calender_icon.png 16 January, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరు నాయకులు?

01-09-2024 02:00:15 AM

* భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం ఇప్పుడు కుంభకోణాలు చేసి జైళ్లకు వెళ్లి వచ్చినవారితోనే నిండిపోతున్నది. వారే పెద్ద నేతలుగా ఎదిగిపోతున్నారు. అవినీతి, కుంభకోణాలు అనేవి ఇప్పుడు అసలు ఎన్నికల అంశాలే కాదు. ప్రజలకు కూడా అవి సర్వ సాధారణంగా కనిపించేలా మార్చేస్తున్నారు. 

* అధికారంలోకి వచ్చిన పార్టీలు స్వయంగా కుంభకోణాలు చేయటంతోపాటు వ్యాపారులను బెదిరించి కోట్లలో డబ్బులు గుంజుతున్నాయి. ఈ వేధింపుల నుంచి బయటపడేందుకు వ్యాపారవేత్తలే రాజకీయ నాయకులుగా, మీడియా అధినేతలుగా మారుతున్నారు. 

ఒక్కడినైనా చంపనిదే వైద్యుడు కాలేడు అనేది తెలుగు నేలపై పాతకాలపు ముతక సామెత. జైలుకు వెళ్లకుండా రాజకీయ నాయకుడు కాలేడు అనేది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో వేళ్లూనుకుపోతున్న నానుడి. స్వాతంత్రోద్యమ సమయంలో వలసపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లి బయటకు వచ్చినవాళ్లలో ఆ తర్వాత కూడా పోరాటం చేసినవాళ్లు నాయకులుగా ఎదిగారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 78 ఏండ్ల తర్వాత కూడా జైలుకు వెళ్లి వచ్చినవాళ్లే పెద్దపెద్ద నాయకులు అవుతున్నారు కానీ.. ఇది పూర్తిగా భిన్నం.

అవినీతి కేసుల్లో, హత్యలు, అత్యాచార కేసుల్లో ఇరుక్కొని జైలుకు వెళ్లినవారు కూడా బయటకు రాగానే పెద్దపెద్ద నాయకులుగా మారిపోతున్నారు. వాళ్లే పాలకులుగా మారి ప్రజల నెత్తిన కూర్చుంటు న్నారు. దేశం మొత్తం ఇదే పరిస్థితి ఉన్నది. అసలు ఒక రాజకీయ నాయకుడు జైలుకు వెళ్లటం, బయటకు రావటం అంటేనే పార్టీలకు ఒక పండుగలా మారింది. జైలుకు వెళ్లే

టప్పుడు ఎక్కడ లేని హడావుడి చేస్తున్నారు. ఏదో ఘనకార్యం చేసినట్టు విజయ సంకేతాలు చూపుతూ జైలుకు వెళ్తున్నారు. ఇక బెయిల్‌పై బయటకు వస్తే ఆ హంగామాకు ప్రజలు జడుసుకోవాల్సిందే. ఒలింపిక్స్‌లాంటి విశ్వక్రీడల్లో బంగారు పథకాలు సాధించిన క్రీడాకారులు, ప్రపంచకప్ కొట్టిన క్రికెట్ జట్టుకు కూడా ఇంతటి ఘన స్వాగతాలు ఉండటంలేదు. ఏదో యుద్ధం గెలిచి వచ్చినట్టుగా సందుసందునా ఫ్లెక్సీలు, కటౌట్లు, మీడియా ఉరుకులు పరుగులు.. ఇలా చూస్తుండగానే అలా పెద్ద నేతలుగా ఎదిగిపోతున్నారు. 

అవినీతి, అక్రమాల్లో జైలుకు వెళ్లిన రాజకీయ నాయకులు ఒక్కసారి బెయిల్ సంపాదించి బయటకు వస్తే రెట్టించిన వేగంతో రాజకీయాలు చేస్తున్నారు. ఆ కేసులు మాత్రం దశాబ్దాలపాటు సాగీ.. సాగీ.. చివరకు ఆధారాలు లేవన్న కారణంతో వీగిపోతుంటాయి. ఈ మధ్యలో ప్రభుత్వ ధనం, యంత్రాంగం మొత్తం వృధా అవుతున్నది. 

భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం ఇప్పుడు కుంభకోణాలు చేసి జైళ్లకు వెళ్లి వచ్చినవారితోనే నిండిపోతున్నాయి. వారే పెద్ద నేతలుగా ఎదిగిపోతున్నారు. అవినీతి, కుంభకోణాలు అనేవి ఇప్పుడు అసలు ఎన్నికల అంశాలే కాదు. ప్రజలకు కూడా అవి సర్వ సాధారణంగా కనిపించేలా మార్చేస్తున్నారు. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కనీసం రూ.10 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయాల్సి వస్తున్నది.

అదంతా నల్లధనమే. అది ఎక్కడి నుంచి వస్తున్నది? అదేమీ వారి పూర్వీకుల ఆస్తులు అమ్మితేనో, ప్రజలు విరాళాలు ఇస్తేనో వచ్చిన డబ్బు కాదు. అక్రమంగా సంపాదించినదే. కనీసం రూ.50 కోట్ల వరకు ఖర్చు చేయగల వ్యక్తులకే పార్టీలు టికెట్లు కేటాయిస్తున్నాయి. దేశం మొత్తంలో అన్ని పార్టీలు కలిపి ఎన్నికల్లో రూ.లక్ష కోట్ల వరకు నల్లధనాన్ని ఖర్చు చేస్తున్నట్టు అంచనా. ఆ తర్వాత జరిగే అవినీతి పది రెట్లు ఉంటుంది.  

గతంలో రాజకీయ పార్టీలు ప్రజలు, వ్యాపారవేత్తల నుంచి విరాళాలు సేకరించి ఎన్నికల్లో ఖర్చు చేయటంతోపాటు పార్టీ రోజువారీ వ్యవహారాలు నడిపేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అధికారంలోకి వచ్చిన పార్టీలు స్వయంగా కుంభకోణాలు చేయటంతోపాటు వ్యాపారులను బెదిరించి కోట్లలో డబ్బులు గుంజుతున్నాయి. ఈ వేధింపుల నుంచి బయటపడేందుకు వ్యాపారవేత్తలే రాజకీయ నాయకులుగా, మీడియా అధినేతలుగా మారుతున్నారు.

అదే సమయంలో రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్దపెద్ద వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకొంటున్నారు. దీంతో ఇప్పుడు ఏ నాయకుడికీ ప్రజల నుంచి విరాళాలు వసూలు చేయాల్సిన అవసరం లేదు. అక్రమంగా సంపాదించే సొమ్ముతోనే ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు చేయటానికి సిద్ధపడుతున్నారు. ఈ పరిణామాలు ప్రజాసేవ, ప్రజా సేవకులు అనే మాటలను స్వీయ సేవ, స్వీయ సేవకులుగా మారిపోతున్నది. 

క్షేత్ర స్థాయిలో పెచ్చుమీరిన అవినీతి దేశ ప్రగతితోపాటు ప్రజల శక్తిని కూడా నాశనం చేస్తున్నది. ప్రతి నాయకుడూ అవినీతిని అంతం చేస్తామని ప్రగల్బాలు పలుకుతూనే ఉంటాడు. వాస్తవంలో నిత్యం అవినీతిలోనే మునిగి తేలుతున్నారు. అదేమంటే అవినీతి చేయకుండా రాజకీయాల్లో కొనసాగలేమని, మాకు మరో మార్గం లేదని చెప్తుంటారు. ఎన్నికల్లో ప్రజలు డబ్బు తీసుకోకుండా ఓటు వేయటం లేదు కాబట్టి మాకు మరో మార్గంలేదని రాజకీయ నాయకులు అంటున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, న్యాయవాదులకు డబ్బులు వెదజల్లకుండా మాకూ మరో మార్గం లేదని వ్యాపారవేత్తలు చెప్తున్నారు.

అలా చేయకుంటే బిజినెస్ చేయలేమని అంటున్నారు. తమ పై అధికారులు రూ.100 సంపాదిస్తే తాము కనీసం రూ.10 అయినా సంపాదించాలనే ధోరణిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ట్రాన్స్‌ఫర్లకోసం, ప్రమోషన్ల కోసం కూడా తాము లక్షల్లో ముట్టజెప్పుకోవాల్సి వస్తున్నందునే అవినీతికి పాల్పడాల్సి వస్తుందని వాళ్లూ సమర్థించుకొంటున్నారు. ఇదంతా చక్కబడాలంటే డబ్బుతో పనిలేకుండా ఎన్నికలు నిర్వహించే వాతావరణం రావాలి. సామాన్య పౌరుడు కూడా ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఏర్పడాలి. అప్పుడే దేశం ప్రగతిపథంలో ముందుకు సాగుతుంది. 

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి