- ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరవుతారని సర్వత్రా ఉత్కంఠ
- ముఖ్యమంత్రి రేసులో ఆప్‌లోని కీలక నేతల పేర్లు
- అతిశీ, సౌరభ్, సునీతకు ఎక్కువ అవకాశం
- కైలాశ్ గహ్లోత్, గోపాల్‌రాయ్‌కు సైతం చాన్స్?
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: సుప్రీంకోర్టు బెయి ల్ మంజూరు చేయడంతో విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన చేసి అందరినీ షాక్‌కు గురిచేశారు. ప్రకటన సందర్భంగా మూడ్రోజుల్లో పార్టీ సమావేశం నిర్వహించి కొత్త సీఎంపై నిర్ణయం తీసుకుంటామని చెబుతూనే ఢిల్లీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
దీన్ని బట్టి చూస్తే కేజ్రీవాల్ ముందస్తు ఎన్నికలకు వెళతారా? లేదా మరొకరికి బాధ్యతలు అప్పగిస్తా రా? అనేది చర్చనీయాంశమైంది. తన స్థానం లో మరొకరికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గా ల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే ఆప్ శాసనసభాపక్ష సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం రేసులో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అతిశీ మర్లెనా
ఢిల్లీ విద్యాశాఖతో పాటు మరో ఐదు శాఖలకు మంత్రిగా ఉన్న అతిశీ.. 2020 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మనీశ్ సిసోడియా వంటి నేతలతో సన్నిహితంగా పనిచేశారు. కేజ్రీవాల్ అరెస్టు నాటి నుంచి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ అన్ని అంశాల్లో ముందుంటున్నారు. పంద్రాగస్టుకు సైతం తనకు బదులుగా జాతీయ జెండావిష్కరణకు అతిశీ పేరునే కేజ్రీవాల్ ప్రతిపాదిం చారు. ఈ అంశాలను గమనిస్తే ఆమె అభ్యర్థిత్వాన్ని మరింత బలపరుస్తున్నాయి.
సౌరభ్ భరద్వాజ్
సీఎం రేసులో మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఉన్నారు. వైద్యారోగ్యంతో పాటు ఏడు శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఆప్‌లో కీలక నేతల్లో ఆయననొకరు. కేజ్రీవాల్‌కు సన్నిహిత మిత్రుడు. కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పుడు సౌరభ్ కూడా చురుకుగా వ్యవహరించారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొని తన ఉనికి చాటుకున్నారు. దీంతో సౌరభ్‌కు కూడా అవకాశాలు ఉన్నాయి.
కైలాశ్ గహ్లోత్
కేజ్రీవాల్ ముఖ్య సహచరుల్లో మంత్రి కైలాశ్ గహ్లోత్ ఒకరు. ఢిల్లీ ప్రభుత్వం ఎనిమిది శాఖలను చూస్తున్నారు. పార్టీలోనూ కీలక బాధ్యతలను నెరవేర్చుకుంటూ వస్తున్నారు. పార్టీలో అగ్రనేతగానూ కొనసాగుతున్నారు. సీఎం రేసులో గహ్లోత్ సైతం గట్టి పోటీదారుగా ఉన్నారు.
గోపాల్‌రాయ్
మూడు శాఖలను నిర్వహిస్తున్న మరో మంత్రి గోపాల్‌రాయ్‌కు సీఎంగా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు. యూపీ రాజధాని లక్నోలో విద్యార్థి దశ నుంచే నేతగా ఎదిగిన గోపాల్‌రాయ్.. కాలేజీల్లో అవినీతి, నేరాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. ఓ ఆందోళనలో రాయ్‌కు బుల్లెట్ తగలడం వల్ల పాక్షిక పక్షపాతంతో బాధపడుతున్నారు. ఢిల్లీలో కనీస వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఘనత గోపాల్‌రాయ్‌కే చెందుతుంది.
సునీతా కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. కేజ్రీవాల్ అరెస్టు సమయంలో నిర్వహించిన కార్యక్రమాలకు ఆమెనే నాయకత్వం వహించారు. అరెస్టుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలను ఒకే వేదికపైకి తీసుకురాగలిగారు. బహిరంగ సభలు, మిత్రపక్షాలతో చర్చల్లో చురుగ్గా పాల్గొంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. సునీత సీఎం అయితే పార్టీతో పాటు ప్రభుత్వంపై మరింత పట్టు సాధించే అవకాశం ఉందని పలువురు నేతలు భావిస్తున్నారు. సునీతను సీఎంగా చేయాలనే కేజ్రీవాల్ భావిస్తున్నారని, అందుకే పార్టీ నేతలను ఒప్పించే విషయమై రాజీనామాకు రెండ్రోజులు సమయం తీసుకుంటున్నారని బీజేపీ, కాంగ్రెస్ సైతం విమర్శలు చేశాయి.