calender_icon.png 23 December, 2024 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్యానా ‘దంగల్’లో గెలుపెవరిది?

06-09-2024 12:00:00 AM

ఐ.వి.మురళీ కృష్ణశర్మ :

రాజకీయాల్లో అతివిశ్వాసం మితిమీరితే మొదటికే మోసం ఏర్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇందుకు ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ‘చార్ సౌ పార్’ అంటూ ఊదరగొట్టిన బీజేపీ బొక్కబోర్లా పడిన ఉదంతాన్ని ప్రస్తావించవచ్చు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న హర్యానాలో బీజేపీకి తిరుగులేదని, కాంగ్రెస్‌కు అక్కడ మరోసారి భంగపాటు తప్పదని పార్లమెంట్ ఎ న్నికల సందర్భంగా పలు ప్రముఖ సర్వేలు వెల్లడించినా రెండు పార్టీలు పోటాపోటీగా తలపడి చెరో ఐదు స్థానాలు దక్కించుకున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఐదు నెలల వ్యవధిలో అక్టోబర్ 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల తర్వాత రాష్ట్రంలో విజయం ఖాయమనే నమ్మకం కాంగ్రెస్‌లో పెరిగింది. అధికారంపై ఆత్మవిశ్వాసంతో ఉన్న కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలూ తీవ్రంగానే ఉన్నాయి. పార్టీ కలహాలు మల్లయోధుల క్షేత్రమైన హర్యానా ఎన్నికల ‘దంగల్’లో ఏ మేరకు ప్రభావితమవుతాయో చూడాలి.

తీవ్రంగా ప్రభుత్వ వ్యతిరేకత

హర్యానాలో రెండు పర్యాయాలు వరుసగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభు త్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఇది పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రస్ఫుటమైంది. లోక్‌సభ ఎన్నికల్లో 2014లో 7,2019లో 10 స్థానాలు గెల్చిన బీజేపీ 2024లో ఐదు సీట్లకే పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్ ఎదుగుదల క్రమంగా పెరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకుగాను 20.58 శాతం ఓట్లతో 15 స్థానాలు గెల్చిన కాంగ్రెస్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 28.08 శాతం ఓట్లతో 31 స్థానాలు పొందింది. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పది స్థానాలకుగాను 2014లో 22.99 శాతం ఓట్లతో ఒక్కచోటే గెలిచిన కాంగ్రెస్ 2019 ఎన్నికల్లో 28.51 శాతం ఓట్లు పొందినా, ఆ ఒక్క స్థానాన్నీ కోల్పోవడంతో రిక్తహస్తమే మిగిలింది.

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పర్యాయాలు వరుసగా విజయాలు దక్కించుకు న్న బీజేపీపై వ్యతిరేకత ప్రారంభం కావడంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసివచ్చి 43.68 శాతం ఓట్లతో ఐదు స్థానాల్లో గెలిచింది. ఈ ఫలితాలను పరిశీలిస్తే 42 అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీకి ఆధిక్య త వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికలతో 2024 పార్లమెంట్ ఫలితాలను పోలిస్తే కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టమవుతుంది. ఇందుకు సంబంధించి కొన్ని ఉదాహరణలు తీసుకుంటే కాంగ్రెస్‌కు అంబాలా కంటోన్మెంట్, అంబాల సిటీతోపాటు బీజేపీకి కంచుకోటలైన అహిర్వాల్, జీటీ రోడ్ బెల్ట్ ప్రాంతాల్లోనూ ఎంపీ ఎన్నికల్లో కాం గ్రెస్ మంచి ఫలితాలు సాధించింది.

కాంగ్రెస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. శాసనసభ ఎన్నికల్లో జాతీయ అంశాలకంటే స్థానిక అంశాలకే ప్రాధాన్యత ఉండే అవకాశముంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా రైతులు, అగ్నీవీర్ పథకం గురించి యువత ప్రభుత్వంపై  ఆగ్రహంగా ఉండడంతో రాష్ట్రంలో ఎన్నికలు కాంగ్రెస్‌కు సానుకూలంగా మారుతున్నాయని క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న ‘పీపుల్స్ పల్స్’ బృందం గమనించింది.

గ్రూపులు

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ వాతావర ణం కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నా అదే సమయంలో పార్టీలో గ్రూపు తగాదాలు బుసలు కొడుతున్నాయి. సీఎల్పీ నేత భూపీందర్ సింగ్ హూడా, సిర్సా ఎంపీ కుమారి షెల్జా, రాజ్యసభ సభ్యుడు రణదీప్ సుర్జేవాలా ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తుండడంతో గ్రూపులు పెరిగి పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. భూపీందర్ సింగ్ హూడా నిర్వహిస్తున్న ‘హర్యానా మాంగే హిసాబ్’ యాత్రను ‘వన్‌మ్యాన్ షో’ అంటూ షెల్జా, సుర్జేవాలా ఇద్దరూ దూరంగా ఉంటూ వి డిగా ‘కాంగ్రెస్ సందేశ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో అగ్రనేతలైన వీరు చేపడుతున్న కార్యక్రమాల్లో ప్రత్యర్థుల ఫొటోలు, ప్రస్తావన లేకుండా నిర్వహిస్తున్నారు. ఇంకా విచిత్రమేమిటంటే భూపీం దర్ సింగ్ హూడా, ఆయన తనయుడు దీపీందర్ సింగ్ హూడాల మధ్య ప్రత్యక్షంగా పోరు కనిపించక పోయినా ఇద్దరి అనుచరుల మధ్య విభేదాలున్నాయి. దీపేందర్‌కు యువతలో ఆదరణ ఉందని, ఆయన కాబోయే సీఎం అని ఆయన అనుచరుల ప్రచారంతో పార్టీలో గ్రూపులు కొత్త పంథాలో నడుస్తున్నాయి. భూపీందర్ ప్రత్యర్థులు ఆయనతోపాటు ఆయన కుమారుడు దీపీందర్‌నూ లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు.

