జూకంటి జగన్నాథం :
తెలంగాణ కోసం అంతా తెలంగాణమై ప్రజా సమూహాలలో పని చేస్తున్న మేధావి వర్గం, కవులు, రచయితలు, పాత్రికేయుల ముందు ఆశ్చర్యంగా ‘తెలంగాణ జాతిపిత ఎవరు?’ అనే మిలియన్ డాలర్ల ప్రశ్న తేల్చాల్సిన అంశంగా మిగిలిపోయే ఉంది.
తెలంగాణ కోసం తెలంగాణ గోస, తెలంగాణ భాష, తెలంగాణ ఆశ, తెలంగాణ శ్వాసగా చివరి వరకు జీవించిన వారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్. ఆయన 13వ వర్ధంతి జూన్ 21 సందర్భంగా అన్ని ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ గ్రూప్‌లలో ‘తెలంగాణ జాతిపిత కొత్తపల్లి జయశంకర్ సార్’కు నివాళి అనే సమాచారం కోట్లాదిమంది తెలంగాణ ప్రజలమధ్య తిరుగాడింది. ఈ సందర్భం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది.
ఎందుకంటే, ‘ఇడ్లీ సాంబార్ గో బ్యాక్’ పోరాటం నుంచి ‘1969 నాన్ ముల్కీ’ ఉద్యమం వరకు ప్రొఫెసర్ జయశంకర్ కనిపిస్తారు. ఇది ఎవరూ కాదనలేని (తిరుగు లేని) సత్యం. తెలంగాణ ప్రత్యేక ఉద్యమాలు తెరలు తెరలుగా ఎగిసి పడినప్పుడల్లా అన్ని టా, అంతటా ప్రత్యక్ష సాక్షిమాత్రమే కాదు, ఆయా కాలాల్లో పడిలేచిన తెలంగాణ అస్తిత్వ ఉద్యమాలలో నేరుగా పాల్గొన్నవారాయన. అయితే, ఇప్పుడు ‘తెలంగాణ జాతిపిత ఎవరు?’ అనే ప్రశ్న తలెత్తడానికి కారణం బీఆర్‌ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17 సందర్భంగా ఆ పార్టీ శ్రేణుల పేరిట తెలంగాణ అంతటా ‘తెలంగాణ బాపు కేసీఆర్’ అనే ఫ్లెక్సీలు వెలిశాయి. ఇది మరోసారి తెలంగాణ మలి దశ ఉద్యమ సమయం నాటి పరిస్థితులను సమీక్షించాల్సిన అవసరాన్ని కలిగించాయి. అందుకే, పై ప్రస్తావనను తేవాల్సి వస్తున్నది.
తాత్విక భూమికను అందించిన శక్తి
జయశంకర్ ‘దగా పడ్డ తెలంగాణ’ పుస్తకంలో ఏయే రంగాలలో తెలంగాణ ఎలా అన్యాయానికి గురైందో గణాంకాలతోసహా ఇచ్చి, అత్యంత ప్రామాణికంగా నిరూపించిన స్రష్ట అతడు. ఆయన చదువుకున్నది ఆర్థిక శాస్త్రమైనా, ఆర్థిక శాఖ ప్రొఫెసర్‌గా, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా, ఇఫ్లో రిజిస్ట్రార్‌గా పలు ఉద్యోగాలలో పని చేసినా, విద్యార్థులకు పాఠాలు చెప్పినా ఆయన చివరి ఊపిరి వరకు ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా, నిరంతరం పనిచేస్తూ వచ్చా రు. ముఖ్యంగా 2002 మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక తాత్విక భూమికను అం దించి కీలకంగా పని చేసిన ఒక శక్తి అతడు.
కానీ, కేసీఆర్ ఏకపక్షంగా ‘తెలంగాణ బాపు’ అని ప్రకటించుకొని, తమ పార్టీ కార్యకర్తలతో తన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ అంతా హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. 2004 మే నెలలో గోదావరిఖనిలో ప్రారంభ సమావేశం నిర్వహించిన ‘తెలంగాణ విద్యావంతుల వేదిక’ గౌరవ అధ్యక్షుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ మార్గదర్శకత్వంలో కోదండరాం అధ్యక్షుడుగా ఎంతో ప్రభావశీలమైన ఉద్యమా లు నిర్మించి క్రియాశీలంగా పని చేశారు.
ఆత్మహత్యల విషాదం
అయితే, ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమం తన చేతిలో నుంచి పట్టు జారిపోతున్న సమయంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కరీంనగర్ టీఆర్‌ఎస్ భవన్ నుంచి సిద్దిపేట దగ్గరి రంగ ధామ్‌పల్లెకు వెళ్లేటప్పుడు అలుగునూరి దగ్గర పోలీసులు అరెస్టు చేసి ఖమ్మంకు తరలించారు. అప్పుడు రంగధామ్‌పల్లెలో నిరాహార దీక్ష శిబిర సభను పర్యవేక్షిస్తున్న తన్నీరు హరీష్‌రావు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ‘జై తెలంగాణ’ నినాదం చేశారు. ఈ సంఘటనకు హరీష్‌రావు ఎందుకు పాల్పడ్డారో గానీ తత్ఫలితంగా తెలంగాణ యువతరాన్ని తెలంగాణ సాధన కోసం ఆత్మహ త్యల వైపు పురిగొలిపినట్టు అయింది.
