calender_icon.png 12 October, 2024 | 4:49 AM

జైలు జీవితాలు మారేదెన్నడు?

08-10-2024 12:00:00 AM

 డా.కోలాహలం రామ్ కిషోర్ :

సమాజంలో సహజంగా ఒకరో, ఇద్దరో కరుడుగట్టిన నేర ప్రవృత్తి కలిగి ఉంటారు. అందరూ అలా ఉండరు. ఎవరూ కావాలని నేరాలు చేయరు. చాలాసార్లు అదుపులేని కోపం,ఆవేశం నేరం చేసే లా పరిస్థితులు దోహదం చేస్తాయి. ఆ సమయంలో వారు కాస్త నిదానించి,ఆలోచించి ఆవేశం తగ్గించుకొని మౌనంగా ఉంటే చట్టాలను అతిక్రమించే అవకాశం ఉండదు.

కొన్ని సార్లు రాజకీయ కక్షలలో భాగంగా కేసులలో చిక్కి జైలు పాలు కావచ్చు. కొందరు చేయని నేరానికి శిక్షలు కూడ పడవచ్చు.కోర్టు నేరస్థునిగా నిర్ధారిస్తూ శిక్ష వేయక ముందే విచారణ కాలంలో సుదీర్ఘకాలం జైలులో గడపవలసి రావచ్చు. కొందరు కోర్టు విచారణ జరుగుతుండగానే కోర్టు వాయిదాల మూలంగా జైళ్ళలో మగ్గి, అనారోగ్యంతో,అవమాన భారంతో మానసిక దౌర్భల్యంతో మరణించిన ఉదంతాలు ఉన్నాయి.

కిక్కిరిసిన జైళ్లు

మన దేశంలో జైళ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.బ్రిటీష్ కాలం నాటి నుంచి పరిస్థితుల్లో పెద్ధగా మార్పులు రాలేదు.పరిమిత జైలు గది వైశాల్యంలో ఇద్దరు ఖైదీలు ఉండాల్సిన చోట ఐదు గురిని ఉంచుతున్నారు. రోజు, రోజుకు సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతుంది. ఖైదీల రద్దీకి తగినట్లుగా కారాగారాల సంఖ్య పెరగటం లేదు. ఖైదీల మధ్య తగాదాలు పెరిగి హింస చెలరేగుతుంది.

రక్షక సిబ్బంది కొరత ఎక్కువగా ఉంటుంది. తక్కువ బడ్జెట్ వల్ల ఖైదీలకు ఇచ్చే ఆహారం, వైద్యం ఇతర మౌలిక సదుపాయాలు నాసిరకంగా ఉంటున్నాయి. చాలా మందికి బెయిల్ దొరకని సమస్యలతో  జైళ్లు కిక్కిరి పోతున్నాయి. ఇటీవల సుప్రీం కోర్టు ఖైదీలపట్ల ‘కులం’ ఆధారంగా నీచ పనులను అప్పగించే పని తీరును తీవ్రంగా ఆక్షేపించింది.

 మనదేశంలో కొద్దిమంది రాజకీయ నేతలు,కీలక శాఖలు నిర్వహించిన ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు ఏదో కారణాలతో జైలుకు వెళ్లి వచ్చిన వారే. ఆ ఖైదు జీవిత చేదు అనుభవాలు రుచి చూసిన వారే కనుక వారికి ఆ దుస్థితి గురించి వివరించి చెప్పే పని లేదు. కనుక జైళ్ల మ్యాన్యు వల్ లో తగిన సంస్కరణలు చేపట్టాలి.

ఇప్పటికే పలువురి ఖైదీల ఆవేదనలు, అగచాట్లు మీడియాలో అనేకసార్లు వెల్లడించారు. దానితో 1980లో కేంద్ర ప్రభుత్వం ‘అఖిల భారత జైళ్ల సంస్కరణల కమిటీ’ని వేసింది. దాన్నే  ‘ముల్లా కమిటీ’  అని కూడా పిలుస్తారు. ఈ కమిటీ దేశంలో ప్రధాన జైళ్లను ప్రత్యేకంగా దర్శించింది. ఖైదీలను ప్రశ్నించి, స్వయంగా అక్కడ పరిస్థితులను చూసి  ఈ కమిటీ మొత్తం 658 సిఫార్సులు చేసింది.

