calender_icon.png 31 October, 2024 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరు గెలిచినా తొలిసారే!

27-06-2024 05:15:59 AM

టరోబా (ట్రినిడాడ్): అంచనాలకు మించి రాణిస్తూ.. మేటి జట్లను ఇంటిబాట పట్టించి సెమీఫైనల్ చేరిన అఫ్గానిస్థాన్.. నేడు దక్షిణాఫ్రికాతో కీలక పోరులో తలపడనుంది. గ్రూప్ నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను తోసిరాజని.. భారత్‌తో పాటు సెమీఫైనల్లో అడుగుపెట్టిన అఫ్గాన్.. సఫారీలపై కూడా అదే జోరు కనబర్చాలని చూస్తోంది. నిరుడు వన్డే ప్రపంచకప్‌లోనే సంచలన ప్రదర్శనతో రెచ్చిపోయినా.. లీగ్ దశతోనే సరిపెట్టుకున్న అఫ్గాన్ ఈసారి మాత్రం తమ కల నెరవేర్చుకుంది.

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌తో పోటు.. ఫీల్డింగ్‌లోనూ చక్కటి ప్రదర్శన కనబరుస్తున్న అఫ్గాన్.. ఫైనల్ చేరాలని పకడ్బందీ ప్లాన్స్‌తో ఉండగా.. ఐసీసీ టోర్నీల్లో దురదృష్టాన్ని వెంట పెట్టుకొని తిరిగే దక్షిణాఫ్రికా.. చోకర్స్ ముద్ర చెరిపేసుకోవాలని తాపత్రయ పడుతోంది. లీగ్ దశలో న్యూజిలాండ్‌పై సూప ర్ ఆస్ట్రేలియాపై విజయాలు సాధించిన అఫ్గాన్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. జట్టంతా హిట్టర్లతో నిండి ఉన్న దక్షిణాఫ్రికా ఎలాంటి పొరబాట్లకు అవకా శం ఇవ్వకూడదని భావిస్తోంది.

ఇరు జట్లలో ఎవరు నెగ్గినా.. వాళ్లకు అదే తొలి టీ20 ప్రపంచకప్ ఫైనల్ కానుంది. బలాబలాల పరంగా చూసుకుంటే.. అఫ్గాన్ కంటే దక్షిణాఫ్రికా పటిష్టంగా కనిపిస్తున్నా.. కాబూలీలను తక్కువ అంచనా వేయడానికి లేదని ఇదే టోర్నీలో ఒకటికి రెండుసార్లు నిరూపించిన విషయాన్ని మర్చిపోకూడదు. అఫ్గాన్‌కు బ్యాటింగ్‌ను గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా, నైబ్, నబీ కీలకం కానుండగా.. బౌలింగ్‌లో కెప్టెన్ రషీద్‌ఖాన్, నవీన్, ఫజల్‌హక్, నూర్, నైబ్ సత్తాచాటుతున్నారు.