calender_icon.png 26 October, 2024 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొటీన్ సప్లిమెంట్లపై కొరడా!

02-07-2024 05:09:38 AM

  • విచ్చలవిడిగా మార్కెట్లో లభ్యమవుతున్న ఉత్పత్తులు
  • తప్పుడు ప్రకటనలతో ఇబ్బడిముబ్బడిగా అమ్మకాలు
  • సాధారణ దుకాణాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాల్లో లభ్యం
  • కఠిన నిబంధనలు అమలుకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ యోచన

న్యూఢిల్లీ: దేశంలో ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగిపోతోంది. ఇంటి ఆహారానికన్నా బయటి తిండికే ఎక్కు వ ప్రాధాన్యత ఇస్తున్న నేటి తరం యువత అదే సమయంలో ఫిట్‌నెస్, ఆరోగ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపుతోంది. దీంతో  పట్టణాలు, నగరాల్లో ఎక్కడ చూసినా జిమ్‌లు, యోగా కేంద్రాలు దర్శనమిస్తున్నాయి. వీటితో పాటుగా ప్రొటీన్ సప్లిమెం ట్లు, పౌడర్లు, షేక్‌లు లాంటి  ప్రాడక్ట్‌ల అమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి.  అయితే ఈ అమ్మకాలు ఎక్కువగా  మామూలు దుకాణాలు, జిమ్‌లు, ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయి. ఎలాంటి అధికారిక లైసున్సు లు లేకుండా జరిగే ఈ వ్యాపారంపై  కొరడా ఝళిపించాలని కేంద్రప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలద్వారా తెలుస్తోంది.

ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఇటీవల ఈ ఫుడ్ సప్లిమెంట్ల అమ్మకాలపై ఓ సర్వే నిర్వహించింది. తప్పుడు ప్రకటనలతో వీటిని మామూలు దుకాణాల్లోనే కాకుండా జిమ్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు ఆ సర్వేలో వెల్లడయింది. దీంతో వీటి అమ్మకాలకు కఠినమైన నిబంధనలను తీసుకు రావాలని ఆ సంస్థ ఆలోచిస్తున్నట్లు ఈ వ్యవహారం గురించి బాగా తెలిసి ఓ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ‘ఇప్పుడు మార్కెట్లో బోలెడన్ని ప్రొటీన్ ఉత్పత్తులు ఉన్నాయి. వీటివల్ల లాభంకన్నా హానే ఎక్కువ’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడనిఆ అధికారి చెప్పారు.

ప్రజారోగ్యానికి హాని కలగకుండా చూడడమే ఈ కఠినిబంధనలను తీసుకురావా లన్న ఆలోచన ముఖ్య ఉద్దేశమని కూడా ఆ అధికారి చెప్పారు. ఈ కఠిన నిబంధనలను అమలు చేయడం వల్ల వాటికి అనుగుణంగా లేని పలు ఉత్పత్తులను నిషేధించడానికి వీలవుతుందని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. ప్రొటీన్ ఉత్పత్తులపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా లేబుల్స్ ఉండడం ఆందోళన కలిగించే అంశంగా ఉందని మ్యాక్స్ హెల్త్‌కేర్‌లో ఎండోక్రినాలజీ, డయాబెటిస్ విభాగం చైర్మన్ డాక్టర్ అంబరీష్ మిత్తల్ అంటున్నారు.

అంతేకాదు ఆ ఉత్పత్తుల్లో ఏం ఉందో కూడా మనకు తెలియదని ఆయన అన్నారు. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో తగినన్ని ప్రొటీన్స్ లభించనప్పు డు ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకోచ్చని, అయి తే అది పరిమితంగా సరయిన నిబంధనల ప్రకారం, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే జరగాలని ఆయన ఆయన అన్నారు. 

కాగా దీనికి సంబంధించి  వినియోగ దారుడి అనుభవం చూస్తే ఇవి ఎంత హానికరమో అర్థమవుతుంది. ‘సురక్షితమైనదని నమ్మి అందరికీ చిరపరిచితమైన శీయ బ్రాండ్‌నొకదాన్ని నేను వాడాను. అయితే ఆరేడు వారాల్లోనే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమయింది. అదృష్టవశాత్తు దాన్ని వాడడం మానేసిన తర్వాత నా ఆరోగ్యం తిరిగి మామూలుగా మారడం మొదలైంది. దయచేసి  చాలా జాగ్రత్తగా ఉండండి’ అంటూ స్నాప్‌డీల్, టైటాన్ క్యాపిటల్ సహవ్యవస్థాపకుడు కునాల్ బహల్ గత ఏప్రిల్ 12న ‘ఎక్స్’లో ఉంచిన ఓ పోస్టులో పేర్కొన్నారు.

సొమ్ముచేసుకొంటున్న ఉత్పత్తిదార్లు

జనంలో ఆరోగ్యం పట్ల క్రేజ్ పెరుగుతుండడంతో దీన్ని సొమ్ము చేసుకోవడానికి ఉత్పత్తిదారులు వీటిని పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారని, మార్కెట్లో ప్రొటీన్ సప్లిమెంట్ బ్రాండ్లు కుక్క గొడుగుల్లా పెరగడానికి ఇదే ప్రధాన కారణమని నిపుణు లు అభిప్రాయపడుతున్నారు. హెల్త్‌కార్ట్, అమెజాన్ లాంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో  ‘అద్భుతంగా పని చేస్తాయని’ చెప్పుకొనే ప్రొటీన్ సప్లిమెంట్ పౌడర్లు 23 కిలోల జార్‌లు రూ.2,000 6800 మధ్య విక్రయిస్తున్నారు. 

మజిల్ బ్లేజ్,  బయోజిమ్ పెర్ఫార్మెన్స్,ఆప్టిమమ్  న్యూట్రీషన్( ఓఎన్), గోల్డ్ స్టాండర్డ్, మైఫిట్ ఫ్యూయల్, న్యూట్రాబే గోల్డ్, ‘ఆటమ్, వేప్రొటీన్ ’లాంటివి ఈ ఆన్‌లైన్‌ఫ్లాట్‌ఫామ్‌లలో విక్రయిం చే పాపులర్ బ్రాండ్లలో కొన్నిమందుల దుకాణాలు, జనరల్ స్టోర్స్, ఆన్‌లైన్‌ప్లాట్‌ఫామ్‌లలో వీటి అమ్మకాలు విపరీతంగా పెరగడంతో భారత్‌లో ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తుల మార్కెట్ 2023లో ఏడాదికి రూ.33,208.5 కోట్లకు పెరిగిపోయిందని ఇంటర్నేషనల్ మార్కెట్ అనాలసిస్ రిసెర్చ్, కన్సల్టింగ్( ఐఎంఏఆర్‌సీ) పేర్కొంది.

2024 2032 మధ్య కాలంలో  ప్రొటీన్ ఆధారిత ఉత్పత్తుల అమ్మకాలు ఏటా సగటున 15.8 శాతం చొప్పున పెరిగి రూ.1,28, 460.5కోట్లకు చేరుకోవచ్చని నోయిడా, అమెరికా, లండన్‌లలో కార్యాలయాలున్న ఈ రిసెర్చ్ కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేసింది. బూటకపు ప్రకటనలకు మోసబోయి ఇలాంటి ప్రొటీన్ సప్లిమెంట్లను వాడి  జనం తమ ఆరోగ్యాలకు ముప్పు తెచ్చుకోకుండా వీటిపై కఠిన నిబంధనలను విధించాలని ప్రభుత్వం ఆలోచించడం ఎంతయినా శుభ పరిణామమని చెప్పాలి.