని, త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఇంజినీర్లకు సమయం ఇవ్వలేదని రఘు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.