calender_icon.png 8 November, 2024 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిముఖ పోరులో ఎవరెక్కడ?

14-05-2024 02:08:43 AM

మెజారిటీ స్థానాలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే వార్ 

నాలుగైదు సీట్లలో ప్రభావం చూపిన గులాబీ  

పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న పార్టీల పెద్దలు

గెలుపు తమదేనంటూ ప్రధాన పార్టీల ధీమా

హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు అధికారికంగా పూర్తయ్యింది. ఉదయం పోలింగ్ మందకొడిగా సాగిన మధ్యాహ్నం తరువాత ఊపందుకుంది. సొంతూళ్లకు వచ్చినవారు పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలను పర్యటిస్తూ ఓటింగ్ సరళిని పరిశీలించారు.

గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం ఈ సారి ఎక్కువ కావడంతో త్రిముఖ పోరులో తనదే గెలుపు అంటూ అంచనా వేస్తున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత బూత్‌ల వారీగా వివరాలు తెప్పించుకుని అనుకూలమైన ఓటర్ల సంఖ్యను గుర్తిస్తూ మెజార్టీని అంచనా వేసుకున్నారు. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్లు సాగగా, నాలుగైదు సెగ్మెంట్లలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పోటీ ఇచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఆదిలాబాద్: ఈ స్థానంలో ఆత్రం సుగుణ (కాంగ్రెస్), గోడం నగేశ్ (బీజేపీ), ఆత్రం సక్కు (బీఆర్‌ఎస్) పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. చివరి మూడు రోజుల్లో అత్రం సుగుణ, నగేశ్ మధ్య టఫ్ ఫైట్ సాగింది. ఆ పార్టీలకు చెందిన అగ్రనేతలు విస్తతృంగా ప్రచారం నిర్వహించడంతో స్థానిక ప్రజలు కేంద్రంలో అధికారం చేపట్టే పార్టీలు ఈ రెండేనని భావించి బీఆర్‌ఎస్ పట్ల విముఖత చూపారు. 

పెద్దపల్లి: గడ్డం వంశీ (కాంగ్రెస్), మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (బీఆర్‌ఎస్), గోమాస శ్రీనివాస్ (బీజేపీ) పోటీలో నిలిచారు. ఈ సెగ్మెంట్‌లో హస్తం, గులాబీ పార్టీల మధ్య పోరు సాగింది. పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారు కావడంతో తమదే విజయం వంశీ భావిస్తుండగా, కొప్పుల ఈశ్వర్ మాత్రం గత బీఆర్‌ఎస్ పాలనలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానని, ఓటర్లు ఎక్కువగా సింగరేణి కార్మికులు కావడంతో తనకు మద్దతు పలుకుతారని ఆశిస్తున్నారు. ఇక్కడ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు విజేతగా నిలిస్తారని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు.

నిజామాబాద్: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (బీజేపీ), బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్‌ఎస్) బరిలో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉంది. ఈ ప్రాంతంలో గోవర్ధన్ నిలబడినా పెద్దగా జనాలు ఆదరణ చూపలేదని, ప్రాంతీయ పార్టీ గెలిచినా అభివృద్ది జరగదని కాంగ్రెస్, బీజేపీకు ప్రజలు మొగ్గు చూపారు. ఎన్నికల ఫలితాల్లో జాతీయ పార్టీల అభ్యర్థులే విజేతగా నిలుస్తారని అక్కడ ప్రజలు పేర్కొంటున్నారు.

జహీరాబాద్: ఈ నియోజకవర్గంలో మూడు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నా చివరి నాలుగు రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే సమరం సాగింది. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ (బీజేపీ), సురేష్ షెట్కార్ (కాంగ్రెస్), గాలి అనిల్‌కుమార్(బీఆర్‌ఎస్) పోటీలో ఉన్నారు. పాటిల్, షెట్కార్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలతోపాటు రెండు పర్యాయాలు ఎంపీగా ప్రజలకు పాలన అందించిన నాయకులే. రెండు పార్టీ అధినేతలు కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అనిల్‌కుమార్ ప్రభావం చూపలేకపోయారు.

