21-02-2025 12:00:00 AM
డాక్టర్ తిరుణహరి శేషు
అనేక ఉద్యమాలకు పురుడు పోసి న తెలంగాణను రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఫిరాయింపుల కేంద్రంగా మార్చిన రాజకీయ పార్టీల రాజకీయంతో దేశవ్యాప్తంగా రాష్ట్రం అపఖ్యాతిని మూటకట్టుకుంటోంది. రాష్ట్రం ఏర్పాటైన ఈ దశాబ్ద కాలంలో మూడు పర్యాయాలు శాసనసభ ఎన్నికలు జరిగిన తరువాత పదుల సంఖ్యలో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీలు మారటం వలన రాష్ట్రం ఫిరాయింపులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన ట్లుగా కనిపిస్తోంది.
ఒకనాడు పంజాబ్, హర్యానా ఈశాన్య రాష్ట్రాలకు పరిమితమై న ‘ఆయా రాం గయారాం’ సంస్కృతి నేడు ఉద్యమాల ద్వారా ఏర్పాటైన తెలంగాణకు కూడా పాకటం రాజకీయాలలో దిగజారిపోతున్న విలువలకు తార్కాణంగా కనిపిస్తుంది. 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్‌ఎస్ పార్టీ నుండి శాసనసభ్యులుగా ఎన్నికైన పదిమంది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించ డం తెలిసిందే.
ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టు లో బీఆర్‌ఎస్ కేసు వేయటంతో ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన వారిపై అనర్హత వేటు పడుతుందా, ఆ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగితే గెలుపు ఎవరిది అనే అంశంపై రాష్ట్ర రాజకీయాలలో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
కేసీఆర్ నుంచి రేవంత్‌రెడ్డి దాకా!
తెలంగాణలో ప్రభుత్వాలు మారినా ఫిరాయింపులు ఆగలేదు. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలో దాదాపు 41 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయించా రు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి తప్పించుకోటానికి వేటుపడకుండా రెండుసార్లు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారు.
అప్ప ట్లో పార్టీ ఫిరాయింపులపైన రాష్ట్రవ్యాప్తం గా పెద్ద చర్చే జరిగింది. బీఆర్‌ఎస్ ఓటమికి అనైతిక పార్టీ ఫిరాయింపులు కూడా ఒక కారణం. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాదు ఫిరాయించిన ఎమ్మెల్యే లకు మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించటంతో రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందనే ఆరోపణ లను కూడా ఎదుర్కొన్నారు.
అయితే రేవం త్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పదిమంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి ఫిరాయించటం వలన ఆ పార్టీ కూడా ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందనే విమర్శలను ఎదుర్కొంటోంది.
కేసీఆర్ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రాకుండా అనర్హత వేటు పడకుం డా ఫిరాయింపులను ప్రోత్సహిస్తే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుల చట్ట పరిధిలోకి వస్తు న్నారు. ఈ పదిమంది ఎమ్మెల్యేలు ఫిరాయింపుల చట్ట పరిధిలోకి రాకుండా అనర్హ త వేటు నుండి తప్పించుకోవాలంటే బీఆర్‌ఎస్ పార్టీ నుండి మరో 16 మంది ఎమ్మె ల్యేలు పార్టీ ఫిరాయించాల్సి ఉంటుంది.
పది చోట్ల గెలుపు ఎవరిది?
బీఆర్‌ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడి ఆ పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలి తాలు వస్తాయి? అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు పార్టీ మారి తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవగలిగారు కానీ హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ విప్‌ను ధిక్కరించి అనర్హత వేటుపడిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఇద్ద రు మాత్రమే మళ్లీ గెలవగలిగారు. కానీ తెలంగాణ ఏర్పాటైన తరువాత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఏ ఒక్క ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడలేదనే విషయాన్ని గమనించాలి.
సహజంగా ఏ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగినా అధికార పార్టీకే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. తెలంగాణలో కాంగ్రె స్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించటం వలన జరిగి న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
కానీ పార్టీ ఫిరాయింపుల వలన అనర్హత వేటు పడితే ప్రత్యేక పరిస్థితులలో జరిగే ఉప ఎన్నికలలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రాజకీయ వాతావరణం నెలకొని ఉన్న పరిస్థితులలో ఎవరి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగు తోంది.
స్టేషన్ ఘనపూర్, పటాన్ చెరువు, జగిత్యాల, గద్వాల నియోజకవర్గాలలో ఫిరాయించిన ఎమ్మెల్యేలకే పోటీ చేసే అవకాశం కల్పిస్తే స్థానికంగా నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గతంలో వారిపైనే పోటీ చేసి ఓడిపోయిన వారు సహకరించకపోతే అక్కడ అధికార పార్టీ గెలుపు కష్టంగా మారే పరిస్థితులే కనిపిస్తున్నాయి.
గత శాసనసభ ఎన్నికలలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన రాజేంద్రనగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు బీజేపీతో గట్టి పోటీనే ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గద్వాలలాంటి నియోజకవర్గం లో కూడా బీజేపీ నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భద్రా చలం, బాన్సువాడ, చేవెళ్ల, శేర్‌లింగంపల్లి లాంటి నియోజకవర్గాలలో అధికార పార్టీ బలంగా ఉండటంతో ఇక్కడ అధికార పార్టీ కి విజయ అవకాశాలు మెరుగ్గా కనపడుతున్నాయి. ఉప ఎన్నికలు వస్తే ఈ పది నియోజకవర్గాలలో గెలుపు కోసం కాంగ్రె స్, బీఆర్‌ఎస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతాయనటంలో సందేహం లేదు.
అనర్హతకు అవకాశాలు ఎంత?
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య లు తీసుకోవడంలో స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని భావించిన బీఆ ర్‌ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే విధంగా ఆదేశాలు ఇవ్వా లని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచా రిస్తున్న సుప్రీంకోర్టు విచారణ సందర్భం గా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య లు తీసుకోవటానికి ఎంత సమయం అవసరమవుతుంది, కనీసం ఈ శాసనసభ కా ల పరిమితి ముగిసే లోపైనా చర్యలు చేపడతారా అనే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేయడం జరిగింది.
అయితే న్యాయస్థానాలు అనర్హ త వేటువేయాలని స్పీకర్‌ను ఆదేశించజాలవు. అనర్హత విషయంలో కోర్టులు పరిమి తులకు లోబడి సూచనలు మాత్రమే చేయగలుగుతాయి. అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ తన విచక్షణాధికారా న్ని వినియోగించుకొని తుది నిర్ణయం తీసుకుంటారు.
కానీ గతంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పదిమంది టీఆర్ ఎస్ శాసనసభ్యులను అప్పటి అసెంబ్లీ స్పీకర్ నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి 2009 లో అనర్హులుగా ప్రకటించిన విధంగానే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన పదిమంది శాసనసభ్యులను కూడా స్పీకర్ అనర్హులుగా ప్రకటించే అవకాశాలు ఉంటాయి.
ఓడితే ప్రభావం ఎంత?
ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలను గెలిపించుకోలేకపోయినా ప్రభుత్వ మనుగడకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు కానీ ప్రజలలో ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోతుంది. ఆయా నియోజకవర్గాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను బట్టి అధికార పార్టీ పది నియోజకవర్గాలలో గెలుపు సాధించే పరిస్థితులు కనిపించటం లేదు.
మెజార్టీ నియోజకవర్గాలలో గెలుపు సాధించలేక పోతే ప్రతిపక్షాలు రాజకీయంగా బలం పుంజుకోవడంతో పాటు అధికార పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితు లు తలెత్తుతాయి.కేసీఆర్ అనైతికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, వివి ధ రాష్ట్రాలలో ఎన్నికైన ప్రభుత్వాలను ఫిరాయింపులతో బీజేపీ కూల్చివేస్త్తోందని కాం గ్రెస్ చేస్తున్న విమర్శలకు బలం లేకుండా పోతుంది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని యథాతథంగా అమలు చేస్తే పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతున్నట్లుగానే భావించాలి. ఫిరాయిం పు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామా చేసినా, స్పీకర్ అనర్హత వేటు వేసినా ప్రజాస్వామిక విలువలు కాపాడినట్లే.
వ్యాసకర్త సెల్: 9885465877