కాంగ్రెస్‌వి మాటలెక్కువ.. చేతలు తక్కువ
- ఒక్కనాడైనా సీఎం సమీక్ష నిర్వహించారా?
- ఇప్పటికే 30 శాతం వడ్లు దళారులపాలు
- గాలిలో దీపంలా రైతుల పరిస్థితి
- మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
సిద్దిపేట/ హైదరాబాద్ , నవంబర్ 3(విజయక్రాంతి): రాష్ట్రంలో మంత్రులు, అధికారులు ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తున్నారని, కానీ అక్కడ వడ్లు కొనే వారు లేరని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని బద్దిపడగ గ్రా మంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం సందర్శించి రైతులతో మాట్లా డారు.
ఈ సందర్భంగా ఆయనతో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అని ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు, టార్పాలిన్లు లేకపోవడంతో అకాల వర్షానికి చాలా చోట్ల ధాన్యం తడిసి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కేంద్రంలోనూ రైతులకు మద్దతు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీకి రైతుల ఓట్లు మాత్రమే కావాలని, వారి కష్టాలు పట్టించుకునే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతుల పరిస్థితి గాలిలో దీపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లపై ఒక్కసారైనా రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు. రాత్రింబవళ్లు రైతులు కొనుగోలు కేంద్రాల వద్దనే ఉండాల్సి వస్తుందని అన్నారు.
రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి వారే తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు. ఇప్పటివరకు రైతుబంధును ఇవ్వలేదని, రైతుబీమా ఊసే లేదని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే 800 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 30 శాతం ధాన్యాన్ని దళారులు కొన్నారని తెలిపారు. వడ్లకు బోనస్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఆంధ్రా దళారులు ఇక్కడికి వచ్చి ధాన్యం కొనుక్కు వెళ్తున్నారని పేర్కొన్నారు. పండిన పంటలోఒకటో వంతు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, ఇప్పటికే పావలా శాతం వడ్లు బయటకు వెళ్లిపోయాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు.
ఘనపూర్ పంప్‌హౌస్ పనులు పూర్తి చేయాలి..
నంగునూరు మండలంలోని ఘనపూర్ పంప్‌హౌస్ నిర్మాణ పనులను ఆదివారం హరీశ్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రానున్న యాసంగి వరకు పంప్‌హౌస్ పనుల నిర్మానం పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. పంప్‌హౌస్‌లో విద్యుత్ ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం
ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలోని 60 మంది విద్యార్థుల అస్వస్థతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆదివారం ట్విట్టర్‌లో వాంకిడి ఘటనను ట్వీట్ చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపమవుతోందని మండిపడ్డారు. ప్రజాపాలనలో పిల్లల భవిష్యత్ ఆందోళనకరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. స్థానిక ఆస్పత్రుల్లో విడతల వారీగా విద్యార్థులను చేర్పిస్తున్నారే తప్ప మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయడం లేదని విమర్శించారు. వెంటిలేటర్ మీదకు చేరిన ఆ విద్యార్థిని పరిస్థితికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. విద్యాశాఖ కూడా సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరే ఉందని, రోజురోజుకూ దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలిపే ప్రయత్నం చేయకపోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు.