calender_icon.png 22 September, 2024 | 3:03 PM

పంచాయతీరాజ్‌శాఖపై శ్వేతపత్రం

28-07-2024 02:45:41 AM

విడుదల చేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): పంచాయతీరాజ్‌శాఖపై శ్వేతప త్రం విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధిశాఖలో జరిగిన ఆర్థిక అరాచ కాలపై ప్రత్యేకంగా చర్చించాల్సి ఉంటుందని, ఇందుకు కనీసం నాలగైదు గంటల సమయం పడుతుందన్నారు. పంచాయతీరాజ్ నిధుల దారి మళ్లింపుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. కేంద్రం పంచాయతీల ఖాతాలకు జమచేసిన నిధులను గత ప్రభుత్వం ఖాళీ చేసేదని, దీంతో పంచాయతీలు, పారిశుద్ధ్య కార్మిలకు వేతనాలు చెల్లించలేక రూ.103 కోట్ల మేర బకాయి పడ్డట్టు తెలిపారు.

నిధులు లేక పోవడంతో పాడైన మోటర్లకు మరమ్మతులు చేయలేక, పైపులైన్ల లీకేజీలు సరిచేయలేక గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఎల్‌ఈడీ వీధిదీపాల నిర్వహణను గాలికి వదిలేసినట్టు ఆరోపించారు. గ్రామాల్లో నివసిస్తుండగా వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. గత  ప్రభుత్వంలో జరిగిన లోపాలను అధికమిస్తూ పంచాయతీలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రస్తుతం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 

మహిళల సమస్యలను పరిష్కరించండి

మహిళల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం తన కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. వృద్ధులు పంపిన ఓ ఫిర్యాదుపై స్పందించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీశాఖలపై వచ్చిన అర్జీలతోపాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, ఎదురవుతు న్న ఇబ్బందులను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు పంపించడంతోపాటు సమస్య తీవ్రతనుబట్టి అధికారు లతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా నుంచి మహిళలు, వృద్ధులు తెలిపిన సమస్య పవన్ కల్యాణ్‌ను కదిలించింది. ఇందులో తిరుపతి జిల్లా వెంకటగి రిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లైన్‌లో కొందరు యువకులు ముఠాలుగా ఏర్పడి బైకులపై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో సంచరిస్తున్నారని, విద్యార్థినులను, యువతులను, మహిళలను వేధిస్తు న్నారని, వృద్ధులను భయపెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.

యువతుల ఫొటోలు తీసి ఇంటర్నెట్‌లో పెట్టి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలుపెట్టడం, ఇళ్లపై రాళ్లు వేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. సదరు యువకులు వివరాలు, బైకులపై వేగంగా సంచరిస్తున్న ఫొటోలను, వాహనాల నెంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు. వీరి వేధింపులకు గురైనవారిలో ఓ మహిళా ఎస్సు కూడా ఉందని తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పవన్.. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుకు ఫోన్ చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆడ పిల్లలను, మహిళలను వేధించేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇక ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.