calender_icon.png 27 December, 2024 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింక్ టెస్టులో పాగా ఎవరిదో?

06-12-2024 12:55:32 AM

నేటి నుంచి భారత్, ఆసీస్ రెండో టెస్టుఅడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ మ్యాచ్

బరిలో కెప్టెన్ రోహిత్

అడిలైడ్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు జరగనుంది. అడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ ఫార్మాట్‌లో జరగనున్న పింక్ బాల్ టెస్టులో విజయం ఎవరిదన్నది ఆసక్తిగా మారింది. తొలి టెస్టులో 295 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న టీమిండియా జోష్ మీద ఉంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఇక బొటనవేలి గాయంతో తొలి టెస్టుకు దూరమైన శుబ్‌మన్ గిల్ కూడా రెండో టెస్టు ఆడే అవకాశముంది.

దీంతో తొలి టెస్టు ఆడిన పడిక్కల్, ధ్రువ్ జురేల్ బెంచ్‌కు పరిమితమయ్యే అవకాశముంది. వీరిద్దరు మినహా మిగతా జట్టులో పెద్దగా మార్పులు లేకపోవచ్చు. అయితే తొలి టెస్టులో జైస్వాల్, రాహుల్ జోడీ సక్సెస్ కావడంతో ఈ కాంబినేషన్ విడదీయడం ఇష్టం లేదని కెప్టెన్ రోహిత్ స్పష్టం చేశాడు. అవసరమైతే తాను మిడిలార్డర్‌లో బ్యాటింగ్ వచ్చేందుకు సిద్ధమని తెలిపాడు. దీంతో ఓపెనర్లుగా జైస్వాల్, రాహుల్ రావడం ఖాయం. మూడో స్థానంలో గిల్, నాలుగో స్థానంలో కోహ్లీ రానున్నారు. ఐదు, ఆరు స్థానాల్లో  రాహుల్, పంత్ వచ్చే అవకాశముంది.

తొలి టెస్టులో భారీ శతకంతో అలరించిన జైస్వాల్ మరోసారి కీలకమవ్వనున్నాడు. ఇక రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పెర్త్  టెస్టులో సెంచరీ బాది పరుగుల దాహాన్ని తీర్చుకోవడంతో పాటు ఫామ్‌లోకి రావడం భారత్‌కు ఊరట. లోయర్ ఆర్డర్‌లో వికెట్ కీపర్ పంత్ సహా నితీశ్ రెడ్డి, సుందర్ ఉపయుక్తమైన పరుగులు సాధిస్తుండడం సానుకూలాంశం. బుమ్రా భారత బౌలింగ్‌కు వెన్నుముక కాగా.. సిరాజ్, హర్షిత్, సుందర్‌లు అతడిని అనుసరిస్తున్నారు.

పింక్ బాల్ టెస్టు స్పిన్నర్లకు అనుకూలం కావడంతో భారత్ ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే చాన్స్ ఉంది. మరోవైపు ఆస్ట్రేలియాకు అడిలైడ్‌లో మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆసీస్ తాము ఆడిన 12 డే నైట్ మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే ఓడిపోవడం విశేషం. ఆ జట్టు స్టార్  పేసర్ హాజిల్‌వుడ్ గాయంతో దూరమవ్వడం ఇబ్బంది పెట్టనుంది. స్మిత్, లబుషేన్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, హెడ్ రాణింపుపై బ్యాటింగ్ ఆధారపడి ఉంది. గత పర్యటనలో ఇదే అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాన్ని మైమరిపిస్తూ విజయంతో రోహిత్ సేన అడిలైడ్‌లో పాగా వేయాలని ఆశిద్దాం.