calender_icon.png 17 November, 2024 | 4:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొరడా ఝుళిపించిన రెరా

15-09-2024 02:46:29 AM

  1. నిబంధనలు అతిక్రమించిన నిర్మాణ సంస్థలపై చర్యలు
  2. నెబ్యూలా ఆవాస్‌కురెరా రూ.2 లక్షల జరిమానా 
  3. గ్రీన్‌వుడ్ హైట్స్ సంస్థకు 9.8 లక్షల ఫైన్
  4. గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రీ లాంచ్‌లపై మాత్రం మౌనం ?

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థలపై రెరా కొరడా ఝుళిపించింది. నిబంధనలు పాటించని నిర్మాణ సంస్థలకు రూ. లక్షల్లో జరిమానా విధించింది. ఇందులో ముఖ్యంగా కొనుగోలుదారులకు రీఫండ్ చెల్లించడంలో ఆలస్యమైనందుకు నెబ్యూలా ఆవాస్ అనే నిర్మాణ సంస్థకు రెరా రూ.2 లక్షల జరిమానా విధించింది. ఆవాస్ సంస్థ చేపట్టిన ఓ ప్రాజెక్టులో రామకృష్ణ అనే వ్యక్తి ఫ్లాట్ బుక్ చేసుకున్నారు.

ఇందుకోసం 2016 డిసెంబర్ నుంచి 2020 జూలై వరకు రూ.8,06,675 చెల్లించారు. అయితే హోం లోన్ రావడం ఇబ్బందిగా మారడంతో 2021 జనవరిలో తన బుకింగ్ రద్దు చేసుకున్నారు. అయితే ఎన్నిసార్లు కోరినా బిల్డర్ ఆయనకు రూ.5,67,656 మాత్రమే చెల్లించారు. అది కూడా ఏడాదిన్నర తర్వాత ఇచ్చా రు. దీనిపై ఆయన రెరాను ఆశ్రయించడంతో రిఫండ్ చేసిన మొత్తానికి వడ్డీ చెల్లించడంతోపాటు బుకింగ్ అమౌంట్ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని వెంటనే వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.

మెహతా అండ్ మోడీ రియల్టీపై...

అలాగే మేడ్చల్ -మల్కాజ్ గిరి జిల్లా అల్వాల్ మండలం కౌకూరులో మెహతా అండ్ మోడీ రియల్టీ చేపట్టిన గ్రీన్‌వుడ్ హైట్స్ ప్రాజెక్టులో అనధికార నిర్మాణాలు చేసినందుకు ఆ సంస్థకు రెరా రూ.9.8 లక్షల జరిమానా విధించింది. 2023 ఫిబ్రవరి 25న తనకు ఫ్లాట్ అప్పగించిన తర్వాత తన ప్రైవేటు బాల్కనీలో నుంచి తనకు తెలియకుండా టాయిలెట్ డ్రైనేజీ పైప్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తించినట్టు పరంజిత్ దాస్ అనే వ్యక్తి రెరాకు ఫిర్యాదు చేశారు. 

దీనిపై మెహతా అండ్ మోడీ రియల్టీ తన చర్యను సమర్థించుకుంది. సీవేజ్, వాటర్ పైప్ లైన్లు కామన్ వసతుల్లో భాగమని పేర్కొంది. అయితే రెరా చైర్మన్ సత్యనారాయణ వాదనలు విన్న అనంతరం అనుమతించిన ప్లాన్‌కు భిన్నంగా టాయిలెట్ నిర్మించారని, దీనిని అక్రమ నిర్మాణం గా భావించాలని స్పష్టం చేశారు. 30 రోజుల్లోగా ఫిర్యాదుదారు బాల్కనీ నుంచి డ్రైనేజీ పైప్ లైన్ తొలగించాలని ఆదేశించారు. 

గోద్రెజ్ ప్రీలాంచ్‌పై మౌనం ? 

దేశంలోనే పేరెన్నిక గల నిర్మాణ సంస్థ అయిన గోద్రె జ్ ప్రాపర్టీస్ హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో రెసిడెన్షియ ల్, కమర్షియల్ ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. నగర రియాల్టీకి ఇది మంచి విషయమే అయినప్పటికీ, ఈ సంస్థ ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే టీజీ రెరా అనుమతి తీసుకున్నట్లు ఈ సంస్థ ప్రకటనల్లో ఎక్కడా కనిపించలేదు. గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రీలాంచ్ వ్యవహారం అంతా బహిరంగంగానే జరుగుతన్నా రెరా మౌనం వహిస్తుంది. గతంలో ప్రెస్టీజ్ వంటి నిర్మాణ సంస్థలు చేసిన ప్రీలాంచ్‌ల పట్ల చూసీచూడనట్లున్న రెరా గోద్రెజ్ ప్రాపర్టీస్ ప్రీలాంచ్‌పై చర్యలు తీసుకుంటుందా లేదా వేచి చూడాలి మరి.