calender_icon.png 31 October, 2024 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మహా’ సంగ్రామంలో గెలుపెవరిది?

31-10-2024 12:00:00 AM

లోక్‌సభ ఎన్నికల తరువాత హర్యానా, కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు జరిగితే నవంబర్‌లో మరొక రెం డు రాష్ట్రాలు మహారాష్ట్ర, జార్ఖండ్ శాసన సభలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దే శంలో రాజకీయంగా, ఆర్థికంగా బలమైన మహారాష్ట్రలాంటి రాష్ట్రంలో ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగానే భావిస్తాయి, గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతాయి. గత ఐదేళ్లలో మహారాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వాల మార్పు, పార్టీలలో చీలికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారా యి. 1995 నుండి దరిదాపు మూడు దశాబ్దాలుగా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పా టుకు కావలసిన 145 శాసనసభ స్థానాలను ఏ పార్టీ గెలవకపోవటం వలన  సం కీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటవుతున్నాయి. మ హారాష్ట్ర రాజకీయాలలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించే శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలలో చీలికలు వచ్చిన నేపథ్యంలో జరగబోతున్న ‘మహా’ రాజకీయ యుద్ధంలో పోటీపడుతున్న ఆ రు రాజకీయ పార్టీలతో కూడిన రెండు కూ టములలో గెలుపు ఎవరిది అనే అంశంపై ఆసక్తి నెలకొన్నది. అధికారాన్ని నిలుపుకోవాలని ‘మహా యుతి’  కూటమి, పోయిన అధికారాన్ని దక్కించుకోవాలని ‘మహా వికాస్ అఘాడి’ కూటమి మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డబోతున్నాయి. 

అధికారం నిలబెట్టుకునేనా!

2022లో శివసేనలో చీలిక రావటంతో అప్పటివరకు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ‘మహా వికాస్ అఘాడి’ ప్రభుత్వం కూలిపోవడం, శివసేన చీలిక వర్గం నాయకుడైన ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బీజేపీ మద్దతుతో ‘మహా యుతి’ కూటమి ప్రభుత్వం ఏర్పాటయింది. అయితే మహారాష్ట్రలో మరొకసారి బీజేపీ, శివసేన, ఎన్‌సీపీ ‘మహాయుతి’ కూటమి అధికారా న్ని నిలబెట్టుకోవాలంటే గత శాసనసభ ఎన్నికలలో బీజేపీ తాను గెలిచిన 105 శాసనసభ స్థానాలను నిలబెట్టుకోవటంతోపాటు, ఏక్ నాథ్ షిండే వర్గం, అజిత్ పవా ర్ వర్గం కూడా తమ బలాన్ని నిలబెట్టుకోవాలి. 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఆ రెండు పార్టీలు 161 శాసనసభ స్థానాలలో విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటు కు కావలసిన సంఖ్యా బలాన్ని కూడా పొం దాయి. కానీ 56 శాసనసభ స్థానాలలో విజయం సాధించిన శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టు పట్టటంతో కలిసి పోటీ చేసిన బీజేపీ, శివసే నలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినాయి. ఫడ్నవిస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా మెజార్టీకి కావలసిన బలాన్ని కూడగట్టలేక ఆయన రాజీనామా చేయక తప్పలేదు. 

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో బీజేపీ రెండు చీలిక పార్టీలతో కలిసి విజ యం సాధించటం నల్లేరుపై నడక కాదు. ‘మహాయుతి’ కూటమి గత లోక్‌సభ ఎన్నికలలో మెరుగైన ఫలితాలు సాధించలేక చ తికిల పడింది.అధికారంలో ఉండి కూడా 48 లోక్ సభ స్థానాలలో 17  స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. బీజేపీకి, ఏక్‌నాథ్ షిండే వర్గానికి పట్టు ఉన్న ఆరు లోక్ సభ స్థానాలు ఉన్న ముంబైలో కూడా ఆ రెండు పార్టీలు కేవలం చెరో లోక్ సభ స్థానాన్ని మాత్రమే గెలవగలిగాయి. 75 శాసనసభ స్థానాలు ఉన్న కొంకణ్, థానే, ముంబై ప్రాంతంలో, 47 శాసనసభ స్థానాలు గల ఉత్తర మహారాష్ట్రలో బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోలేకపోతే మహారాష్ట్రలో ‘మహాయుతి’ అధికారంలోకి రావ డం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. గత లోక్ సభ ఎన్నికలలో ఒకే ఒక లోక్ సభ స్థానంలో విజయం సాధించిన ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీకి ఈ శాసనసభ ఎన్నికలలో 50కి పైగా శాసనసభ స్థానాలు కేటా యించటం కూడా గెలుపు ఓటమిలపై ్ర పభావం చూపించే అవకాశం లేకపోలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండ టం, లడ్కి బహిన్ యోజన, అన్నపూర్ణ యోజన, బిజిలీ సవాలత్ యోజన, యువ కార్య శిక్షణ యోజన, బాలికలకు ఫీజు చెల్లింపు లాంటి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని ‘మహాయుతి’ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. 

