calender_icon.png 26 October, 2024 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్వేతసౌధం ఎవరిది?

26-10-2024 12:00:00 AM

అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాయి. అయితే ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికలు గతంకన్నా పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. మరో పది రోజుల్లో (నవంబర్ 5న) ప్రధాన పోలింగ్ జరగనున్నప్పటికీ ప్రత్యర్థులయిన కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లుగా ఉందని, ఎవరు గెలిచినా స్వల్ప ఆధిక్యతతో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా ఓ చరిత్రే అవుతుంది.

ఒక వేళ కమలా హారిస్ విజయం సాధిస్తే అమెరికా చరిత్రలోనే తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టిస్తారు. ఇక ఒక సారి అధ్యక్షుడిగా పని చేసి, ఆ తర్వాత ఓటమి పాలయినా తిరిగి అధికారంలోకి రావడం ద్వారా ట్రంప్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించను న్నారు. 2020లో లాగానే ఈసారి కూడా జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని మొదట్లో అందరూ భావించారు. అయితే పార్టీలో ఒత్తిడివంటి కారణాలతో మూడు నెలల క్రితం పోటీనుంచి తప్పుకొన్న బైడెన్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించడంతో సీన్ మొత్తం మారిపోయింది.

మొదట్లో తిరుగులేని ఆధిక్యతలో ఉన్నట్లు కనిపించిన ట్రంప్ ఆ తర్వాత వెనకబడ్డారు. రోజులు గడిచే కొద్దీ కమల గణనీయంగా పుంజుకున్నారు. ఇరువురి మధ్య జరిగిన ఏకైక డిబేట్ తర్వాత ఆమె స్పష్టమైన ఫేవరేట్‌గా నిలిచారు. కానీ ఎన్నికల సమయం దగ్గరపడే కొద్దీ ట్రంప్ సైతం పుంజుకోవడంతో ప్రస్తుతం ఇరువురి మధ్య తేడా ఒక శాతంకన్నా మించి లేదని, ఈ నేపథ్యంలో ఎవరు విజయం సాధిస్తారో చెప్పడం కష్టంగా ఉందని ఎన్నికల సర్వేలు సైతం పేర్కొనడం గమనార్హం.

 సాధారణంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశ ఆర్థిక పరిస్థితి, విదేశీ విధానం, వలసలు వంటి కీలక అంశాలపై అభ్యర్థుల విధానాల ఆధారంగా ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయిస్తుంటారు. ఈ సారి కూడా  దేశ ఆర్థిక పరిస్థితి, వలసలు, గర్భవిచ్ఛిత్తి, పర్యావరణం వంటి అంశాలపైనే ఇద్దరు ప్రత్యర్థులు ప్రధానంగా తమ ప్రచారాన్ని కేంద్రీకరించారు. కమలా హారిస్ అమెరికా ఆర్థిక పరిస్థితి, పర్యావరణం లాంటి అంశాలను తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉండగా, ట్రంప్ మాత్రం ఇటీవలి కాలంలో అమెరికాలో ప్రధాన చర్చనీయాంశంగా మారిన అక్రమ వలసలపైనే పూర్తి దృష్టి పెట్టారు.

బైడెన్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న హారిస్ అక్రమ వలసలను అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారన్నది ట్రంప్ ప్రధాన ప్రచారాస్త్రంగా ఉంది. ఈ విషయం కమలకు కాస్త ఇబ్బందికరంగానే మారింది. ఎందుకంటే అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయించేవిగా భావించే ఏడు ‘స్వింగ్’ రాష్ట్రాల్లో ఇదే ప్రధాన చర్చనీయాంశంగా ఉంటోంది. అమెరికాలో శ్వేత జాతీయులు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ ఇతర ప్రాంతాలనుంచి వచ్చి స్థిరపడిన నాలుగు జాతులు ఎన్నికలను ప్రభావితం చేస్తుంటాయి.

ఆఫ్రో అమెరికన్లు, లాటిన్ అమెరికా దేశాలనుంచి వచ్చి స్థిరపడ్డ స్పానిష్ మాట్లాడే హిస్పానియన్లు, ఆసియన్ల ఓట్లు ఫలితాలను తారుమారుచేసే అవకాశం ఉంది. జనాభాలో 40 శాతం దాకా ఉన్న ఈ వర్గాలు అధిక శాతం ఈ ఏడు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అందుకే ఫలితాన్ని నిర్ణయించడంలో ఈ రాష్ట్రాలు కీలకంగా మారాయి. ఇక మన దేశం విషయానికి వస్తే ట్రంప్ గెలిస్తే రిపబ్లికన్ పార్టీ విధానంలో భాగంగా వీసా నిబంధనలు మరింత కఠినంగా మారుతాయని, ఇది ఐటీ కంపెనీలకు సవాళ్లు విసురుతాయని తాజాగా ఓ సంస్థ నివేదిక పేర్కొంది.

పారిశ్రామిక విధానంలో స్వల్ప మార్పులు ఉండవచ్చని, అయితే కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు కూడా ఇండోపసిఫిక్ వ్యూహానికి మద్దతు తెలిపినందున ఎవరు గెలిచినా మన దేశానికి మేలే జరుగవచ్చని ఆ నివేదిక భావించింది. మరో రెండు వారాల్లో శ్వేతసౌధంలో అడుగుపెట్టేది ఎవరో తేలిపోనున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ ఫలితాలపై ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తున్నాయి.