త్రిముఖ పోటీలో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఒక కేంద్ర మంత్రి
విజయంపై ఎవరి ధీమా వారిదే
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థులు ఎవరికివారు విజయంపై ధీమా తో ఉన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో పోరు రసవత్తరంగా మారింది. ఇక్కడ మూడు ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక కేంద్ర మంత్రి బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న జీ కిషన్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ లో ఉన్నారు. ఈ క్రమంలో గ్రేటర్‌లో తమ కు ఇంకా పట్టు కోల్పోలేదని నిరూపణ చేయడానికి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పద్మారావును బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపింది. వాస్తవానికి ఈ మూడు పార్టీలకు ఇక్కడ గెలుపు చాలా కీలకమనే చెప్పాలి. అలాంటి పరిస్థితిలో నువ్వా.. నేనే అన్నట్టుగా ముగ్గురు అభ్యర్థులు ప్రచారం చేపట్టారు. గెలుపుపై ఎవరి అంచనాలు వాళ్లు వేసుకుంటున్నారు.
పోటీ మూడు పార్టీల మధ్యనే..
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 21,59,776 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ ఎన్నికల్లో 45 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 42.48 శాతం పోలింగ్ నమోదయింది. పూర్తిస్థాయి ఓటింగ్ శాతాన్ని అధికారులు ప్రకటిస్తే మరికొద్దిగా పెరిగే అవకాశం ఉంది.
అయితే, మూడు ప్రధాన పార్టీలలో గెలుపు ఎవరిని వరిస్తుందో అనే అంశం ప్రధాన చర్చగా మారింది. 2019లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్‌పై బీజేపీ అభ్యర్థి జీ కిషన్ రెడ్డి 62 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2023లో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో నాంపల్లి మినహా మిగతా 6 అసెంబ్లీ స్థానాలను బీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.