calender_icon.png 26 October, 2024 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఠాక్రే అసలైన వారసుడెవరు?

26-10-2024 02:33:55 AM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో తేలనున్న సేన భవితవ్యం 

తీరప్రాంతంలో  శివసేన వర్సెస్ శివసేన

గెలుపు అవకాశాలు షిండే వర్గానికే ఎక్కువ!

ముంబై, అక్టోబర్ 25: మహారాష్ట్ర ఎన్నికల్లో అసలైన వార్ శివసేనలోనే జరగనుంది. మహా సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన మధ్య బలమైన పోటీ నెలకొం ది. శివసేనను చీల్చి బయటికి వచ్చిన షిండేకు ఈ అసెంబ్లీ ఎన్నికలే పరీక్షగా నిలవనున్నాయి. ఏదేమైనా ప్రజల తీర్పు అంతిమం కాబట్టి ఈ రెండు వర్గాల పోరు ఆసక్తికరంగా ఉండనుంది. వచ్చే ఎన్నికలు రెండు వర్గాల భవిష్యత్తును నిర్ణయిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బాల్ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేనను 2022లో షిండే విభజించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరూ తలపడినప్పటికీ పెద్దగా తేడా కనపడలేదు. నవంబర్‌లో జరిగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అసలు శివసేన ఎవరిదనేది తేలనుంది. అంతేకాకుండా థాకరే అసలైన వారసుడెవరనేది ఈ ఎన్నికలతో తెలియనుంది.

షిండే వర్గానికే అనుకూలం!

మహారాష్ట్రలో ఏ పార్టీ పూర్తి ఆధిపత్యం సాధించలేదు. పెద్ద రాష్ట్రం కావడంతో వివిధ అంశాల పరంగా 6 భాగాలుగా విభజించవచ్చు. మహారాష్ట్ర తీరప్రాంతం అవిభక్త శివసేనకు కంచుకోటగా ఉంది. ముంబై, థాణే ప్రాంతాల్లో వీరి ప్రభావం ఎక్కువ. ఈ ప్రాంతంలో మొత్తం 75 స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో శివసేన 29 సీట్లు గెలవగా, బీజేపీ 27 స్థానాలు సాధించింది. ఇప్పుడు శివసేన చీలిపోవడంతో సమీకరణాలు మారిపోయాయి. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీ బీజేపీ షిండే వర్గానికి అండగా నిలిచింది. ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ కూడా ఇదే కూటమిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో షిండే వర్గం పైచేయి సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల భావిస్తున్నారు. అయితే శివసేన (యూబీటీ) 85 స్థానాల్లో పోటీ చేయనుంది. కానీ షిండే వర్గం మాత్రం 80 సీట్లలోపే అభ్యర్థులను బరిలోకి దింపనుంది. శివసేన పాత క్యాడర్ మాత్రం షిండే వర్గానికే మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.   

షిండేది డూప్లికేట్ పార్టీ: రౌత్

ఈ తీరప్రాంతంలో లోక్‌సభ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష కూటములు చెరో 7 సీట్లను గెలిచాయి. కీలకమైన థానే, కల్యాణ్, ముంబై నార్త్ వెస్ట్ స్థానాలు షిండే వర్గం గెలుచుకోగా పాల్‌ఘర్, రత్నగిరి, ముంబై నార్త్ స్థానాలు బీజేపీ దక్కించుకుంది. థానే జిల్లా షిండేకు కంచుకోట. కాగా, శివసేన (యూబీటీ) నేత సంజయ్‌రౌత్ షిండే నేతృత్వంలోని శివసేనను డూప్లికేట్, నాన్ పార్టీగా అభివర్ణించారు. సీట్ల పంపకాల ఆ రోజుల్లో బీజేపీ నేతలే ముంబైకి వచ్చేవారని చెప్పారు. కానీ డూప్లికేట్ శివసేనకు బాస్ ఢిల్లీలో ఉన్నారని, అది అసలైన పార్టీ కాదని విమర్శించారు. దీంతో రెండు పార్టీల మధ్య బలమైన పోటీ ఉండనుంది.