01-03-2025 12:44:06 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): గత ఆర్నెళ్లుగా ఊరిస్తూ వస్తున్న బీజేపీ తెలంగాణ కొత్త అధ్యక్ష పదవిని త్వరలో భర్తీ చేయనున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి. కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి ఆయ్యాక పార్టీ అధ్యక్ష స్థానం తనకు భారంగా మారిందని..రెండు పదవులు నిర్వహించడం కష్టమవుతోందని బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
కిషన్‌రెడ్డి గతేడాది జూలై 7న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశా రు. దాదాపు 7 నెలలు గడుస్తున్నా పార్టీ అధ్యక్ష పదవిని అధిష్ఠానం భర్తీ చేయలేదు. పార్టీ ముఖ్యులు కొందరు త్వరలో కొత్త అధ్యక్షున్ని నియమిస్తున్నామంటూ మీడియాకు లీకులు ఇవ్వడమే గానీ కొత్త నేత ఎవరో తేల్చలేదు.
ఈ నేపథ్యంలోనే పార్టీ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా ఉన్న కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఈ వారంలోనే హైదరాబాద్ రానున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. ఆమె వస్తే అధ్యక్ష ఎన్నిక పూర్తి చేసే వెళ్తారని కూడా ఆ వర్గాలు వివరించాయి. ఎన్నికల ఇన్‌చార్జ్ వచ్చి ఎన్నికల నామినేషన్ పత్రాలపై సంతకాలు తీసుకుంటే కాబోయే అధ్యక్షుడె వరో తేలిపోతుందని అంటున్నారు.
అందుకే ఆ అదృష్టవంతుడెవరో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మార్చి 15 వరకు జాతీయ అధ్యక్షుడి ప్రకటన చేయనున్నారని, అంతకుముందే మొదటి వారంలో తెలంగాణ అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి.
ఆశావహుల లిస్టు పెద్దదే..
పార్టీకి రాష్ట్రంలో మంచి ఊపు ఉండటంతో అధ్యక్ష పదవికి డిమాండ్ ఏర్పడింది. ఎవరికిస్తారనే అంశంపై ఎవరి అంచనాల్లో వారున్నారు. ఇప్పటికే పార్టీ పదవుల్లో అగ్రభాగం అగ్రవర్ణాలకే దక్కినందున అధ్యక్ష పదవి బీసీకి ఇస్తారనే చర్చ జరుగుతోంది. అయితే బీజేపీలో ఇలాంటివాటిని పట్టించుకోరని బాగా పనిచేస్తారని అనుకున్నప్పుడు ఎవరికైనా పదవి దక్కే అవకాశాలున్నాయని కూడా కొందరంటున్నారు.
రాష్ర్ట అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని తెలుస్తోంది. ప్రముఖంగా ఇప్పటివరకు నాలుగైదు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆశావహులు తమ తమ స్థాయి లో అధిస్ఠానం వద్ద లాబీయింగ్ ప్రారంభించారు. రాష్ర్ట పగ్గాలు తమకే దక్కుతాయని గంపెడాశలు పెట్టుకున్నారు. ఆశావహుల్లో ఈటల రాజేందర్, డీకే అరుణ, రాంచందర్‌రావు, ధర్మపురి అర్విం ద్, రఘునందన్ రావు, మురళీధర్‌రావు పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వీరితో పాటు బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. బీసీ నేత కావటంతో పాటు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై దండెత్తేందుకు కూడా అవకాశం ఉండటం ఆయనకు కలిసి రావొచ్చని అంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు సైతం బీజేపీ అధ్యక్ష బరిలో గట్టి పోటీదారుగా ఉన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ వర్సెస్ నాన్ ఆర్‌ఎస్‌ఎస్ వర్గాల మధ్య అధ్యక్ష పదవి కోసం అంతర్గతంగా కుమ్ములాటలు నడుస్తున్నట్టు సమాచారం. అందుకే ఇన్నాళ్లుగా అధ్యక్ష పదవిని ఎవరికివ్వాలో అధిష్ఠా నం తేల్చలేకపోయిందని అంటున్నారు.