సెంట్ లూసియా: టీ20 ప్రపంచకప్‌లో నేటితో లీగ్ దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి. మంగళవారం సెంట్ లూసియా వేదికగా చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ ఆతిథ్య వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు సూపర్ అర్హత సాధించినప్పటికీ గ్రూప్ నుంచి టాపర్‌గా ఎవరు అడుగుపెడతారన్నది ఆసక్తికరం. లీగ్ దశలో న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఉగాండాలపై భారీ విజయాలు అందుకున్న అఫ్గానిస్థాన్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తోంది.
మరోవైపు సొంతగడ్డపై చెలరేగిపోతున్న విండీస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరచాలని చూస్తోంది. రహమనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రన్, నజీబుల్లా జర్దన్, గుల్బదిన్ నదీమ్, మహ్మద్ నబీలతో అఫ్గానిస్థాన్ బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్న ఫజల్లా ఫరుఖీ మరోసారి కీలకం కానుండగా.. కెప్టెన్ రషీద్ స్పిన్ అస్త్రంతో చెలరేగిపోవాలని చూస్తున్నాడు. మరోవైపు కెప్టెన్ రోవమన్ పావెల్ సారధ్యంలో బ్రాండన్ కింగ్, జాన్సన్, పూరన్, రూథర్‌ఫోర్డ్, రసెల్‌లతో పటిష్టంగా కనిపిస్తున్న విండీస్ జట్టు సొంతగడ్డపై ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అల్జారీ జోసెఫ్, షెపర్డ్, మోటీలతో బౌలింగ్ బలంగా ఉంది.