- నేటి నుంచి ప్రొ కబడ్డీ 11వ సీజన్
- గ్రామాలతో పాటు పట్టణాల్లోనూ పెరుగుతున్న ఆదరణ
- సాంప్రదాయ ఆటకు కొత్త సొబగులు
- ఎనిమిదితో మొదలై 12 జట్ల దాకా
* ‘కబడ్డీ’ ఎవరికీ పరిచయం అక్కర్లేని పేరు. మనలో ప్రతి ఒక్కరూ చిన్న నాటి నుంచి ఆడిన ఆట. మోకాలు చిప్పలు, మోచేతులు కొట్టుకుపోయినా సరే లాగులెగేసుకుంటూ వదలకుండా ఆడిన ఆట. మనలో ప్రతి ఒక్కరికీ కబడ్డీతో మరుపురాని అనుభూతులు ఉంటాయి. మన మట్టిలో పుట్టిన ఈ ఆటను 2014 వరకు పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2014 నుంచి కబడ్డీ ఆటగాళ్ల ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రొ కబడ్డీ లీగ్ ఎంట్రీతో కబడ్డీ దశ-దిశ తిరిగిపోయింది. మన మట్టిలో పుట్టిన ఆటకు కార్పొరేట్ సొబగులు అద్దుతూ ప్రొ కబడ్డీ లీగ్ తెర మీదకు వచ్చింది.
విజయక్రాంతి, ఖేల్ విభాగం :
గత 10 సీజన్లుగా గ్రామీణ ప్రేక్షకులతో పాటు పట్టణ వాసులను కూడా అలరిస్తూ వస్తున్న కబడ్డీ ఆట నేటి నుంచి 11వ సీజన్ ప్రారంభం కానుంది. 2014లో కేవలం 8 జట్లతో మొదలైన ప్రొ కబడ్డీ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ ఇవాళ 12 జట్లకు చేరుకుంది.
ఇప్పటివరకు 10 సీజన్లు విజయవంతం కాగా.. నేటి నుంచి ఆరంభం కానున్న 11వ సీజన్‌లో తమ భవితవ్యం తేల్చుకునేందుకు.. కబడ్డీ కోర్టులో కూతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. అనతి కాలంలోనే ప్రొ కబడ్డీ లీగ్ విపరీతమైన జనాధరణను సొంతం చేసుకుంది.
కబడ్డీకి వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆకర్షితులయ్యారు. దీంతో పీకేఎల్ నిర్వాహకులు 2016వ సంవత్సరంలో ఒకే ఏడాదిలో రెండు సీజన్లు నిర్వహించారు. కానీ అప్పుడు పెద్దగా మజా రాకపోవడంతో తర్వాతి సంవత్సరం నుంచి ఏడాదికి ఒకసారి మాత్రమే కబడ్డీ సీజన్ నిర్వహిస్తూ వస్తున్నారు.
పోస్టర్ బాయ్‌గా రాహుల్
పీకేఎల్ పోస్టర్ బాయ్ రాహుల్ చౌదరి గురించి తెలియని వారు ఉండరు. లీగ్ మొదలైన కొత్తలో రాహుల్ చౌదరి తనదైన దూకుడుతో ప్రత్యర్థులను బెంబేలెత్తించడమే కాకుండా పలు రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. తర్వాతి కాలంలో ఆ రికార్డులు వేరే ఆటగాళ్ల వశమైనప్పటికీ రాహుల్ చౌదరి మాత్రం పీకేఎల్ పోస్టర్ బాయ్‌గా అందరికీ గుర్తుండిపోయాడు.
12.80 లక్షలే అత్యధికం
మొదటి సీజన్ జరిగిన 2014లో లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా భారత జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రాకేశ్ కుమార్ నిలిచాడు. రాకేశ్ కుమార్‌ను పట్నా ప్రాంచైజీ రూ. 12.80 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది. రూ. 12.60 లక్షలతో దీపక్ నివాస్ హుడాను తెలుగు టైటాన్స్ దక్కించుకోగా.. అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా డియోక్ నిలిచాడు.
అతడిని రూ. 7 లక్షలకు పట్నానే దక్కించుకోవడం గమనార్హం. ఇలా ఖరీదైన ఆటగాళ్లను సొంతం చేసుకున్నా కానీ పట్నా మాత్రం ఆ సీజన్ టైటిల్ గెలవలేకపోయింది. 56 గేమ్స్ తర్వాత అత్యధిక పాయింట్లు సాధించిన నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. జూలై 26వ తేదీన యూ ముంబా పింక్ పాంథర్స్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరగ్గా.. జైపూర్ పింక్‌పాంథర్స్ 35 తేడాతో ముంబైని మట్టికరిపించి తొలి టైటిల్‌ను ముద్దాడింది.
అప్పుడు మిస్సయినా..
యూ ముంబా జట్టు మొదటి సీజన్‌లో ఫైనల్ చేరి ఫైనల్లో ఓడిపోయింది. కానీ రెండో సీజన్‌లో మాత్రం ఆ తప్పును పునరావృతం కానీయలేదు. బెంగళూరు బుల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 36 తేడాతో విజయకేతనం ఎగురేసింది. తొలిసారి పీకేఎల్ ట్రోఫీని ముద్దాడింది. జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సీనియర్ ఆటగాడు అనూప్ కుమార్ తన అనుభవాన్నంతా రంగరించి ముంబై జట్టుకు ట్రోఫీని కట్టబెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముంబై మరోసారి పీకేఎల్ ట్రోఫీని ముద్దాడలేదు.