అఘాడి సత్తా చాటేనా! 

2019 శాసనసభ ఎన్నికల తరువాత మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు అనేక మలుపులు తిరిగాయి. మరాఠా యోధుడు శరద్‌పవార్ రాజకీయ మంత్రాంగంతో దశాబ్దాల రాజకీయ వైరాన్ని కూడా పక్కనపెట్టి కాంగ్రెస్, ఎన్సీపీ,శివసేనలు కలిసి ‘మ హా వికాస్ అఘాడి’ కూటమిని ఏర్పాటు చేసి శివసేన నేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటయింది. 2022లో శివసేనలో చీలిక రావటంతో ‘మహా వికాస్ అఘాడి’  ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. కూటమిలోని రెండు పార్టీలు శివసేన, ఎన్సీపీలలో చీలిక రావ టం, మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకులు అఘాడి కూటమినుండి వెళ్లిపోవటం రాజకీయంగా కూటమిని బలహీ నపరిచిందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక నాయకులు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్, మాజీ కేంద్రమంత్రి మిలింద్ దేవరా, సంజయ్ నిరుపమ్, ఇటీవల హత్యకు గురయిన బాబా సిద్దిఖీ లాం టి వారు పార్టీ మారటంతో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత బలహీన పడిందనే చెప్పాలి. 

గత లోక్ సభ ఎన్నికలలో మహా వికాస్ అఘాడి కూటమి 30  స్థానాలలో విజ యం సాధించటం, సాంగ్లీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన వికాస్ పా టిల్ కాంగ్రెస్‌లో చేరటంతో శాసనసభ ఎ న్నికలలో విజయం పై  అఘాడి కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. పశ్చిమ మహారాష్ట్రలో ఎన్సీపీ, విదర్భలో కాంగ్రెస్, ముంబై ప్రాంతంలో ఉద్దవ్ థాక్రే శివసేనలు తమ పట్టు నిలుపుకుంటే అఘాడి కూటమి విజయావకాశాలు మెరుగుపడతాయి. 

నిర్ణయాత్మకంగా చిన్న పార్టీలు! 

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో చిన్న పార్టీలైన ప్రకాష్ అంబేద్కర్ వంచిత్ వికాస్ అఘాడి, ఎంఐఎం, రాజ్ ఠాక్రే ఎంఎన్‌ఎస్, సమాజ్‌వాది పార్టీలతో పాటు మరాఠా రిజర్వేషన్ పోరాట సమితి నేత మనోజ్ జరంగ పాటిల్, స్వతంత్రులు కూడా నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశాలు లేకపోలేదు. గత శాసనసభ ఎన్నికలలో 13 మంది స్వతంత్రులు గెలిస్తే రాబోయే శాసనసభ ఎన్నికలలో 20మందికి పైగా స్వతంత్రులు, చిన్న పార్టీల నాయకులు గెలిచే అవకాశాలు ఉన్నాయని, వారు గెలుపు ఓటములను ప్రభావితం చేయగలుగుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో  స్వతంత్రులు, చిన్న పార్టీలు కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. 

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు శరద్‌పవార్, ఉద్దవ్ ఠాక్రే ప్రతిష్టకు,ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌ల రాజకీయ ఉనికికి సవాల్ గా మారిబోతున్నాయి. సుప్రియా సూలే, ఆదిత్య థాక్రే రాజకీయ భవితవ్యాన్ని కూడా ఈ ఎన్నికలు తేల్చబో తున్నాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలు పునరావృతమైతే మహా వికాస్ అఘాడి కూటమికి, అమిత్ షా మంత్రాంగం ఫలించి హర్యానాలాంటి ఫలితాలు వస్తే ‘మహాయుతి’ కి అధికారం దక్కే ఛాయలు కనిపిస్తున్నాయి. గత లోక్ సభ ఎన్నికలలో మహా వికాస్ అఘాడి 151 శాసనసభ స్థానాలలో, మహా యుతి 128 శాసనసభ స్థానాలలో ఆధిక్యతను సాధించిన నేపథ్యంలో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రెండు కూటమిల మధ్య పోటీ నువ్వా నేనా అనే విధంగానే కనిపిస్తోంది. ప్రస్తుత శాసనసభ ఎన్నికలలో ప్రజా సమస్యల కంటే రాజకీయ అంశాలే ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మహా శాసనసభ ఎన్నికలు రాబోయే ఢిల్లీ, బీహార్ శాసనసభ ఎన్నికలపై కూడా ప్రభావం చూపించబోతున్నా యనే చెప్పాలి. 

వ్యాసకర్త సెల్: 9885465877