కరీంనగర్: ఇక్కడ బోయినపల్లి వినోద్‌కుమార్ (బీఆర్‌ఎస్), సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ (బీజేపీ), వెలిచాల రాజేందర్‌రావు (కాంగ్రెస్) నిలిచారు. వినోద్, బండి సంజయ్ మధ్య రసవత్తర పోరు జరిగింది. అధికార కాంగ్రెస్ నుంచి రాజేందర్‌రావు చివరి క్షణంలో బరిలోకి దించడంతో ఆయన పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేకపోయారు. అక్కడి క్యాడర్ కూడా పెద్దగా సహకరించలేదని ప్రచారం జరిగింది. దీంతో ఇక్కడ వినోద్, సంజయ్ ఎవరో ఒకరు గెలిచే చాన్స్ ఉంది. 

మెదక్: ఈ స్థానంలో వెంకట్రామ్‌రెడ్డి (బీఆర్‌ఎస్), రఘనందన్‌రావు (బీజేపీ) మధ్య పోరు ఉధృతంగా సాగింది. పార్టీల అగ్రనేతలు ప్రచారానికి రావడంతో ఓటర్లు కొంత మొగ్గు చూపారు. అధికార కాంగ్రెస్ నుంచి బీసీ వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్ ఆశించిన స్థాయిలో ప్రత్యర్థులను ఎదుర్కోలేకపోయాడని స్థానికులు అంటున్నారు. 

మల్కాజిగిరి: ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ (బీజేపీ), రాగిడి లక్ష్మారెడ్డి (బీఆర్‌ఎస్), పట్నం సునీతామహేందర్‌రెడ్డి (కాంగ్రెస్) పోటీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తరువాత నుంచే ప్రచారంలో ఈటల, లక్ష్మారెడ్డి పోటాపోటీగా పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నియోజకవర్గానికి కొత్త కావడంతోపాటు అక్కడి ఆశావహులకు టికెట్ లభించకపోవడంతో సునీతకు ఆశించిన స్థాయిలో సహకారం అందలేదని టాక్. మోడీ రోడ్ షో తనకు గెలుపుకు సహకరిస్తుందని ఈటల ధీమాలో ఉండగా, రాగిడి మాత్రం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలంతా తమ పార్టీ వారు ఉండటంతో విజయం తనదేనంటూ అనుచరులతో పేర్కొంటున్నారు.

సికింద్రాబాద్: ఇక్కడ బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు ప్రజాప్రతినిధులే. దానం నాగేందర్ (కాంగ్రెస్), పద్మారావుగౌడ్ (బీఆర్‌ఎస్), కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (బీజేపీ) పోటీలో నిలిచారు. ఈ ముగ్గురూ బలమైన నాయకులే కావడం గమనార్హం. కానీ స్థానిక ఎమ్మెల్యేలంతా బీఆర్‌ఎస్ వారే కావడంతో తనదే విజయమని పద్మారావు పేర్కొంటుండగా, కేంద్ర పథకాలే గెలిపిస్తాయని కిషన్‌రెడ్డి ధీమాలో ఉన్నారు. దానం మాత్రం బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు రావడంతో పార్టీ నేతలతో పాటు స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 

హైదరాబాద్: సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ (ఎంఐఎం), కొంపెల్లి మాధవీలత (బీజేపీ), వలీవుల్లా సమీర్ (కాంగ్రెస్), గడ్డం శ్రీనివాసయాదవ్ (బీఆర్‌ఎస్) బరిలో ఉన్నారు. అయితే, ఇక్కడ ప్రధానంగా మజ్లిస్, బీజేపీ మధ్యనే పోటీ ఉంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కొంచెం కూడా ఉనికి చాటలేకపోయాయి. ఓటు బ్యాంకును కాపాడుకునే పనిలో నామమాత్రంగా బరిలోకి దిగినట్లు వీరిపై టాక్. 

