గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు
కేజీ ఐస్‌క్రీంలో 60 ఎంఎల్ విస్కీ మిక్స్
కేజీ ధర రూ. 1700.. ఫేస్‌బుక్‌లో యాడ్‌లు
11.5 కేజీలు స్వాధీనం
పోలీసుల అదుపులో నిర్వాహకులు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా విస్కీతో తయారు చేస్తున్న ఐస్‌క్రీంలు విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పిల్లలు, యువత టార్గెట్‌గా విస్కీ ఐస్‌క్రీంలు విక్రయిస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. చేసేది తప్పుడు వ్యాపారం.. పైగా ఫేస్‌బుక్ ద్వారా అడ్వర్టుజ్‌మెంట్ ఇవ్వడంతో అది కాస్తా ఎక్సై జ్ పోలీసుల కంట పడింది. కస్టమర్లను ఆకర్షించడానికి 1కేజీ డార్క్ ఐస్‌క్రీంలో 60 ఎం ఎల్ 100 పైపర్స్ విస్కీ కలుపుతూ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వారి నుంచి 11.5 కేజీల విస్కీ ఐస్‌క్రీంను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సూపరిండెంట్ ఎస్‌టీఎఫ్ టీం లీడర్ ప్రదీప్‌రావు నేతృత్వంలో జూబ్లీహిల్స్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ వాసుదేవరావు తదితర ఎక్సైజ్ సిబ్బందితో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1, 5లోని అరికో ఐస్‌క్రీం పార్లర్‌లో గురువా రం రాత్రి సోదాలు నిర్వహించారు. ఈ సోదా ల్లో విస్కీ కలిపిన ఐస్‌క్రీంలను అమ్ముతున్నట్లు గుర్తించారు. 1000 గ్రాముల ఐస్‌క్రీంలో 60ఎంఎల్ విస్కీ కలుపుతున్నట్లు తేలింది. ఒక కేజీని రూ. 1700లకు అమ్ముతున్నారు.
దీని రుచి బాగుండడంతో ఐస్‌క్రీం విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు. అమ్మకాలను మరింత పెంచుకునేం దుకు మరో అడుగు ముందుకేసి నిర్వాహకులు యువతి, యువకులను ఆకర్షించే విధంగా ఫేస్‌బుక్‌లో యాడ్ కూడా ఇచ్చారు. దీనిపై ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. ఈ క్రమంలో సోదాలు నిర్వహించి 11.5 కేజీల విస్కీ ఐస్‌క్రీంలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు దయాకర్‌రెడ్డి, శోభన్‌బాబు, శరత్ చంద్రపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దయాకర్‌రెడ్డి, శోభన్‌బాబులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.