నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావోఅది ఈ రోజే చెయ్యి రేపు ఎప్పుడూ మనది కాకపోవచ్చు తప్పకుండా మనకు చెప్పకుండా మన అనుమతి లేకుండా మనను తీసుకుపోయే క్షణమొకటి వస్తుంది అప్పుడు నువ్వెంత నొచ్చుకున్నా.. గింజుకున్నా కాలధర్మంలో కలిసి పోవాల్సిందే రేపటి కోసం ఈ రోజునే నీ తండ్లాట చూస్తుంటే మనిషి ఇంతెనేమో అనిపిస్తుంది కాస్త వాస్తవిక స్పృహలోకి రా...
ద్వేషాలు, మోసాలు, ప్రతీకారాలు వీడు వీలైనంత విశాలంగా ప్రేమించు నువ్వు లేకున్నా నీ మాట.. నీ చేత బతికే వుంటుంది తెలుసుకో... నిన్ను నువ్వు నిత్యం అప్‌డేట్ చేసుకోకుంటే... ఆసాంతం వెనకబడతావ్ గిర్రున తిరుగుతున్న వర్తమాన పేజీలనుంచీ నిర్దాక్షిణ్యంగా నీ అస్తిత్వవాక్యం తొలగిపోతుంది.
నువ్వు నీ బాధల నడుమ బందీ అయివున్నందుకు నిన్ను అడుగడుగునా వేధించే వాళ్ళు బాధించే వాళ్ళు కోకొల్లలు ఉంటారు అన్నీ లెక్క కట్టుకోకు తలలో మూట గట్టుకోకు కదులు ముందుకు.. చైతన్యంతో ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నువ్వెంత బిజీగా ఉన్నా సరే.. ఇరుగుతోనో...
పొరుగుతోనో.. స్నేహితులతోనో.. సన్నిహితులతోనో..రోజూ ఓ పిడికెడు ప్రేమను పోగేసుకో నువ్వు మదినిండా ఏడ్వటమైనా హృదినిండా నవ్వటమైనా... బతికున్నప్పుడే చెయ్యగలవ్ మంచో... చెడో..కష్టమో... నిష్టూరమో...నువ్విప్పటి వరకూ బతికున్నందుకు శుభాకాంక్షలు!