01-03-2025 12:26:18 AM
కరీంనగర్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికపై అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. మొత్తం ఐదు స్థానాలు ఖాళీ అవుతుండగా సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ కు నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది. ఈ స్థానం కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు నేతలు ఆశలు పెంచుకున్నారు.
కరీంనగర్-మెదక్ -నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానాన్ని త్యాగం చేసిన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి జీవన్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవ ర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డిలు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
పొత్తు ధ ర్మంలో భాగంగా ఒక ఎమ్మెలీ స్థానాన్ని తమకు కేటాయించాలని సీపీఐ నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు ఏఐ సీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్ర ధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ను కలిసి విన్నవించారు. సీపీఐ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, హస్నాబాద్ మాజీ ఎమ్మె ల్యే చాడ వెంకట రెడ్డి పేరును ఆ పార్టీ ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది.
ఇప్పుడున్న నేతల్లో ఆయన సీనియర్ గనుక ఒక సీటు సీపీఐకి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తే చాడకు అవకాశం దక్కనుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న నేతల్లో సీనియర్ అయిన ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి తనకు ఎమ్మెల్యే కోటా నుండి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. మరో నాయకుడు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రె స్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు.
ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రతి ఎన్నికల్లో ఢీకొంటూ నిలబడి పార్టీకి సేవలందిస్తున్న మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే పార్టీ మరింత బలపడుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి పొత్తు ధ ర్మాన్ని పాటిస్తారా, సీనియర్ నేతల్లో ఒకరికి అవకాశం కల్పిస్తారా, రాష్ర్టవ్యాప్తంగా పోటీ తీవ్రంగా ఉన్నందున ఈ ముగ్గురిని పక్కకు పెడతారా ఒకటి రెండు రోజుల్లో తేలనుంది.