- నేడు భారత్, జింబాబ్వే మూడో టీ20
- జట్టుతో కలిసిన జైస్వాల్, సంజూ, దూబే
హరారే: జింబాబ్వేతో రెండో టీ20లో భారీ విజయంతో జోష్ మీదున్న టీమిండియా నేడు మూడో మ్యాచ్ ఆడనుంది. హరారే వేదికగా జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలో నిలవాలని యువ భారత్ ఉవ్విళ్లూరుతోంది. యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబేల రాకతో జట్టు మరింత పటిష్టంగా తయారైంది. టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో ఈ ముగ్గురు సభ్యులుగా ఉన్న సంగతి తెలిసిందే. స్వదేశంలో సంబురాలు ముగిసిన అనంతరం జట్టుతో కలిశారు. అయితే ప్రపంచకప్‌లో దూబే మినహా మిగతా ఇద్దరికి తుదిజట్టులో ఆడే అవకాశం రాలేదు. మూడో టీ20లో ఈ ముగ్గురు తుది జట్టులో ఉండడం ఖాయమే. దూబే, శాంసన్‌లు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు రానుండగా సమస్యంతా యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ స్థానంపైనే.
జైస్వాల్ ఏ స్థానంలో?
టీ20ల్లో జైస్వాల్‌కు ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. 17 టీ20ల్లో 161కి పైగా స్ట్రుక్‌రేట్‌తో పరుగులు చేశాడు. దీంతో కెప్టెన్ గిల్ తనకు జోడీగా జైస్వాల్ వైపు మొగ్గుచూపే అవకాశముంది. దీంతో రెండో టీ20లో ఓపెనర్‌గా వచ్చి సెంచరీతో దుమ్మురేపిన అభిషేక్ శర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే చాన్స్ ఉంది. ఓపెనింగ్‌లో మార్పు వద్దనుకుంటే జైస్వాల్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చే చాన్స్ ఉంది. మిడిలార్డర్‌లో శాంసన్, దూబేలు ఎంట్రీ ఇవ్వనుండడంతో పరాగ్, జురేల్‌లు బెంచ్‌కు పరిమితం కానున్నారు. రుతురాజ్ నాలుగో స్థానంలో, దూబే ఐదో స్థానంలో, శాంసన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రవచ్చు. మొత్తానికి బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో స్పిన్నర్లు రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్‌లు కీలకం కానున్నారు.
ముఖ్యంగా బిష్ణోయి తన గూగ్లీలతో అదరగొడుతున్నాడు. ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్‌లతో పేస్ భారం మోస్తున్నారు. మరోవైపు తొలి టీ20లో విజయం సాధించిన జింబాబ్వే జట్టు రెండో టీ20లో వంద పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. బలహీనమైన బౌలింగ్‌ను ఆసరగా చేసుకొని రెండో టీ20లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. తాజాగా జైస్వాల్, సంజూ, దూబే రాకతో జింబాబ్వేకు మరింత ఇబ్బంది ఎదురయ్యేలా ఉంది. కెప్టెన్ సికందర్ రజా అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. బ్యాటింగ్‌లో రజాతో పాటు బ్రియాన్ బెన్నెట్, వెస్లే మదెవెరె, ఇన్నోసెంట్ కాయాలు కీలకం కానున్నారు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.