టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. పొట్టి ప్రపంచకప్‌తో ద్రవిడ్ పదవీ కాలం ముగియనుండగా.. అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్, జస్టిన్ లాంగర్ పేర్లు బలంగా వినిపిస్తున్నా.. మరి మూడేండ్లకు పైగా ఉన్న టెన్యూర్‌లో ఈ పదవీ బాధ్యతలు ఎవరిని వరిస్తాయో చూడాలి!
దరఖాస్తులకు బీసీసీఐ ఆహ్వానం
మెగాటోర్నీతో ముగియనున్న ద్రవిడ్ పదవీకాలం
రేసులో లక్ష్మణ్, గంభీర్, లాంగర్
న్యూఢిల్లీ: టీమిండియా కొత్త ప్రధాన కోచ్‌గా బాధ్యతలు ఎవరు తీసుకోనున్నారనేది క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. టీ20 ప్రపంచకప్‌తో ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తికానున్న సంగతి తెలిసిందే. ద్రవిడ్ స్థానంలో ఎవరు ఆ బాధ్యత తీసుకుంటారన్న నేపథ్యంలో మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్, జస్టిన్ లాంగర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు కోచ్ పదవిపై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లక్ష్మణ్.. ద్రవిడ్ గైర్హాజరీలో పలు సిరీస్‌లకు భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా సేవలందించాడు.
ఈ నేపథ్యంలో మిగిలిన వారితో పోల్చితే లక్ష్మణ్‌కే ఎక్కువ అవకాశాలు కని పిస్తున్నాయి. ఇక గంభీర్ ప్రస్తుతం ఐపీఎల్లో అదరగొడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా కొనసాగుతుండగా.. లాంగర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే రెడ్ బాల్, వైట్‌బాల్ ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌లు ఉంటే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనపై బీసీసీఐ ఆలోచన చేస్తోంది. అయితే ఈ పదవీకాలం మూడున్నరేళ్ల పాటు ఉండడంతో బాధ్యతలు ఒక్కరికే అప్పజెపితే ఎలా ఉంటుందన్న విషయం కూడా బీసీసీఐ పరిశీలించనుంది.
ఇక కోచ్‌గా రాహు ల్ ద్రవిడ్ పదవీ కాలం జూన్ చివరినాటికి ముగియనుంది. టీ20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 29న ముగియనుండగా.. అప్పటివరకు ద్రవిడ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. ఆ తర్వాత కొత్త కోచ్ పదవీకాలం జూలై 1 నుంచి మొదలై 2027 డిసెంబర్ 31 వరకు మూడున్నరేళ్ల పాటు కొనసాగనుంది. ఈ మూడున్నరేళ్లలో మూడు మెగా టోర్నీలు జరగనున్నాయి. 2025లో చాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌తో పాటు 2027 వన్డే ప్రపంచకప్‌లు జరగనున్నాయి. అంటే వచ్చే మూడేళ్లు టీమిండి యా హెడ్ కోచ్‌గా ఎవరు ఉంటారో వారిపై పెద్ద బాధ్యతే ఉండనుంది.
మే 27 వరకు అవకాశం..
టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్త్తు చేసుకునేందుకు బీసీసీఐ సోమవారం ప్రకటన విడుదల చేసింది. హెడ్‌కోచ్ పదవికి సంబంధించి అర్హతలు, బాధ్యతలు వెల్లడిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది.‘కోచ్ పదవికి దరఖాస్తు చేసుకునే వారి వయసు 60 ఏళ్ల లోపు ఉండాలి. అంతర్జాతీయ స్థాయిలో కనీసం 30 టెస్టులు/ 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదా టెస్టులు ఆడుతున్న జట్టుకు కనీసం రెండేళ్ల పాటు హెడ్‌కోచ్‌గా వ్యవహరించి ఉండాలి. ఇక మూడు ఫార్మాట్లలో టీమిండియా పురుషుల జట్టు ప్రదర్శన, నిర్వహణ మొత్తం బాధ్యత ప్రధాన కోచ్‌పైనే ఉంటుంది. అతడికి సహాయంగా సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. దరఖాస్తులకు మే 27 చివరి తేదీ. దరఖాస్తుల పరిశీలన, వ్యక్తిగత ఇంటర్యూలు నిర్వహించి కోచ్‌ను ఎంపిక చేయనున్నాం’ అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.
ద్రవిడ్ కొనసాగేనా?
ఇక నవంబర్ 2021 నుంచి 2023 వరకు కోచ్‌గా పనిచేసిన ద్రవిడ్‌ను 2024 టీ20 ప్రపంచకప్ వరకు ఆ పదవిలో కొనసాగాలంటూ బీసీసీఐ అతడి పదవీ కాలాన్ని పొడిగించింది. ఒకవేళ ద్రవిడ్ పదవిలో కొనసాగాలనుకుంటే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనంటూ జై షా వెల్లడించారు. ద్రవిడ్ కోచ్‌గా కొనసాగేందుకు సముఖంగా లేనట్లు సమాచారం. ప్రధాన కోచ్‌గా ఎవరు రానున్నారనేది ఆసక్తికరం.