నేడే మరాఠా పోరు
ఉదయం 7కే షురూ..
మహా ఓటర్ల తీర్పు ఎటో?
కాక రేపుతున్న కూటములు
జార్ఖండ్‌లో 38 స్థానాల్లో అమీతుమీ
సీఎం సోరెన్ మరోమారు గెలిచేనా?
బీజేపీపై విరుచుకుపడ్డ కల్పన
ముంబై, నవంబర్ 19: మహా పోరుకు రంగం సిద్ధమయింది. నేడు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ జరగనుంది. మరాఠా గడ్డ మీద ఉన్న 288 స్థానాల్లో ఒకే విడతలోనే పోలింగ్ జరగనుంది. 23న ఓట్ల కౌంటింగ్ జరగనుంది. సాయంత్రం ఆరు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
కాక రేపుతున్న కొత్త ‘కుంపట్లు’
మరాఠా గడ్డ మీద కొత్త కుంపట్లు కాక రేపుతున్నాయి. పోయిన సారి ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. బీజేపీ సారధ్యంలోని అధికార ‘మహాయుతి’.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్న ఎంవీఏ (మహావికాస్ అఘాడీ)లు కొత్త కాక రేపుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అని మరాఠా ప్రజలతో పాటు మామూలు జనాలు కూడా ఆసక్తిగా తిలకిస్తున్నారు.
గత ఎన్నికల తర్వాత అధికారం చేపట్టిన ఎంవీఏకు షాక్ ఇస్తూ బీజేపీ మహాయుతిని ఏర్పరచి అధికారాన్ని దక్కించుకుంది. మా నుంచి అన్యాయంగా అధికారం తీసుకున్నారని ఆరోపిస్తున్న ఎంవీఏ కూటమిని ప్రజలు ఆదరిస్తారో లేదో తెలియాలంటే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.
ఒకే విడతలో
మహా గడ్డ మీద ఉన్న 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దీంతో ఈ దఫా ఎన్నికల్లో అధికార యంత్రాంగం ఎలాంటి మార్క్ చూపిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హేమాహేమీల ప్రచారం..
అధికారంలో ఉన్న మహాయుతితో పాటు ఎంవీఏ కూటములు కూడా శక్తివంచన లేకుం డా కృషి చేశాయి. ప్రచార పర్వం ముగిసే చివరి సెకను వరకు రణక్షేత్రంలో కొట్లాడాయి. మహాయుతి తరఫున ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి షా, మహా సీఎం షిండే, డిప్యూటీ సీఎం, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు ఇలా ప్రచార హోరులో పాల్గొన్నారు. ఇక ఎంవీఏ తరఫున కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, శివసేన నేతలు, ఎన్సీపీ (శరద్ యాదవ్ వర్గం) నేతలు తదితరులు శక్తివంచన లేకుండా కృషి చేశారు.
23న తేలనున్న భవితవ్యం
‘మహా’రాజుగా ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారో, ఎవరు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారో 23న తేలనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత రెండు రోజుల వరకు అభ్యర్థులు టెన్షన్, టెన్షన్‌గా గడపనున్నారు.
వరాల జల్లులు ఓట్లు రాల్చేనా?
మహాయుతితో పాటు ఎంవీఏ ఆ పనులు చేస్తాం.. ఈ పనులు చేస్తాం అంటూ ఇబ్బడిముబ్బడిగా హామీలు కురిపించారు. మహాయుతి ‘ముఖ్యమంత్రి లడ్కీ బహిన్’ యోజన వంటి పథకాలను తీసుకొచ్చి మహిళా ఓటర్లను ప్రస న్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేసింది.
బయటపడ్డ ‘కట్టల పాములు’
పాల్‌ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతంలో ఉన్న హోటల్‌లో బీజేపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని ప్రాంతీయ పార్టీ బహుజన్ వికాస్ అఘాడీ ఆరోపించింది. బీజేపీ ఏర్పాటు చేసిన సమావేశంలో నగదుతో పాటు, ఆ పార్టీ డైరీలు కూడా లభ్యమయినట్లు తెలిపింది. బహుజన్ వికాస్ అఘాడీతో పాటు గా కాంగ్రెస్ కూడా ఇదే ఆరోపణలు చేయగా.. బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టేసింది. ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలని అభివర్ణించింది.
జార్ఖండ్‌లో రెండో విడత
జార్ఖండ్‌లో నేడు రెండో విడత ఎన్నిక లు జరగనున్నాయి. మొత్తం 38 స్థానాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. 13న జరిగిన మొదటి విడతలో 43 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ‘ఇండియా’, ఎ న్డీఏల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. డోర్ ప్రచారంతో చి వరి సెకను వరకు అభ్యర్థులు హోరెత్తించారు. సీఎం భార్య ఎక్స్‌లో బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘మనం అభివృద్ధి మరియు ఆప్యాయతలనే ఎన్నుకుందాం. విద్వేషాలు, కుట్రలు మన కు అక్కర్లేదు. హేమంత్‌ను జైల్లో పెట్టి వారు మన ధైర్యాన్ని దెబ్బతీయాలని చూ సినా అది అంత ఈజీ కాదు’ అని అన్నారు.
500 కోట్ల ఖర్చు
తనను కించపరిచేందుకు, అస త్య ప్రచారం చే సేందుకు బీజేపీ రూ. 500 కోట్లు ఖర్చు చేసిందని సోరెన్ ఆరోపించారు. అసత్య ప్రచారానికి 9వేల నకిలీ వాట్సాప్ గ్రూపులను క్రియే ట్ చేసిందని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతోన్న సోరేన్ పోటీ చేస్తున్న బర్హుతై అసెంబ్లీ స్థానానికి కూడా నేటి విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. అలాగే అనేక మంది ప్రముఖులు కూడా నేటి విడతలోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
6.30 తర్వాతే ‘ఎగ్జిట్’
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ ఎగ్జిట్ పోల్స్ వివరాల కోసం అంతా ఎదురుచూస్తుంటారు. ఎగ్జిట్ పోల్స్‌ను కొంత వరకు నమ్ముతారు. నేడు ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలలో సాయంత్రం 6.30 తర్వాతే ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.