calender_icon.png 18 January, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిక్కులేని దీనులను ఆదుకునేదెవరు?

05-09-2024 01:36:15 AM

  1. కొన్నేళ్ల క్రితం భర్త, కుమారుడు మృతి 
  2. కాయకష్టం చేసుకుంటూ గుడిసెలో కూతురి పోషణ 
  3. ఇంతలోనే కక్షగట్టిన వాన.. ఇల్లు నేలమట్టం 
  4. తల్లీకూతుళ్ల నిస్సహాయత.. సాయం కోసం ఎదురుచూపు

మెదక్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ఇంటికి దిక్కు అయిన భర్త కొన్నాళ్ల క్రితం మృతిచెందాడు. చేతికొచ్చిన కొడుకు ఈతకు వెళ్లి విగత జీవుడయ్యాడు. ఇక మిగిలిన కూతురిని కాయకష్టం చేసి చదివించుకుంటున్న ఆమెను వర్షం వచ్చి నిండా ముంచింది. వర్షాల ధాటికి తల్లీకూతుళ్లు తలదాచుకుంటున్న గుడిసె కుప్పకూలింది. వీధి వారిని వెక్కిరిస్తూ రోడ్డు పాలుచేసింది. మెదక్ జిల్లా రామాయంపేట మండల అక్కన్నపేట గ్రామానికి చెందిన మల్లుపల్లి అనసూయ భర్త స్వామి ఊర్లో డప్పు చాటింపు వృత్తి చేసేవాడు.

ఐదు సంవత్సరాల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో అనసూయ కూలీ పని చేస్తూ కూతురు శ్రీదేవి (చిన్ని), కొడుకు శ్రీకాంత్‌ను చదివిస్తున్నది. ఏడు నెలల క్రితం ఈతకు వెళ్లి కొడుకు శ్రీకాంత్ నీట మునిగి మరణించాడు. చేతికందిన కొడుకు కాటికి పోయాడని అనసూయ కన్నీరు మున్నీరైంది. పుట్టెడు కష్టాల్లోనూ అనసూయ కూతురు శ్రీదేవిని ఇంటర్మీడియట్  వరకు చదివించింది. ఇకపై చదివించే స్థోమత లేకపోవడంతో కూతురి చదువు ఆపింది. శ్రీదేవి ఇక తల్లితో కలిసి కూలి పనులకు వెళ్లడం ప్రారంభించింది.

బతుకు భారమవుతున్నా తమకున్న చిన్నగుడిసెలో కాలం వెళ్లదీస్తున్నారు. మూడు రోజులుగా భారీ వర్షానికి గుడిసె కుప్పకూలింది. తిరిగి కట్టుకునే స్తోమత లేక నిస్సహాయంగానే ఉండిపోయారు. కట్టుబట్టలతో మిగిలారు. కూలిన ఇంటి బయటి వరండాలో తలదాచుకుంటున్నారు. కనీసం వంట సామగ్రి అయినా లేకపోవడాన్ని గమనించి ఇరుగు పొరుగు వారికి సాయం చేస్తున్నారు. పూటకింత బియ్యం, కూరగాయలు దానం  చేస్తున్నారు. మరోవైపు అనసూయ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న తల్లీకూతుళ్లను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం సాయం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.