కమిటీ సిఫార్సులు

--మన దేశంలో జైళ్లు 130 శాతం ఆక్యుపెన్సీ రేటుతో రద్దీ ఎక్కువగా ఉంటు న్నాయి. దీన్ని తగ్గించేందుకు ఖైదీల విభజన చేయాలి. జైలు ప్రధాన కార్యాలయా ల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణతో సహా జైలు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కమిటీ సూచించింది. అదనంగా, ఖైదీలను సన్నద్ధం చేయడానికి వృత్తిపరమైన శిక్షణ, కౌన్సెలింగ్ సేవలు, విద్య, వైద్యం, వినోదం అందించాలి.

ఉపాధి నైపుణ్యాలు మెరుగు పర్చాలి. ఖైదీల ఆరోగ్యం, పరిశుభ్రత ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఉన్నత అధికారులు, స్థానిక రాజకీయ నేతలు క్రమం తప్పకుండా జైళ్ల పరిస్థితులపై తనిఖీలు నిర్వ హించాలి.అనారోగ్య పీడితులకు సకాలంలో చికిత్సతో పాటు, వైద్య సదుపా యాలను మెరుగుపరచాలి.

పరిశుభ్రమైన జీవన పరిస్థితులు కల్పించాలి.ప్రాథమిక అసౌకర్యాలను వెంటనే నిర్ధారించి,మెరుగైన శాశ్వత పనులు చేపట్టాలని కమిటీ సిఫార్సు చేసింది. ఖైదీల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పౌష్టికాహారం, సురక్షితమైన మంచినీరు అందించడం చాలా అవసరం.

చట్టపరమైన సామాజిక సంస్కరణల ప్రాముఖ్యతను కూడా కమిటీ నొక్కి చెప్పింది. బెయిల్  విధానాలను సరళీకృతం చేయడం, ఖైదీల మానవ హక్కు లను, గౌరవాన్ని పరిరక్షించడం, ఖైదీల పునరావాసంలో సమాజ ప్రమేయాన్ని ప్రోత్సహించడం సంస్కరణల పరంగా కీలకమైన దశలుగా చెప్పుకోవాలి.

బాలనేర స్థుల కోసం బోస్టన్ పాఠశాలలను ఏర్పా టు చేయడం, మహిళా ఖైదీలకు ప్రత్యేక సంరక్షణ అందించడం,పేద ఖైదీల బెయిల్ కోసం నిధిని సమకూర్చటం కూడా చాలా ముఖ్యం. జైళ్లలో ఖైదీ గ్రూపుల మధ్య హింసను నిర్మూలించాలి.సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలి. జైలు నిర్వహణను కుల, మత తదితర వివక్షతలకు అతీతంగా శాస్త్రీయంగా, మానవతా స్ఫూర్తితో మెరుగు పర్చాలని ఆ కమిటీ సూచించింది.

సూచనలు సరే.. ఆచరణ ఏది?

-జైళ్ల సంస్కరణలపై ముల్లా కమిటీ అనేక విలువైన సూచనలు చేసి నాలుగు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ పూర్తిగా వాటిని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయటం లేదు. ఏవో అక్కడక్కడ అరకొర సూచనలు మాత్రం అమలు చేస్తున్నారు. ఈ సంస్కరణల అమలుకు బహుముఖ, క్రియాశీలక ఆచరణ విధానం అవసరం.