డుబ్కీ ఎరా బిగిన్స్..
పీకేఎల్‌లో రాహుల్ చౌదరి పేరు పోస్టర్ బాయ్‌గా ఎంత మారుమోగి పోయిందో డుబ్కీ కింగ్‌గా పర్దీప్ నర్వాల్ పేరు కూడా అదే స్థాయిలో మారుమోగిపోయింది. పర్దీప్ నర్వాల్ రైడింగ్‌కు వస్తున్నాడంటే చాలు అవతలి కోర్టులో ఉన్న ఆటగాళ్లు గజగజలాడేవారు.
2026లో రెండు సార్లు జరగ్గా ఆ రెండు సీజన్లతో పాటు 2017లో జరిగిన సీజన్‌లో కూడా పట్నా ట్రోఫీని కైవసం చేసుకుని.. ఏ జట్ట్టుకు సాధ్యం కాని రికార్డులను తిరగరాసింది. వరుసగా హ్యాట్రిక్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్న పట్నా పైరేట్స్ పీకేఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది.
మహిళల కూత షురూ
2016 జూన్ సీజన్‌లో మహిళల కబడ్డీ కూడా షురూ అయింది. ఆరంభ సీజన్‌లో మూడు జట్లు పాల్గొనగా.. ఏడు నగరాల్లో మ్యాచ్‌లు జరిగాయి. స్టామ్ క్వీన్స్ జట్టు మొదటి సీజన్‌లో ట్రోఫీని ముద్దాడింది. కానీ ఆ సీజన్ తర్వాత మాత్రం మహిళల కూత మళ్లీ వినిపించలేదు.
సెలెబ్రిటీ హంగామా
పీకేఎల్ టోర్నీలో సెలబ్రెటీల హంగామాకు కొదవే లేదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ జైపూర్ పింక్ పాంథర్స్ జట్టుకు ఓనర్‌గా ఉన్నారు. జైపూర్ జట్టు తొలి ఎడిషన్ తర్వాత చాలా సీజన్ల పాటు మరోసారి ట్రోఫీని ముద్దాడకపోయినా కానీ అభిషేక్ బచ్చన్ మాత్రం తన జట్టును చీర్ చేయడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఆ జట్టు ఎక్కడికి వెళ్లి ఆడిన అక్కడ ప్రత్యక్షమయ్యే అభిషేక్ నిత్యం ఆటగాళ్లను ఉత్సాహపరుస్తుంటాడు. కేవలం బచ్చన్ ఒక్కడే కాకుండా సతీమణి ఐశ్వర్యరాయ్, కూతురుతో కలిసి మ్యాచ్‌లకు హాజరవుతూ ఉంటాడు.
తెలుగు వెలగలేదు
2014లోనే ఆరంగ్రేటం చేసిన మన హైదరాబాదీ ‘తెలుగు టైటాన్స్’ జట్టు ఇంత వరకు 10 సీజన్లు పూర్తయినా కానీ ట్రోఫీని ఒడిపట్టుకోలేకపోయింది. వీరా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘తెలుగు టైటాన్స్’కు ఎంత మంది ఆటగాళ్లు మారినా, కోచ్‌లు మారినా కానీ అదృష్టం మాత్రం మారలేదు. తెలుగు టైటాన్స్ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన అంటే రెండో సీజన్, నాలుగో సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
మరి ఈ సీజన్‌లో అయినా కప్పు గెలిచి తెలుగు అభిమానుల ఆశలను నెరవేరుస్తుందో చూడాలి. పట్నా పైరేట్స్ జట్టు వరుసగా మూడుసార్లు టైటిల్ నెగ్గి హ్యాట్రిక్ సాధిస్తే మన జట్టు వరుసగా మూడు పర్యాయాలు చివరి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. 10 సీజన్లు ఆడినా కానీ తెలుగు టైటాన్స్ ఇంత వరకు ట్రోఫీని ముద్దాడలేదు.
మరి మన జట్టులో స్టార్ ఆటగాళ్లు లేరా అంటే పీకేఎల్ పోస్టర్ బాయ్‌గా పేరొందిన రాహుల్ చౌదరి దగ్గరి నుంచి హైఫ్లయర్ పవన్ షెరావత్ వరకు ఎంతో మంది ఆటగాళ్లు మన ప్రాంచైజీ తరఫున ఆడారు. కానీ ప్రాంచైజీ దురదృష్టమో ఏమో తెలియదు కానీ ఏ ఒక్క స్టార్ ప్లేయర్ మన తరఫున రాణించలేదు.
ప్రొ కబడ్డీ లీగ్ విజేతలు
సీజన్ విజేత రన్నరప్
2014 జైపూర్ ముంబై
2015 ముంబై బెంగళూరు
2016 (జనవరి) పట్నా ముంబై
2016 (జూన్) పట్నా జైపూర్
2017 పట్నా గుజరాత్
2018-19 బెంగళూరు గుజరాత్
2019 బెంగాల్ ఢిల్లీ
2021-22 ఢిల్లీ పట్నా
2022 జైపూర్ పునేరి
2023 పునేరి హర్యానా
నేటి మ్యాచ్‌లు
వేదిక: హైదరాబాద్
తెలుగు టైటాన్స్ x బెంగళూరు బుల్స్
దబంగ్ ఢిల్లీ x యూ ముంబా