మెదక్ సీటుపై ఎవరి ధీమా వారిదే
ఓటింగ్‌పై లెక్కలు వేసుకుంటున్న అభ్యర్థులు
ఈవీఎంలలో దాగివున్న భవితవ్యం
మెదక్, మే 16 (విజయక్రాంతి) : పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్‌స్థానం ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో బీఆర్‌ఎస్, ఇందిరమ్మ గెలిచిన సీటు కావడంతో కాంగ్రెస్ పోటాపో టీగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎవరు గెలుస్తారో అనే లెక్కలు వేసుకుంటున్నారు. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మండలాల వారీగా నమోదైన పోలింగ్‌ను తెప్పించుకొని ఏయే పార్టీకి ఎలా ఓట్లు పడ్డాయో బేరీజు వేసుకుంటున్నారు.
అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం తమకే ఓటర్లు మొగ్గు చూపారని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈవీఎంలలో అభ్యర్థుల భవిష్యత్తు భద్రంగా ఉంది. జూలై 4న మెదక్ కోటలో ఎవరు జెండా ఎగురవేస్తారో తేలనుంది. మెదక్ ఎంపీ స్థానం మాత్రం ఖచ్చితంగా బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు. మొదటి నుంచి మెదక్ స్థానంపై గట్టి నమ్మకాన్ని పెట్టుకున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి తనకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు అండదండలతో పాటు నియోజక వర్గంలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం కలిసొచ్చిందని భావిస్తున్నారు.
మొదట్లో కొంత అయోమయానికి గురైనప్పటికీ రోజురోజుకు ప్రచారం ఉధృతం చేయడమే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఇది తమకు ఓటు రూపంలో లభిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2004 నుంచి వరుసగా ఐదు పర్యాయాలు గెలుపొందినందున ఈసారి కూడా తమదే విజయమని భావిస్తున్నారు.
గ్యారెంటీల నమ్మకంతో కాంగ్రెస్..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించిన మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లో సైతం అదే హవా కొన సాగుతున్నదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో కాగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా మైనార్టీ ఓట్లు గంప గుత్తగా కాంగ్రెస్‌కే పోలైనట్లుగా భావిస్తున్నారు. అంతేగాకుండా మాజీ ప్రధాని ఇందిరమ్మ గెలిపించిన మెదక్ ఓటర్లు తిరిగి కాంగ్రెస్‌కు పట్టం కడతారని, ఇందిరమ్మ పాలన నినాదం ప్రజల్లో బలంగా వెళ్లిందని భావిస్తున్నారు. అయితే పట్టణ ఓటర్ల కంటే గ్రామీణ ఓటర్లపైనే కాంగ్రెస్ నమ్మకాన్ని పెట్టకుందని, అంతేస్థాయిలో ఓటింగ్ నమోదైందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తమదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మోదీ హవానే నమ్ముకున్న బీజేపీ
ఈసారి మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీ హవానే గెలిపిస్తున్నదని బీజేపీ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. ఓ వైపు మోదీ హవా, మరోవైపు అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రజల్లో బలమైన ఓటు బ్యాంకును పెంచిందని భావిస్తున్నారు. ప్రధానంగా యువ ఓటర్లు ఎక్కువశాతం బీజేపీకి మొగ్గు చూపారని ఆ పార్టీ భావిస్తోంది. గతంలో కంటే ఈసారి పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఓటర్లు కమలం వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు. దేశం కోసం అనే నినాదం, మోదీని బలపర్చాలనే భావనతో ఓటర్లలో బలంగా కనిపించినట్లు బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు గెలుపుపై లెక్కలు వేసుకుంటూ ఫలితాలపై తర్జనభర్జన పడుతున్నారు.