calender_icon.png 15 November, 2024 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో పైచేయి ఎవరిది?

04-08-2024 03:50:42 AM

  1. అధికార పక్షానిదా? ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌దా? 
  2. వాడీవేడిగా జరిగిన శాసనసభ సమావేశాలు 
  3. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం 
  4. ప్రజా సమస్యల కన్నా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం 
  5. చివరిరోజు కొట్టుకునే స్థాయికి వెళ్లిన పరిస్థితి 
  6. బడ్జెట్ సహా పలు బిల్లులకు ఆమోదం
  7. ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా మల్చుకున్న సర్కార్ 
  8. తొమ్మిది రోజుల్లో కేసీఆర్ ఒక్క రోజే హాజరు

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాలు తొమ్మిది రోజుల పాటు వాడీవేడిగా జరిగాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యుల మధ్య కొన్ని అంశాలపై మాటల తూటాలు కూడా పెలాయి. సభలో నిరసనలు, మార్షల్స్ రంగప్రవేశం, వాకౌట్‌లు, అసెంబ్లీ ఆవరణలో ప్రతిపక్ష సభ్యుల అరెస్టు, స్పీకర్ పోడియం దగ్గర ధర్నా, నేలపై కూర్చొని నిరసన, సీఎం రేవంత్‌రెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘనకు బీఆర్‌ఎస్ పట్టు.. ఇలా అనేక పరిణామాలతో అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అన్నట్లుగా సభ సాగింది.

అయితే అసెంబ్లీలో అధికార పక్షం పైచేయి సాధించిందా? ఇన్నాళ్లు పట్టు విడుపులతో నడిచిన సభ క్రమంగా ఏకపక్షం అవుతోందా? అధికార పక్షం విపక్షాన్ని డామినేట్ చేసిందా? అందులో కీలక పాత్ర ఎవరిదనేది రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతోంది. అయితే 9 రోజులుగా జరిగిన శాసనసభకు ప్రధాన ప్రతిపక్షనేత, మాజీ సీఎం కేసీఆర్ ఒక్క రోజే సభకు వచ్చారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సభకు హాజరై ప్రసంగం పూర్తి కాకముందే బయటికి వెళ్లిపోయారు. కేసీఆర్ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని చేసిన వ్యాఖ్యలు హాట్‌హాట్‌గా మారాయి. దీనికి కౌంటర్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాన ప్రతిపక్షనేత చీల్చి చెండాడుతానంటే నేను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చానని, కానీ సభకు రాకుండా కేసీఆర్ ఎక్కడికి వెళ్లారని సైటైర్ వేశారు.

విపక్షానికి సమయమిచ్చాం.. 

గత ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు ఎమ్మెల్యేలకు సభలో ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇచ్చామని అధికార కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. తమకు సభలో మాట్లాడే అవకాశం రాలేదని, ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కారని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. అయితే 9 రోజులుగా జరిగిన సభలో మాత్రం ప్రజాసమస్యల కంటే ఎక్కువగా రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చారనే టాక్ కూడా ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. అయినా గత అసెంబ్లీ సమావేశాలతో బేరీజు వేసుకుంటే అధికార పక్షం ఈ సారి కొంత పట్టు సాధించినట్లుగా కనిపిస్తోంది. 

సీఎం రేవంత్‌రెడ్డి వర్సెస్ సబితా ఇంద్రారెడ్డి 

శాసనసభలో ప్రధానంగా రెండు రోజుల పాటు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం వర్సెస్ సబితా ఇంద్రారెడ్డి మధ్య మాటల వివాదం నడిచింది. సబిత అంశాన్ని అజెండాగా మార్చుకోవాలని బీఆర్‌ఎస్ ప్లాన్ చేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం, సభ బయట కూడా పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. అదే సమయంలో అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో ఆ అంశాన్ని అస్త్రంగా మార్చుకున్నది. వర్గీకరణకు తెంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లను వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేయడంతో సభలో చర్చకు పెట్టారు. దీంతో సభలో సభ్యులందరు ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడాల్సి రావడంతో సీఎం రేవంత్‌రెడ్డి, సబితా మధ్య చెలరేగిన వివాదం పక్కనపెట్టాల్సి వచ్చింది. ఆదే సమయంలో ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ బిల్లును అధికార పక్షం ఆమోదించింది. 

దళిత స్పీకర్ ఉన్నందుకే కేసీఆర్ రాలే: సీఎం 

దళిత వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌కుమార్ స్పీకర్‌గా ఉన్నందుకే.. అధ్యక్షా అనడానికి అహం అడ్డు వస్తుందనే కేసీఆర్ సభకు రావడం లేదా? అని రేవంత్ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా బీఆర్‌ఎస్ నేతలు వ్యవహారిస్తున్నారని, మంత్రి సీతక్కపై అవమానకరంగా మీమ్స్ పెడుతున్నారని ఆరోపించారు. మైక్ ఇస్తే శాపనార్థాలు.. ఇవ్వకపోతే పోడియం ముందు ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. దొర చేతిలో మా అక్కలు చిక్కుకున్నారని సీఎం వ్యాఖ్యానించారు. 

దానం వర్సెస్ బీఆర్‌ఎస్.. 

అసెంబ్లీ సమావేశాలు ముగింపు రోజున అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య శాసనసభలో కొట్టుకునే పరిస్థితి నెలకొన్నది. హైడ్రా అంశంపై సభలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చారు. దానం మాట్లాడుతుండగా, అప్పటికే స్పీకర్ పోడియం వద్ద ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి తదితరులు దానం నాగేందర్‌పై కామెంట్స్ చేశారు. ‘నీవు ఏ పార్టీ ఎమ్మెల్యేవో చెప్పాలి.. బీఆర్‌ఎస్‌ను మోసం చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లావు’ అంటూ దానం ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సహనం కోల్పోయిన దానం ‘మీరు ఇలానే ప్రవర్తిస్తే హైదరాబాద్‌లో తిరగనీయ బిడ్డల్లారా. తోలు తీస్తా. నాటకాలు ఆడుతున్నారా?’ అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తక్షణమే స్పందించి దానం చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘గతంలో తానెప్పుడు నోరు జారలేదు. వాళ్లే నన్ను దూషించారు. చీఫ్ మినిస్టర్‌ను చీప్ మినిస్టర్ అన్నది కేటీఆర్. అయినా నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నా’ అని అక్బర్ డిమాండ్‌కు దానం స్పందించారు.

ఏ ముఖం పెట్టుకుని సీఎంను అంటున్నారు: డిప్యూటీ సీఎం భట్టి 

‘పార్టీ పదవులు అనుభవించి స్వలాభం కోసం బీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. ఏ ముఖంతో సీఎం గురించి మాట్లాడుతున్నారు’ అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్ అయ్యారు. దళిత వర్గాలకు చెందిన నన్ను ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్  నిర్ణయిస్తే నాకు సపోర్టుగా ఉండకుండా వారి స్వలాభం కోసం పార్టీ మారి కాంగ్రెస్‌కు మోసం చేశారని మండిపడ్డారు. పార్టీలు మారి పరువు తీసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని ధ్వజమెత్తారు.  

5 కొత్త బిల్లులు, తీర్మానాలు

అసెంబ్లీ, శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం ఐదు కొత్త బిల్లులను ప్రవేశపెట్టడం, వాటిపై చర్చల అనంతరం ఉభయ సభల్లో ఆ బిల్లులు ఆమోదం పొందాయి. బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లులకు చర్చతో పాటు ఆమోదం లభించింది. అసెంబ్లీ మొత్తం తొమ్మిది రోజుల్లో 65.33 గంటలు కొనసాగింది. జూలై 30 ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ జూలై 31 ఉదయం 3:15 గంటల వరకు ఏకంగా రికార్డు స్థాయిలో 17 గంటల పాటు సమావేశం నిర్వహించారు. అదే రోజు తిరిగి ఉదయం 10 గంటలకే సభను ప్రారంభించడం, ద్రవ్య వినిమయ బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదించారు. ఈ సమావేశాల్లో సభ్యులు అడిగిన మొత్తం 32 ప్రశ్నలకు అధికార పక్షం నుంచి సమాధానం లభించింది. అయితే సమయాభావం కారణంగా మంత్రుల నుంచి మరో 8 ప్రశ్నలకు సమాధానం రాకపోవడంతో వాటిని లిఖితపూర్వకంగా సభ్యులకు అందజేయనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. 

కేంద్ర నిధుల కోసం తీర్మానం 

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన వాటికి నిదులు ఇవ్వలేదని, తిరిగి రీ బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణకు నిధులు కేటాయించి న్యాయం చేయాలని శాసనసభ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి  ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుకు కూడా ఆమోదం లభించింది. ధరణి, హైడ్రాపై సభలో స్వల్పకాలిక చర్చతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్‌కు సంబంధించి సభలో స్టేట్‌మెంట్ ప్రవేశపెట్టగా, వీటిన్నింటిపైన బిజినెస్ జరిగినట్లు స్పీకర్ ప్రకటించారు. 

బీఆర్‌ఎస్ ఓటమికి ధరణి ఒక కారణం: అక్బరుద్దీన్

‘బీఆర్‌ఎస్ ఓటమికి ధరణి పోర్టల్ కూడా ఒక కారణం. ధరణి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.  ఇప్పటికైనా బీఆర్‌ఎస్ మిత్రులు ఈ విషయాన్ని గమనించాలి. వీలైనంత తొందరగా ధరణి పోర్టల్ మార్చాలి. ధరణిని సులువుగా వదిలేయద్దు’ అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

హరీశ్‌రావును  కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది: సీఎం 

‘కనీసం వార్డు మెంబర్‌గా లేని హరీశ్‌రావును కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఏమి చేయలేదనడం సరికాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం వల్లే మీ కుటుంబం పదవులను అనభవించింది’ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.  

సీఎం కాదు.. చీప్ మినిస్టర్: హరీశ్‌రావు 

‘రేవంత్‌రెడ్డి చీఫ్ మినిస్టర్‌గా కాకుండా చిల్లరగా మాట్లాడుతూ చీప్ మినిస్టర్‌గా వ్యవహారిస్తున్నారు. నాకు మంత్రి పదవి ఎవరి భిక్షతో రాలేదు. సోనియాగాంధీ కోరిక మేరకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరాం తప్ప పదవుల కోసం కాదు’ అని హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. 

పంచ్ పటాకా

బడ్జెట్ సమావేశంలో సభ్యులు ఒకరిపై ఒకరు పంచులు వేస్తూ సభలో నవ్వులు పండించారు. సర్కార్ ప్రవేశపెట్టే బిల్లులపై చలోక్తులు విసురుతూ ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిపారు.  

సీఎం రేవంత్

* ఢిల్లీ దీక్షకు కేసీఆర్ తీసుకరండి. ..నిధులు తెచ్చుడో...సచ్చుడో  

* దొర కుట్రలో మా అక్కలు చిక్కుకున్నారు. వారికి మార్గనిర్దేశం చేయండి అధ్యక్షా

* చెడ్డవారి సావాసం వద్దక్కా... మంచోళ్ల సావాసం మంచిది

* దేవతలు యజ్ఞాలు చేస్తుంటే.. దెయ్యాలు భంగం కలిగిస్తాయి

* పదవుల కోసం చంద్రబాబు, వైఎస్‌ఆర్ పంచన చేరారు 

* చేసిన పాపం ఊరికే పోదు. అప్పుడు చేసిన పాపాలకు ఇప్పుడు జైలుకు పోతున్నారు

* బీఆర్‌ఎస్ సభ్యులది సత్య హరిశ్చంద్రుల వంశం

* పదేళ్లు పాలించిన మీరు.. పది నెలలు కూడా పూరి కాని కాంగ్రెస్ పాలనపై వందల విమర్శలా? 

* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు కేటీఆర్‌కు సంబంధం. కేటీఆర్ ఆర్టిఫియల్. ఆయనకు ఇంటెలిజెన్స్ జీరో 

* పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చినా బుద్ధి మారకపోతే ఎలా? (కేటీఆర్‌ను ఉద్దేశించి) 

డిప్యూటీ సీఎం భట్టి 

* పార్టీలు మారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు (సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి) 

కేసీఆర్ 

* బడ్జెట్ అంతా గ్యాస్. ..ట్రాష్ 

కేటీఆర్

* రాష్ట్రానికి బడ్జెట్‌లో కేంద్రం ఇచ్చింది గుండు సున్నా 

* హామీలు కొండంత.. బడ్జెట్ ఆవగిజంత 

* విభజన హామీలో ఏపీకి సై.. తెలంగాణకు నై

* భడేభాయి, ఛోటేభాయి ఏక్ హోగయా

మంత్రి శ్రీధర్‌బాబు

* నిరుద్యోగులకు నైపుణ్యాలుంటే పారిశ్రామికవేత్తగా పదిమందికి ఉపాధి 

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

* కొత్త భూచట్టం రూపకల్పన కోసం మంచి సూచనలు ఎవరిచ్చినా స్వీకరిస్తాం. చెట్టుకింద రైతు చెప్పినా వింటాం. గడి దాటని దొర చెప్పినా వింటాం 

కూనంనేని

* ఇది కేంద్ర బడ్జెట్ కాదు.. బీహార్, ఆంధ్ర బడ్జెట్ 

* ధరణి పోర్టల్ బీఆర్‌ఎస్ నాయకులను ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది 

* కేసీఆర్ అందరి సలహాలు తీసుకుని సోమేశ్‌కుమార్ సలహాను మాత్రమే పాటించారు

* అంత పెద్ద మేధావి కేసీఆర్ సోమేశ్‌కుమార్ మాయలో పడి దెబ్బతిన్నారు

ఎమ్మెల్సీ దేశపతి

* ఆరు గ్యారెంటీల అమలు నాలుక మీదనే నానుతుంది 

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు 

* ప్రజా పాలనకాదు.. ప్రజలను జోకొట్టే పాలన 

ఎమ్మెల్సీ మధుసూదన్

* నిరుద్యోగులను నిలువునా ముంచి అధికారం హస్తగతం 

ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి

* పంచాయతీలో పరువు కోసం అన్నదాతలకు హామీలు 

ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి 

* ప్రభుత్వ బడులు పాతర... ప్రైవేటు బడులు పచ్చగా 

అక్బరుద్దీన్ ఒవైసీ

* బీఆర్‌ఎస్ సభ్యులను ఎదుర్కొనే ధైర్యం ఉంటే వారికి మైక్ ఇవ్వండి. లేదంటే సస్పెండ్ చేయండి

ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

* పదేళ్లలో వారి పాలనలో రాష్ట్రం ధ్వంసమైపోయింది. దీనిపై మాట్లాడేందుకు బీఆర్‌ఎస్ సభ్యుల తీరు వల్ల మాకు మాట్లాడే అవకాశం దక్కలేదు

వెడ్మ బొజ్జు

* నక్సలైట్లు పేదలకు పంచిన భూములను కేసీఆర్ తిరిగి భూస్వాములకు కట్టబెట్టారు

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

* బీఆర్‌ఎస్ ప్రొప్రైటరీ పార్టీ. మాది డెమోక్రటిక్ పార్టీ 

ఎమ్మెల్సీ మధుసూధనాచారి

* ఎగవేత.. కోత.. దాటవేత.. ఇదీ కాంగ్రెస్ 

రాజగోపాల్‌రెడ్డి

* కారు ఎటుపాయే? సారు ఎటు పాయే? పదహారు సీట్లు ఎటుపాయే? 

ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి

* సంచులు మోసి జైలుకెళ్లిన వారిని సంచుల హరిశ్చంద్రుడు అనాలా?