calender_icon.png 19 October, 2024 | 12:01 PM

స్వింగ్‌కు బౌల్డ్ అయ్యేదెవరు

19-10-2024 01:40:43 AM

వాషింగ్టన్, అక్టోబర్ 18: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో రెండు వారాల్లో జరగనున్నాయి. 24 కోట్ల మంది ఓటర్లున్న అగ్రరాజ్యంలో విజేతను నిర్ణయించేది స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే ఏడు రాష్ట్రాల ఫలితాలే. స్వింగ్ స్టేట్లు సైతం ప్రతి ఎన్నికలు మారిపోతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం అరిజోనా, జార్జియా, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్ రాష్ట్రాలు అమెరికాకు కాబోయే అధ్యక్షుడిని నిర్ణయిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలోని చాలా రాష్ట్రాలు రిపబ్లికన్లు లేదా డెమోక్రాట్లకు స్థిరంగా ఓట్లు వేస్తూ వస్తున్నాయి. 2000 మధ్య కాలంలో 38 రాష్ట్రాలు ఒకే పార్టీకి మద్దతు తెలిపాయి. కానీ ఈ 7 రాష్ట్రాల్లో ఫలితాలను అంచనా వేయడం కష్టంగా మారింది. అందుకే పార్టీలు సైతం ఈ రాష్ట్రాల్లోని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ వ్యూహాలను సిద్ధం చేసుకుంటారు. 

అభ్యర్థుల యుద్ధభూమి

స్వింగ్ స్టేట్లను వర్ణించేందుకు సరైన నిర్వచనం లేనప్పటికీ నాలుగు రకాల లక్షణాలను ఇవి ప్రదర్శిస్తాయి. అధ్యక్ష అభ్యర్థులు దీనిని యుద్ధభూమిగా పరిగణిస్తారు. మొమోరియల్ డే నుంచి లేబర్ డే మధ్య ఈ ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి సారిస్తారు. రెండోది ఇక్కడ ఆధిక్యం 5 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుంది. గతంలో ప్రతిసారి ఈ రాష్ట్రాల నుంచే అధ్యక్ష అభ్యర్థులు పోటీ చేశారు. నాలుగోది ఈ రాష్ట్రాలు ఎప్పుడూ ఒకే పార్టీని ఆదరించవు. ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయి. ఉదాహరణకు పెన్సిల్వేనియాలో 2012లో బరాక్ ఒబామా (డెమోక్రాట్), 2016లో డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్), 2020లో జో బైడెన్ (డెమోక్రాట్) గెలిచారు.