హర్యానాలో అధికారంలోకి వచ్చేస్తున్నామనే విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీలో విభేదాలపై దృష్టి సారిస్తూ ఎంపీలకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు లేవని ప్రకటించింది. దీనిపై కొంత వ్యతిరేకత రావడంతో ఎంపీలు పోటీ చేయక పోయినా, వారుకూడా సీఎం రేసులో ఉండవచ్చని, ఫలితాల తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు నిర్ణయాలు ఉంటాయని మరో ప్రకటన చేసింది.  అయితే, రాష్ట్రంలో భూపీందర్ సింగ్ హూడాకు ప్రజాదరణ ఎక్కువగా ఉంది. జులైలో ‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన మూడ్ సర్వేలో ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారని ప్రశ్నిస్తే, 40 శాతం మంది భూపీందర్ సింగ్ హూడా పేరు చెప్పగా, సీఎం నాయబ్ సింగ్ సైనీవైపు 30 శాతమే మొగ్గు చూపారు. కాంగ్రెస్‌లో ఆశలు పెట్టుకున్న కుమారి షెల్జాకు కేవలం 7 శాతం మందే అనుకూలంగా ఉన్నారు.

కమలం ఆశలు

కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలతోపాటు సామాజిక సమీకరణాలతో గట్టెక్కుతామని పాలక బీజేపీ ఆశిస్తోంది. జాట్, దళితులు కాంగ్రెస్‌కు వెన్నుదన్నుగా ఉండడంతో, జాట్ యేతర ఓట్లపై దృష్టి పెట్టిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల ముందు బీసీకి చెందిన నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రిగా నియమించినా సత్ఫలితాల్విలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అదే పునరావృతమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఐఎన్‌ఎల్డీ--బీఎస్పీ కూటమి, జేజేపీ--ఎస్పీ--ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరాం) కూటమితో పలు సెగ్మెంట్లలో ముక్కోణ పోటీ జరిగి జాట్, దళిత్ ఓట్లలో చీలిక వచ్చి కాంగ్రెస్ నష్టపోయే అవకాశాలు ఉన్నా ఆ కూటములు పెద్దగా ప్రభావం చూపక పోవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లోలాగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పార్టీలు నామమాత్రమే కావచ్చు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్న నేపథ్యంలో పార్టీలో టికెట్లకో సం తీవ్ర పోటీ నెలకొంది. 2500 మందికిపైగా ఆశావహులు కాంగ్రెస్ టికెట్ కో సం దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ నియోజక వర్గం నిలోకరి టికెట్ కోసం 88 మం ది పోటీ పడడం తీవ్రతను తెలియజేస్తుం ది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, రిటైర్డ్ జడ్జీలు, క్రీడాకారు లు ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా ప్రజాభిప్రాయం సేకరించగా, రాష్ట్ర వ్యా ప్తంగా 20 లక్షలకు పైగా సూచనలు, సలహాలు పార్టీకి అందడమూ సానుకూల వాతావరణాన్ని సూచిస్తున్నది. 

హర్యానాలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తుం టే తెలంగాణ ఎన్నికలు గుర్తుకొస్తున్నాయి. హర్యానాలో బీజేపీ ఆశిస్తునట్టు తెలంగాణలోనూ కాంగ్రెస్‌లోని అంతర్గత కుమ్ములాటలతో ముచ్చటగా మూడోసారి పగ్గాలు ఖాయమని అధికార బీఆర్‌ఎస్ భావించింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు కనిపించినా ఎన్నికల నాటికి అంతా సర్దుకొని ప్రజావ్యతిరేకతను అందిపుచ్చుకొని ఆ పార్టీ గెలిచింది. హర్యానాలో కూడా ప్రస్తుతం కాంగ్రెస్‌లో గ్రూపులున్నా బీజేపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో కాంగ్రెస్‌లోని విభేదాలు ఆ పార్టీ గెలుపుపై ప్రభావం చూపకపోవచ్చు. అయితే, ఇంటిని చక్కబెట్టుకోకుండా అతివిశ్వాసంతో ముందుకు సాగితే మాత్రం కాంగ్రెస్‌కు హర్యానా ఎన్నికల్లో ఎంతమేర నష్టం జరగనుందో అక్టోబర్ 8న వెలువడే ఫలితాలే తేల్చనున్నాయి.

వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్, 

పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