న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీకి ఢిల్లీ ప్రజలు షాకిచ్చి.. కాషాయ పార్టీకి పట్టం కట్టారు. దీంతో 27ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని చేపట్టబోతుంది. ఈ క్రమంలో సీఎం కుర్చీ ఎవరిని వరిస్తుందనే చర్చ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొదలవడంతో పలువురి పేర్లు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి.
ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ ఈ రేసులో ముందజలో ఉన్నారు. పైగా బీజేపీ గెలుపు తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన కలవడంతో సీఎం అయ్యే అవకాశాలు ఆయనకు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరీ స్వరాజ్ సైతం ఢిల్లీ సీఎం రేసులో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
బన్సూరీ గతేడాదే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం ఆమె న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నిలకు కొన్ని నెల ల ముందు ఆప్‌ను వీడి బీజేపీ తరఫున బిజ్వాసన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన కైలాశ్ గెహ్లాట్ సీఎం పదవిని ఆశిస్తున్నారు.
వీరితోపాటు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్, పార్టీ జాతీయ కార్యదర్శి దుశ్యంత్ గౌతమ్, ఎంపీ మనోజ్ తివారీ, సీనియర్ నేతలు కపిల్ మిశ్రా, అర్వింద్ సింగ్ లవ్లీ కూడా సీఎం రేసులో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఢిల్లీ సీఎం అతిశీపై పోటీ చేసి పరాజయం పాలైన రమేశ్ బిధూరి సైతం సీఎం పదవిని ఆశిస్తున్నట్టు తెలుస్తుంది.
అయితే ఎప్పటిలాగే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బరిలోకి దిగిన బీజేపీ.. సీఎం రేసులో ఉన్నవారి పేర్లను పరిగణలోకి తీసుకుని వారిలో ఒకరిని ఎంపిక చేస్తుందా లేక అనూహ్యంగా మరో వ్యక్తికి సీఎం పదవిని కట్టబెడుతుందా అనేది వేచి చూడాల్సిందే.