calender_icon.png 26 October, 2024 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమలదళం సారథి ఎవరు?

28-08-2024 12:58:33 AM

ఈటల, రాంచందర్‌రావు పోటాపోటీ

అధిష్ఠానం నిర్లిప్తతపై రాష్ట్ర బీజేపీలో తీవ్ర చర్చ

8 ఎంపీ సీట్లు గెలిచినా కనిపించని జోష్

సర్కారు వైఫల్యాలపై పోరులో వెనుకంజ

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీకి కాబోయే అధ్యక్షుడంటూ ఇన్నాళ్లుగా పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన పేరు ప్రకటించడమే తరువాయి అని, ఆగస్టు నెలాఖరుకు నియామకం పూర్తవుతుందని పార్టీ నేతలు అనధికారికంగా చెప్తూ వస్తున్నారు. అయితే, ఆగస్టు చివరికి వచ్చినా అధిష్ఠానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఈటల పేరు ఖరారు అంటున్నా.. ఆయనకు పదవి దక్కకుండా ఏవో అంశాలు ప్రభావితం చూపిస్తున్నాయని పార్టీలోని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావుకు కూడా అధ్యక్షుడయ్యే అవకాశాలున్నాయనే చర్చ మొదలైంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సైతం అధిష్ఠానం దృష్టిలో ఉన్నారనే మాటా వినిపిస్తోంది. వీరిలో ఈటలకే ఎక్కువ అవకాశా లున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మూడు నెలలు గడిచినా ఇంకా కొత్త అధ్యక్షుడెవరో తేలని పరిస్థితి నెలకొంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచినా.. రాష్ట్ర ప్రభుత్వ వైఫ ల్యాలపై పోరాటంలో బీజేపీ వెనకబడిందనే చెప్పవచ్చు. ఒక్క సీటూ గెలవలేకపోయినా బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ దూసుకుపోతుంటే బీజేపీ ఢీలా పడటం చూస్తే పార్టీకి రాష్ట్ర సారథి లేని లోటు స్పష్టంగా కనిపిస్తున్నది.

ఈటలకు అడ్డంకిగా సోషల్ ఇంజినీరింగ్

ఈటల రాజేందర్ ముందు నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహ రించారు. బీఆర్‌ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. సోషల్ ఇంజినీరింగ్ ఆయన పొలిటికల్ కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో సహకరించింది. కారు దిగి బీజేపీలో చేరిన ఈటలకు పార్టీ నుంచి మంచి సహకారం లభించింది. హుజూరాబాద్ నుంచి ఉప ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచినా.. 2023 ఎన్నికల్లో అక్కడే ఓటమి పాలైనా ఈటలకు బీజేపీ అండగా నిలిచింది. జాతీయ నేత మురళీధర్‌రావు లాంటి వారి నుంచి గట్టి పోటీ ఉన్నా మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం రాజేందర్‌కు లభించింది.

ఎంపీగా గెలిచి ఆయన సత్తా చాటారు. అదే సమయంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా పదవులు చేపట్టడంతో ఎంతో అనుభవమున్న ఈటలకే బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారనే చర్చ జరిగింది. అయితే హిందుత్వ, ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్ గ్రౌండ్ లేకపోవడం మైనస్ అవుతోందని విశ్వసనీయ సమాచారం. అధ్యక్ష ఎన్నిక విషయంలో ఆర్‌ఎస్‌ఎస్ నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

తలలో నాలుకలా రాంచందర్ రావు 

మాజీ ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ నేత రాంచందర్‌రావు సైతం బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నాడని పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈటలకు అధ్యక్ష పదవి ఖాయమంటూ ప్రచారం సాగినా.. ఇప్పుడు రాంచందర్‌రావు పేరు సైతం తెరపైకి వచ్చింది. మొదటి నుంచి పార్టీలో ఉండటంతోపాటు అందరికి తలలో నాలుకలా ఉండే రాంచందర్ రావు అధ్యక్షుడు అయితే రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలు ఏమాత్రం వ్యతిరేకించరనే చర్చ జరుగుతోంది.

ఈ మేరకు ఆయన కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని పలువరు నేతలు అంటున్నారు. బయటి నుంచి వచ్చిన ఈటలకన్నా మొదటి నుంచి పార్టీలోనే ఉన్న రాంచందర్‌రావు అయితే బాగుంటుందని కొందరు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. మరోవైపు ఆదిలాబాద్ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ సైతం అధ్యక్ష బరిలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ కొత్త దళపతి ఎవరనేది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతూనే ఉంది. 

అధ్యక్షుడి ఎంపికలో వెనుకంజ ఎందుకు?

ఎనిమిది ఎంపీ సీట్లను కేంద్రానికి కానుకగా ఇచ్చినా.. ఇంతవరకు బీజేపీ అధ్యక్షుడి నియామకంలో అధిష్ఠానం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పార్టీ నేతలు, కార్యకర్తలు మధ నపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బాగా ఎగిసిపడుతున్న సమయంలో అధిష్ఠానం కనీసం అధ్యక్షుడిని నియమించకపోవడం వల్ల పార్టీకే నష్టమని చెప్తున్నారు. ఒక్క ఎంపీ సీటు లేకపోయినా బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వంపై పోరులో బీజేపీ కన్నా ఎంతో ముందుందని, నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో దూసుకుపోతోందని బీజేపీలోని కొందరు నేతలు అంటున్నారు.

పార్టీని ముందుండి నడిపించే రాష్ట్ర అధ్యక్షుడు లేకనే ప్రభుత్వ వైఫల్యాలపై పోరులో బీజేపీ నిర్లిప్తంగా కనిపిస్తోందని చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీకి అంతా అనుకూలంగా ఉన్న సమయంలోనూ అధ్యక్షుడిని నియమించేందుకు ఎందుకు వెనుకంజ వేస్తున్నా రని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎవరినో ఒకరిని నియమిస్తే ఆయన నేతృత్వంలో పార్టీ కార్యక్రమాలు ఊపందుకుం టాయని అంటున్నారు.