calender_icon.png 11 January, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారెవ్వా నీరజ్

11-01-2025 12:00:00 AM

ప్రపంచ ఉత్తమ జావెలిన్ త్రోయర్‌గా గుర్తింపు

న్యూఢిల్లీ: భారత స్టార్ జావెలిన్ త్రోయర్, పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత నీరజ్ చోప్రా అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. ప్రఖ్యాత అమెరికన్ మ్యాగజైన్ ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ నీరజ్ చోప్రాను 2024కు గానూ పురుషుల విభాగంలో ప్రపంచ ఉత్తమ జావెలిన్ త్రోయర్‌గా ఎంపిక చేసింది.

కాలిఫోర్నియాకు ప్రధాన కేంద్రంగా నడుస్తోన్న ఈ అమెరికన్ మ్యాగజైన్‌లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అండర్సన్ పీటర్స్‌ను వెనక్కి నెట్టి నీరజ్ తొలి స్థానం ఆక్రమించినట్లు మ్యాగజైన్ నిర్వాహకులు వెల్లడించారు. పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్ ఐదో స్థానానికి పరిమితమయ్యాడు.

ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఫైనల్లో అర్షద్ బరిసెను 92.97 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు సాధించాడు. నీరజ్ 2024లో దోహా, లుసాన్నే, బ్రసెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్స్‌లో రెండో స్థానాలతో సరిపెట్టుకున్నాడు. ఒలింపిక్స్‌కు ముందు ఫిన్‌లాండ్ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో మాత్రం నీరజ్ విజేతగా నిలిచాడు.

ఇక ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరి కెరీర్ బెస్ట్ అందుకున్నప్పటికీ అర్షద్‌ను దాటడంలో విఫలమై రజతం సాధించాడు. తద్వారా వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన తొలి అథ్లెట్‌గా నీరజ్ చోప్రా రికార్డులకెక్కాడు. నీరజ్, అండర్సన్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ ఓటింగ్‌లో నీరజ్ 3-2 గ్రెనెడా అథ్లెట్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానం సాధించాడు.

1948లో స్థాపించిన ‘ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్’ మ్యాగజైన్ ప్రతీ ఏటా అథ్లెట్ల ప్రదర్శన ఆధారంగా ర్యాంకింగ్స్‌ను ప్రకటిస్తూ వస్తోంది. ఇక నీరజ్ చోప్రా త్వరలో భారత్‌లో జరగనున్న గ్లోబల్ జావెలిన్ త్రోలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు.