ఫైనల్ చేరిన ముంబై, ఎంపీ
బెంగళూరు: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ముంబై, మధ్యప్రదేశ్ ఫైనల్ చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్ ఢిల్లీ మీద, ముంబై బరోడా మీద విజయం సాధించాయి. బరోడాతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో బరోడాను 7 వికెట్ల నష్టానికి 158 పరుగులకే కట్టడి చేసింది. లక్ష్యచేధనకు దిగిన ముంబై జట్టు తొందరగానే ఓపెనర్ పృథ్విషా (5) వికెట్ కోల్పోయినా కానీ మరో ఓపెనర్ రహనే (98) జట్టును విజయతీరాలకు చేర్చాడు. సీనియర్ బ్యాటర్ రహనేకు తోడుగా కెప్టెన్ అయ్యర్ (46) కూడా చెలరేగడంతో ముంబై 17.2 ఓవర్లలోనే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తృటిలో సెంచరీ కోల్పోయిన రహనేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మధ్యప్రదేశ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఢిల్లీ మీద ఘన విజయం సాధించి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఎంపీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ఢిల్లీ బ్యాటర్లను నిలువరించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి ఢిల్లీ 146 పరుగులు మాత్రమే చేసింది. ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ రెండు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఎంపీ కెప్టెన్ రజత్ పాటిదార్ (66*) ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. రేపు ఫైనల్ జరగనుంది.