21-04-2025 01:03:10 AM
రజతోత్సవ వేళ బయటపడ్డ విభేదాలు
మహబూబాబాద్, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): మానుకోట బీఆర్‌ఎస్ లో అగ్ర నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తూ.. రజతోత్సవ వేడుకల వేళ విజయవంతం చేయడానికి పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాల మేరకు సమన్వయంతో ముందుకు సాగడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు విమర్శలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.
ఎంత పెద్ద లీడర్ అయినా ఏకపక్షంగా వ్యవహరించకూడదని, అధినేత కేసిఆర్ ఆదేశాల మీదకే నడుచుకోవాలని, రజతోత్సవ వేళ అందర్నీ కలుపుకుపోవాలని ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు అన్నారు.
ఆదివారం మహబూబాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 27న ఎలుకతుర్తిలో నిర్వహిస్తున్న రజోత్సవ భారీ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సి ఉండగా మహబూబాబాద్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జిల్లాలో పార్టీ నాయకులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పై విమర్శలు గుప్పించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని, గత ప్రభుత్వ పాలన ఎంతో బాగుందని ప్రజల నుండి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. రజతోత్సవ సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. 15 లక్షల మంది రజతోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని, వాహన పార్కింగ్, మంచినీరు, మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
రజతోత్సవ వేడుకల నిర్వహణకు అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, నాయకులు ఎడ్ల వేణు,గద్దె రవి, మార్నేని రఘు, తేళ్ల శ్రీను, కన్నా, అంబరీష, మార్నేని కిరణ్ తదితరులు పాల్గొన్నారు