26-04-2025 12:00:00 AM
ఎలాంటి అనుమతులు లేకుండా తరలించిన వారిపై చర్యలేవి?
భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్25 (విజయ క్రాంతి) పుష్ప సినిమాను తలపిస్తున్న బూడిద అక్రమ తరలింపు వ్యవహారంలో బాధ్యులెవరు అనే ప్రశ్న సర్వత్రా చర్చనీ అంశమైంది. ఇప్పటివరకు ల్యాండ్ మాఫియా సాండ్ మాఫియా అనే పదాలనే విన్నాము. తాజాగా యష్ మాఫియా తెరపైకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ 5,6 ,7 దశల యాష్ పాండు నుంచి ఈనెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జె నుకో, కేటీపీఎస్ అధికారుల అనుమతులు లేకుండా రోజుకు సుమారు రూ 6 లక్షల విలువ గల బాటమ్ యాష్, పాండ్ యాస్, ఫ్లై యాష్ అక్రమంగా తరలించారు.
ఈ అక్రమ తరలింపుకు బాధ్యులెవరు. ఇప్పటికే బూడిద తనలింపు వివాదం కొనసాగుతోంది. ఒకవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు ఐటీడీఏ పీవో సిఫారసులను తుంగలో తొక్కి జెన్కో అధికారులు పిటీషనరులైన ముగ్గురు వ్యక్తులకు నిబంధనలకు విరుద్ధంగా యాస్ తరలింపు ఆదేశాలు జారీ చేయటమే వివాదమైంది. ఆ ముగ్గురి వ్యక్తులకు యాస్ తరలింపు మార్చి 31 తో ముగిసింది.
అయినప్పటికీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఎలాంటి అనుమతులు, అధికారులకు తెలియకుండా రోజుకు రూ 6 లక్షల విలువ గల బూడిదను అక్రమంగా తరలించారు. అంటే సుమారు రూ 60 లక్షల విలువగల బూడిద అక్రమార్కుల పాలయింది. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు, జెన్కో సొమ్ము అక్రమార్కుల పాలైంది.
రాష్ట్ర ప్రభుత్వం అక్రమార్కులపై, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్రమంగా తరలించిన రూ 60 లక్షల విలువగల యాష్ సొమ్మును రికవరీ చేయాలని, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బూడెద చెరువుల ప్రభావిత ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా లారీల కొద్దీ బూడిదను తరలిస్తుంటే కేటీపీఎస్ అధికారులు చోద్యం చూడటంలో అంతర్యం ఏమిటో వారికే తెలియాలి.
అక్రమ తరలింపు పై, ప్రభావిత ప్రాంతాల గిరిజన సంఘాలు తాజాగా కోర్టును ఆశ్రయించారు. అక్రమంగా బోడిదను తరలించిన క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ, బట్టు లక్ష్మణ్, గుగులోతు రాంబాబు లపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. జెన్కో సిఎండి పాల్వంచ యాష్ పాండ్ అక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.