చేవెళ్ల: ఇక్కడి అభ్యర్థులంతా కోటీశ్వరులే. సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి (కాంగ్రెస్), మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (బీజేపీ), కాసాని జ్ఞానేశ్వర్ (బీఆర్‌ఎస్) పోటీ చేశారు. ఈ సెగ్మెంట్‌లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపైనే అంచనాలు ఉన్నాయి. 

వరంగల్: ఎస్సీ స్థానమైన వరంగల్‌లో కడియం కావ్య (కాంగ్రెస్), ఆరూరి రమేశ్ (బీజేపీ), మారపల్లి సుధీర్‌కుమార్ (బీఆర్‌ఎస్) బరిలో నిలిచారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ బలంగా నిలబడ్డాయి. చివరి నాలుగు రోజుల్లో వీరే అధికంగా ప్రభావం చూపారు. 

మహబూబాబాద్: ఈ స్థానంలో ముగ్గురు అభ్యర్థులు ఎంపీగా పనిచేసినవారే. బలరాంనాయక్ (కాంగ్రెస్), సీతారాంనాయక్ (బీజేపీ), సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత (బీఆర్‌ఎస్) పోటీ పడుతుండగా.. ఎన్నికల సమరమంతా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య సాగింది. వీరిద్దరిలో ఒకరు గెలుస్తారని, బీజేపీ పోరాటం డిపాజిట్ వరకేనని స్థానిక నేతలు అంటున్నారు. 

ఖమ్మం: ఇక్కడ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు (బీఆర్‌ఎస్), రామసహాయం రఘురాంరెడ్డి (కాంగ్రెస్), తాండ్ర వినోద్‌రావు(బీజేపీ) నిలబడ్డారు. నామా ఇప్పటికే రెండు సార్లు ఎంపీగా గెలిచారు. జాతీయ పార్టీల అభ్యర్థులు మాత్రం ఆ పార్టీల ఓటు బ్యాంకుపై ఆధారపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యనే పోటీ ఉందని చెబుతున్నారు. 

భువనగిరి: ఈ నియోజకవర్గంలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్), క్యామ మల్లేశ్ (బీఆర్‌ఎస్), బూర నర్సయ్యగౌడ్ (బీజేపీ) బరిలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ బలంగా ఉందని, వీరిలో ఒకరు గెలుస్తారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. 

నల్లగొండ: ఈ స్థానంలో కంచర్ల కృష్ణారెడ్డి (బీఆర్‌ఎస్), జానారెడ్డి కుమారుడు రఘువీర్‌రెడ్డి (కాంగ్రెస్), శానంపూడి సైదిరెడ్డి (బీజేపీ) నిలిచారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకే గెలిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. శానంపూడి పెద్దగా ప్రభావం చూపలేదని టాక్. 

మహబూబ్‌నగర్: ఇక్కడ పోటీ బలంగా ఉంది. సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి (బీఆర్‌ఎస్), డీకే అరుణ (బీజేపీ), చల్లా వంశీచంద్‌రెడ్డి (కాంగ్రెస్) ముగ్గురు బలమైన అభ్యర్థులు కావడంతో ఇక్కడ స్వల్ప మెజారిటీతోనే గెలుపు వరించే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. 

నాగర్‌కర్నూల్: ఈ నియోజకవర్గంలో ప్రజా బలమున్న నేతలు బరిలో నిలిచారు. మల్లు రవి (కాంగ్రెస్), ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ (బీఆర్‌ఎస్), సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు భరత ప్రసాద్ (బీజేపీ) నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, గులాబీ పార్టీ అభ్యర్థులకే అవకాశం ఎక్కువగా ఉందని స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది.