calender_icon.png 6 February, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రియాశీల పాత్రలో పైచేయి ఎవరిది?

08-12-2024 12:00:00 AM

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగు తున్నాయి.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటే ప్రతి పక్షాలయిన బీఆర్‌ఎస్, బీజేపీలు ఏడాది కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై చార్జిషీట్‌లు విడుదల చేస్తూ విమర్శల బాణాలు ఎక్కుబెడుతున్నాయి. తెలంగాణ ప్రజల అభి వృద్ధే మా అజెండా అంటూ అన్ని పార్టీలు చెబుతున్నాయి.

అయితే  వ్యవహార శైలిలోనే తేడా ఉంది.  కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు తమదైన పంథాలో తెలంగాణ  రాజకీయాల్లో పదునైన మాట లు, వ్యూహాలతో పాటు ఒకరి మీద ఒకరు తీవ్ర నిందారోపణలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. మాది ప్రజాపాలన అంటూ అధికారపక్షం, మాది ప్రజాపక్షం అంటూ ప్రతిపక్షం పోతున్న పోకడలను ఆ పార్టీల కార్యకర్తలు, నేతలతో పాటు సామాన్య ప్రజలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు.

 రేవంత్ మార్క్ మార్పు

నేటి తెలంగాణ ముఖచిత్రంపై నలుగురు నాయకులు క్రియాశీలకంగా వ్యవ హరిస్తున్నారు. ఆ నలుగురే రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేటీఆర్, హారీష్ రావులు.ఈ దశాబ్ద కాలంలో రేవంత్ రెడ్డి ప్రస్తుత, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు,ఆయన జీవితంలో జరిగిన పరిణామాలు ప్రతిదీ ఆసక్తిదాయకం. కొన్ని సందర్భాలు స్ఫూర్తిదా యకం. ప్రస్తుతం దేశంలోని కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరిగా ఉంటూ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా వున్నారు.

ప్రజాపాలనలో ప్రథమ సంవత్సరం అంటూ విజయోత్సవ వేడుకలకు సిద్ధమవుతూ రేవంత్ మార్క్‌తో కూడిన మార్పు మొదలైందంటూ దూకుడుగా వెళుతున్నారు. ప్రభుత్వ వేదికలపై ముఖ్యమంత్రి హుందాతనంగా వుంటూనే, రాజకీయ వేదికలపై మాత్రం తనదైన శైలిలోనే ప్రసంగిస్తూ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తూ వినిపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కేసీఆర్, కేటీఆర్ వంటి వారిపై ఆయన వాడిన భాష కూడా చర్చనీయాంశం అవుతోంది.

ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ‘0’ బిల్లు, ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షకు పెంపు, ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాలతో పేద ప్రజలకు రేవంతన్నగా అండగా వున్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలపై ఆయన చూపిన చొరవ ప్రత్యేకం. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాల భర్తీతో పాటు డిఎస్సీ, గ్రూప్ పరీక్షల నిర్వహణ, పోస్టుల భర్తీ వంటి అంశాల్లో చాలా కీలకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ వన్ మ్యాన్ షో చూపిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మళ్ళీ వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే తన లక్ష్యమని కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలు,మూసీ, లగచర్ల ఘటనల విషయంలో వచ్చిన ప్రశంసలతో పాటు విమర్శలు రెండింటికీ దీటుగానే స్పందిస్తున్నారు. 

సమగ్ర కుటుంబ సర్వేతో బీసీల రాజ్యాధికారంతో నడుస్తున్న రాజకీయంలో వ్యూహాత్మకంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఉపముఖ్యమంత్రి హోదాలో భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు కూడా రేవంత్ మార్గంలోనే నడుస్తూ, ప్రస్తుతం రాజకీయ విమర్శలకు వెళ్లకుండా తమ పని తాము చేసుకుంటున్నారు.

ప్రతిపక్ష పాత్రకు న్యాయం

ఆరు గ్యారంటీల అమలు పేరుతో పేద ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని కాలయాపన చేస్తున్నారని, రైతు రుణమాఫీలో అందరికీ న్యాయం జరగలేదని బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంపై గట్టిగానే విమర్శలు గుప్పిస్త్తోంది. దాదాపు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ నుంచి నేడు కేటీఆర్, హరీష్ రావులు ప్రతిపక్ష హోదాలో విన్నూతమైన విధానాలతో పోరాడుతూ తమ కార్యకర్తలకు, నాయకులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందనే ధీమాను వ్యక్తపరుస్తున్నారు.

ముఖ్యంగా హైడ్రా కూల్చివేతలు, రైతుల సమస్యలు, మూసీ, లగచర్ల ఘటనల వంటి అంశాల్లో రేవంత్ మాదిరిగానే దూకుడుగా వ్యవహరిస్తూ మాటకు మాట సమాధానం ఇస్తున్నారు. రేవంత్ చర్యలకు హరీష్ తనదైన సున్నితమైన శైలిలో స్పందిస్తుండగా, ఈ మధ్య కేటీఆర్ మాత్రం తగ్గేదేలే అనే విధంగా ముందుకెళ్తున్నారు. ఇక కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో రేవంత్ వర్సెస్ బీఆర్‌ఎస్ పోస్టులు, కామెంట్స్ హద్దులు మీరు తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక భవిష్యత్తులో కేటీఆర్, హరీష్‌లు ఎలాంటి వ్యూహాలతో ప్రజాసమస్యలపై పోరాడుతారో, కార్యకర్తలకు అండదండగా వుంటారో, రాజకీయ చదరంగంలో ఏ పాత్ర పోషిస్తారో కాలమే నిర్ణయించాలి.

మేము సైతం అంటున్న బీజేపీ

అధికారంలో వున్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో వున్న బీఆర్‌ఎస్ దొందూ దొందే అని, తెలంగాణలో భవిష్యత్తు అధికారం మాదే అంటూ భారతీయ జనతా పార్టీకూడా దీటుగానే రాజకీయ పావులు కదుపుతుంది. కేంద్రమంత్రి ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తనదైన పంథాలోనే మోడీ చరిష్మాతో తమ కార్యకర్తలకు,  నాయకులకు భరోసా కల్పిస్తున్నారు. కాంగ్రెస్ , బీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో మేముసైతం అంటూ కిషన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన  బండి సంజయ్, ఈటల రాజేందర్, అరవింద్ వంటివారు కూడా దూకుడుగానే వ్యవహరిస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మూడు ముక్కల ఆటలోలా  ఎవరికీ వారు తమ విధానాలతో, భవిష్యత్తు అంచనాలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటితోపాటు కేసీఆర్ మౌనం, బీసీల వాటా పెంపు, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, రాజకీయ నాయకుల అరెస్టులు వంటి తదితర అంశాలు కూడా గత ఏడాదిగా తెలంగాణ రాజకీయాల్లో ప్రము ఖంగానే కనిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై అన్ని పార్టీల స్పందనలు ఎలా ఉన్నా కొన్ని సందర్భాల్లో ఈ ప్రముఖ నాయకుల ప్రసంగాలు, వ్యవహరిస్తున్న తీరు సామాన్య ప్రజలు సైతం  ఏవగించుకునే స్థాయిలో వుంటున్నాయనేది  రాజకీయ పండితుల అభిప్రాయం.

ప్రజాప్రతినిధులమని మరచి వ్యక్తిగత దూషణలతో, ద్వేష పూరిత చర్యలతో వాళ్లు అనుసరిస్తున్న వైఖరులు, విధానాలు, సోషల్ మీడియా వార్‌లు ఆందోళనకరం కలిగిస్తున్నాయి. కాబట్టి అన్ని పార్టీల నాయకులు జాతీయ సమగ్రతను కాపాడుతూ, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలనిప్రజలు కోరుకుంటున్నరు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన అధికారం, జీతం రెండూ అనుభవిస్తున్న ప్రజాప్రతినిధులు బాధ్యతగా వుం టూ ప్రజాసమస్యలపై సేవాభావంతో పనిచేయాలి.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి  మంత్రిమండలి, ప్రతిపక్ష నాయకులుగా కేటీఆర్, హరీష్ రావు, కిషన్ రెడ్డి తదితరులంతా ఈ రాజకీయ పోటీ ప్రపంచంలో పార్టీలు, వ్యక్తిగత భవిష్యత్తులను పక్కనబట్టి దేశం, రాష్ట్రంలో రాబోయే తరాల భవిష్యత్తు ప్రపంచానికి దీటుగా ఉండేలా కృషి చేయాలని ఆశిద్దాం. 

-ఫిజిక్స్ అరుణ్ కుమార్ 

వ్యాసకర్త సెల్ : 9394749536