జైలు గదిలో ఖైదీలకు పరిశుద్ధమైన తాగు నీరు,గాలి,వెలుతురు ఉండేలా చూడాలి. పరిశుభ్రమైన మరుగుదొడ్డి, మౌలిక సదుపాయాలు సమకూర్చాలి. పౌష్టిక ఆహారం అందించాలి.జైల్ వార్డర్లు, ఇతర అధికారులు ఖైదీల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. తరచుగా ఈ సిబ్బంది ఖైదీల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. పత్రికలలో అనేక వార్తా కథనాలుకూడా  వచ్చాయి.

కొందరు ఖైదీలు జైలులో దెబ్బలు తిని మరణించిన వార్తలు కూడా గతంలో వచ్చాయి.జైల్ సెల్‌లో సీసీ కెమేరాలతో  24 గంటలు నిఘా పెట్టడం అమానుషం. మొన్న ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాలు చెప్పారు. విచారణ ఖైదీలను,శిక్షలు పడిన ఖైదీలను వేరు,వేరు బ్లాకుల్లో ఉంచాలి.

ఖైదీల నేర స్వభావాన్ని బట్టి వారిని విడి,విడి బ్లాకుల్లో ఉంచాలి. .ఖైదీలు వారిలో వారు కలహించుకోకుండా రక్షణ చర్యలు చేపట్టలి. ఖైదీలకు తగిన రక్షణతో తరచూ తమ బంధుమిత్రులను ప్రజాస్వామిక  వాతావరణంలో కలుసుకొనే ములాఖాత్  అవకా శాలు తరచుగా ఇవ్వాలి. వారితో కష్ట, సుఖాలు, కుటుంబ విషయాలు పంచుకొనే సమయాన్ని కనీసం ఒక గంట పెంచాలి.

దీనివల్ల వారి ప్రవర్తనలో మంచి మార్పు వస్తుంది. నేర స్వభావం తగ్గుతుంది. ఖైదీల విద్యాభ్యాసానికి అవకాశాలు పెచాలి. గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి. నైతిక, ఆధ్యాత్మిక బోధనలకు అవకాశాలు పెచాలి. వారిలో పశ్చత్తాపం, మానసిక పరివర్తనకు ఇవి దోహోదం చేస్తాయి. ఖైదీల శక్తి, సామర్థ్యం, నైపుణ్యం ఆధారంగా జైలు ఆవరణంలో పనులు అప్పగించాలి. నూతన వృత్తి విద్యలలో శిక్షణ ఇవ్వాలి.

దీని ద్వారా భవిష్యత్తులో వారికి మంచి ఉపాధి లభిస్తుంది. 12. బాలలు, మహిళలు, వృద్ధ ఖైదీల పట్ల ఉదారంగా,దయతో  చూడాలి. ఖైదీల ఆరోగ్యం పట్ల జైలు అధికారులు శ్రద్ధ చూపాలి.వారికి చికిత్స, మందులు సకాలంలో అందించాలి. జైలులో పురుష, మహిళా డాక్టర్ల్లను, ఇతర ప్యారా మెడికల్ సిబ్బందిని తగిన సంఖ్యలో పెంచాలి. బెయిల్  విధానాలను సరళీకృతం చేయాలి, పెరోల్ వ్యవధి అవకాశాలు పెంచాలి.

సామాజిక సమానత్వం, సమగ్రతను, దేశ భక్తిని పెంచేలా క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి. బోస్టన్ పాఠశాల లు, ప్రత్యేక సంరక్షణా సౌకర్యాలను పెంచా లి. జైళ్ల అభివృద్ధికి,వివిధ సౌకర్యాలను సమకూర్చేందుకు తగినన్ని నిధులను బడ్జెట్ లో ఉదారంగా కేటాయించాలి.

ఈ సమగ్ర సంస్కరణలను అమలు చేయడం ద్వారా, భారతదేశం తన జైలు వ్యవస్థను మరింత మానవీయ,నాగరిక పునరావాస సంస్థగా మార్చగలదు.ఇది ఖైదీల జీవితాలను మెరుగుపరచడమే కాకుండా సురక్షితమైన, మరింత న్యాయవంతమైన సమాజానికి దోహదం చేస్తుంది.

వ్యాసకర్త సెల్: 9849328496