calender_icon.png 24 December, 2024 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమల దళపతి ఎవరు?

02-11-2024 01:36:17 AM

  1. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై సర్వత్రా ఉత్కంఠ
  2. సంస్థాగత ఎన్నికలపై బీజేపీ దృష్టి
  3. జనవరి నాటికి పూర్తి 
  4. జాతీయ రిటర్నింగ్ అధికారిగా ఎంపీ డా.కే లక్ష్మణ్
  5. తెలంగాణలో సంస్థాగత ఎన్నికల అధికారిగా యెండల

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): త్వరలో బీజేపీలో సంస్థాగత ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 2వ తేదీన ప్రారంభమైన బీజేపీ సభ్యత్వ నమోదు గత నెల 28వ తేదీన ముగిసింది. దీంతో సంస్థాగత ఎన్నికలకు ఆ పార్టీ నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు.

బూత్ స్థాయి నుంచి జాతీ య అధ్యక్ష పదవి వరకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. వచ్చే జనవరి నెలలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగేలా అప్పటిలోపు బూత్, జిల్లా, రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలను పూర్తి చేసేలా పార్టీ అధిష్ఠానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

అయితే పార్టీకి ఎంతో కీలకమైన సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు డా.కే లక్ష్మణ్‌కు పార్టీ అధిష్ఠానం అప్పగించింది. ఇక రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల అధికారిగా పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియపై కసరత్తు చేపట్టారు.

తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న జి.కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తనకు టీ బీజేపీ చీఫ్ పదవి భారంగా ఉందని స్పష్టం చేశారు. కొత్త అధ్యక్షుడిని నియమించే వరకు ఆయన పదవిలో కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కూడా పనిచేశారు.

జాతీయస్థాయిలోనే ఆయన ఎంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీజేఎల్పీ నేతగా ఓసీ సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్న తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కచ్చితంగా బీసీలకే అప్పగిస్తారనే చర్చ నడుస్తోంది.

అందుకే ఈ పదవి కోసం ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు సైతం తాను కూడా రాష్ట్ర అధ్యక్ష బరిలో ఉన్నానని చెబుతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే అంశం అందరిలో ఉత్కంఠ రేపుతుంటే... పార్టీ అధిష్ఠానం మాత్రం రాష్ట్రంలో ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందనే అంశంపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే నేతనే అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ శ్రేణులు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. 

పార్టీ పదవులకు భారీ డిమాండ్..

అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలుచుకుని సత్తా చాటిన బీజేపీలో ఇప్పుడు పార్టీ పదవులకు ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సత్తా చాటుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో పార్టీ పదవుల కోసం నేతలు పోటీ పడుతున్నారు. జిల్లాల అధ్యక్షులుగా చేరి పార్టీలో తమ ఉనికి చాటుకునేందుకు చాలా మంది నేతలు ప్రయత్నిస్తున్నారు. అందుకే స్థానికంగా కీలకంగా ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పదవులను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కమలంలో కీలకంగా డా. కే లక్ష్మణ్..

జాతీయ సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు తెలంగాణకు చెందిన ఎంపీ డా. కే లక్ష్మణ్... ఇటీవలే రిటర్నింగ్ అధికారిగా నియమితులయ్యారు. పార్టీ లో ఇప్పటికే ఓబీసీ జాతీయ అధ్యక్షుడిగా కీలకంగా ఉన్న ఆయనకు పార్టీ మరో కీలకమైన బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన సంస్థాగత ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు, దిశానిర్దేశం చేసేందుకు అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు.   

డిసెంబర్ చివరి నాటికి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక

ఈ నెల 16 నుంచి 30 వరకు బూత్ కమిటీ నియామకాలను పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు పార్టీ నేతలు తెలిపారు. బూత్ కమిటీల ఎంపిక పూర్తయ్యాక ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో అధిష్ఠానం భేటీ అయి మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.

సంస్థాగత ఎన్నికల ప్రక్రి యలో భాగంగా నవంబర్ 21న జాతీయ, 27న రాష్ట్ర స్థాయి, డిసెంబర్ 20న జిల్లా స్థాయి కార్యశాలలను నిర్వహించనున్నట్లు సమాచారం. మండ ల, జిల్లా స్థాయి కమిటీలు పూర్తి అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుం ది. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రాల అధ్యక్షుల నియామకం పూర్తవుతుంది. ఆ తర్వాత జనవరిలో జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఉండనుంది.