calender_icon.png 26 December, 2024 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెల్‌బోర్న్ గెలిచేదెవరు?

26-12-2024 12:38:49 AM

  • నేటి నుంచి బాక్సింగ్ డే టెస్టు
  • సిరీస్‌లో ఇరుజట్లు 1 సమంగా రోహిత్ బ్యాటింగ్ స్థానంపై నజర్
  • ఉదయం 5 గంటల నుంచి

మెల్‌బోర్న్: బోర్డర్ ట్రోఫీలో భాగంగా వారం రోజుల విరామం తర్వాత భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్టుకు సిద్ధమయ్యాయి. మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న బాక్సింగ్ డే టెస్టులో విజయం ఎవరిదన్నది ఆసక్తిగా మారింది. మూడు టెస్టులు ముగిసేసరికి ఇరుజట్లు 1 సమంగా ఉన్నాయి. గత రెండు పర్యటనల్లో మెల్‌బోర్న్‌లో ఆడిన టెస్టుల్లో నెగ్గిన టీమిండియాకు ఈ వేదిక బాగా కలిసొచ్చింది. ముచ్చటగా మూడోసారి నెగ్గి హ్యాట్రిక్‌తో భారత్ తన జోరును కొనసాగిస్తుందా అన్నది చూడాలి. ఉదయం 5 గంటలకు ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టుకు తొలిరోజు అభిమానులు పోటెత్తనున్నారు. దాదాపు లక్ష సామర్థ్యం కలిగిన మెల్‌బోర్న్ స్టేడియంలో తొలిరోజు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. 

రోహిత్ ఏ స్థానంలో..

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాను మొదటి నుంచి బ్యాటింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఒకరిద్దరు మినహా జట్టు మొత్తం సమిష్టి ప్రదర్శన చేయలేకపోతుంది. తొలి టెస్టులో సెంచరీలతో మెరిసిన ఓపెనర్ జైస్వాల్, కోహ్లీ ఆ తర్వాత వరుసగా విఫలమవుతూ వస్తున్నారు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌పై నజర్ నెలకొంది. కేఎల్ రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్‌కు ఏదీ కలిసిరావడం లేదు. మూడు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు.

అయితే మెల్‌బోర్న్ టెస్టులో రోహిత్ తనకు అచ్చొచ్చిన ఓపెనింగ్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే చాన్స్ ఉంది. ఒకవేళ అదే జరిగితే కేఎల్ రాహుల్ మూడో స్థానంలో రానున్నాడు. సిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేకపోతున్న  గిల్ మిడిలార్డర్‌లో దింపాలా లేక అతని స్థానంలో ధ్రువ్ జురేల్‌ను తీసుకోవాలా అనే యోచనలో ఉంది. ఇక కేఎల్ రాహుల్ 235 పరుగులతో సిరీస్‌లో టీమిండియా తరఫున టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ రాణించాల్సిన అవసరముంది. ఆల్‌రౌండర్ పాత్రకు నితీశ్, జడేజా న్యాయం చేస్తున్నారు.

బుమ్రా ఒక్కడే..

టీమిండియా బౌలింగ్‌ను జస్‌ప్రీత్ బుమ్రా తన భుజస్కంధాలపై మోస్తున్నాడు. మూడు టెస్టులు కలిపి 21 వికెట్లు పడగొట్టిన బుమ్రా సిరీస్‌లో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న పిచ్‌లపై మన పేసర్లు మాత్రం ఢీలా పడుతున్నారు. నాలుగో టెస్టులోనూ బుమ్రానే కీలకం కానున్నాడు. ఇక ఆస్ట్రేలియా బలం బలహీనత ట్రావిస్ హెడ్ (3 టెస్టుల్లో 409 పరుగులు). 89, 140, 152 స్కోర్లతో బెంబెలెత్తిస్తోన్న హెడ్‌ను కట్టడి చేస్తేనే టీమిండియాకు విజయం దక్కుతుంది. స్మిత్, లబుషేన్ కూడా కీలకం కానున్నారు. బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్, బోలండ్, కెప్టెన్ కమిన్స్ చెలరేగిపోతున్నారు.