అనంతరం తెలంగాణ ఉద్యమం ప్రధాన మలుపు తీసుకుంటున్న ప్రతీ సందర్భంలో కేసీఆర్ ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో’, ‘అవసరమైతే తెలంగాణ కోసం మెడ నరుక్కుంటాను తప్ప, లొంగే ప్రసక్తే లేదు’ వంటి నినాదాలు కూడా తెలంగాణ యువకులను ఆత్మహత్యలవైపు ప్రేరేపించినట్లు అయింది. ఇతరులు ఎవరూ అనక ముందే కేసీఆర్ స్వయంగా ‘తాను చావు పులి నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చాను’ అని పలుమార్లు అనడం ప్రారంభించారు. సుమారు 1300 పైగా యువకులు ‘జై తెలంగాణ’ అంటూ (మంటల్లో దూకి) రకరకాలుగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది జరగడం తెలంగాణ సాకారంలో అత్యంత దురదృష్టకర విషాదం.
శిఖరాగ్ర స్థాయికి ఉద్యమం
ఇలా ఒకవైపు జరుగుతుంటే అన్ని రాజకీయ పార్టీల సమన్వయంతో కోదండరాం ఆధ్వర్యంలో ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పడి జయశంకర్ సార్ సిద్ధాంతం వెలుగులో పిలుపు ద్వారా, వివిధ దశల ద్వారా ఉద్యమాన్ని శిఖరాగ్ర స్థాయికి తీసుకుపోయారు. ఇది ఎవరూ కాదన లేని సత్యం. మరోవైపు విద్యాసాగర్ రావు తెలంగాణలో నీటి కేటాయింపులపై అన్యాయాలను ఎలుగెత్తి చాటడం తెలంగాణ ఉద్యమానికి నైతి కంగా సరికొత్త జీవగంజి లాంటి బలాన్ని చేకూర్చింది.
దరిమిలా, కేసీఆర్ ఖమ్మం జైల్లో అమరణ నిరాదీక్ష చేస్తున్నప్పుడు ఆరోగ్య కారణాలను చూపి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అంతకు ముందు తెలంగాణ ఉద్యమ సహచరుడు డాక్టర్ గోపీనాథ్ కేసీఆర్‌ను చూడడానికి పోతే ‘మా ఫ్యామిలీ డాక్టర్ నిమ్స్‌కు తరలించాలని చెప్పాడని’ హైదరాబాద్ నిమ్స్ దవాఖానకు తనను తరలించాలని భీష్మించుకు కూర్చున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి, హైదరాబాద్ నిమ్స్‌కు కేసీఆర్‌ను తరలింపచేసారు. ఇక, అప్పుడు తెలంగాణ ఉద్య మం ఎవరూ ఊహించని స్థాయిలో రగులుకున్నది. అయితే, ఈ మంటలకు ముఖ్య రాజకీయ నాయకులు చలికాచుకున్నారు.
తేల్చుకోవాల్సిన ప్రశ్న
ఇదంతా జరిగిపోయిన ముఖ్య సంఘటనల నేపథ్యం. తెలంగాణ ఉద్యమం కోల్డ్ బ్లడెడ్ మూవ్‌మెంట్‌గా మారితే దీన్ని కేసీఆర్ సారధ్యంలో తన వందిమాగదులతో అహింసా మార్గంలో తెలంగాణ సాధన జరిగిందని చిలువలు పలువలుగా ప్రచారం చేసుకున్నారు.
తెలంగాణ జాతిపిత కొత్తపల్లి జయశంకరా? లేక కేసీఆరా? కాక, ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచి, ఆత్మహత్యలకు పురిగొలిపిన హరీష్‌రావా? వీరు ఎవరూ కాక, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను తృణప్రాయంగా బలి పెట్టిన వందలాది మంది యువకులా? అన్న కోణంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ కోసం అంతా తెలంగాణమై ప్రజా సమూహాలలో పని చేస్తున్న మేధావి వర్గం, కవులు, రచయితలు, పాత్రికేయుల ముందు ఆశ్చర్యంగా ‘తెలంగాణ జాతిపిత ఎవరు?’ అనే మిలియన్ డాలర్ల ప్రశ్న తేల్చాల్సిన అంశంగా మిగిలిపోయే ఉంది. 21వ శతాబ్దం ప్రథమార్ధంలో యావత్ ప్రపంచం బహుముఖాలుగా చీలిపోతున్న వేళ, మనిషి పాయలు పాయలుగా విడిపోతున్న సందర్భంలో కేవలం ఏకశిలా సదృశ్యంగా, వినియోగ వస్తువుగా మారిపోతున్న దశలో ‘జాతిపిత’ అంటూ ఒకరు ఉండే అవకాశం ఉంటుందా? లేక బహుళంగా ఉంటారా? విజ్ఞులు నిర్ధారించాల్సిన సమయం ఆసన్నమైంది. తద్వారా ‘ఇల్లు కాలితే బీడీ ముట్టించుకునే’ రాజకీయ నాయకుల చవుకబారు ప్రచారాలకు ముకుతాడు వేయవల సిన అవసరం కూడా ఎంతైనా ఉన్నది.
వ్యాసకర్త తెరవే పూర్వాధ్యక్షుడు