హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి తెరపడింది. అగ్రనేతల ప్రసంగాలు, తిరుగుబాటుదారులపై చర్యలు, భారీ ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా ప్రయత్నించాయి. ప్రచారపర్వం ముగియడంతో అందరి దృష్టీ శుక్రవారం జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి చాలా రోజుల ముందునుంచే రాష్ట్రంలో అధికార బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. పదేళ్లుగా అధికారంలో ఉండడం ఆ పార్టీపైనా, ప్రభుత్వంపైనా వ్యతిరేకతకు కారణంగా చెబుతున్నారు. రైతులు, కుస్తీయోధులు, నిరుద్యోగం, ముఠా తగాదాలు ఇందుకు ఆజ్యం పోస్తున్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
వివిధ సంస్థలు నిర్వహించిన ఎన్నికల సర్వేలు సైతం బీజేపీ ఎంతగా పోరాడినా 90 స్థానాలున్న అసెంబ్లీలో ఆ పార్టీకి 2025 సీట్లకు మించి దక్కకపోవచ్చని అంచనా వేస్తున్నాయి. నిజానికి ఈ ప్రజావ్యతిరేకతను పసిగట్టిన బీజేపీ కేంద్ర నాయకత్వం ఆరునెలల క్రితం ముఖ్యమంత్రిని మార్చింది. ఎన్నికల సందర్భంగా సగానికి పైగా సిట్టింగ్ అభ్యర్థులను మార్చింది.
అయినా ఫలితం కనిపించడం లేదని పార్టీ నేతలే వాపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల ఓట్ల చీలికపై ఆ పార్టీ గంపెడు ఆశలు పెట్టుకుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో భాగ స్వామి అయిన ఆమ్‌ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తును తిరస్కరించి అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తోంది.
తమ మద్దతు లేకుండా రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆ పార్టీ నేతలు ధీమాగా చెప్తున్నారు. మరోవైపు ఐఎన్‌ఎల్డీబీఎస్పీ కూటమి, జననాయక్ జనతా పార్టీ ఆజాద్ సమాజ్ పార్టీలు సొంతంగా బరిలోకి దిగాయి. ఆయా పార్టీలు, కూటములు చీల్చే కాంగ్రెస్ ఓట్లపైనే కమలం పార్టీ నేతలు ఇప్పుడు ఆశలు పెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఒక వేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే చిన్న పార్టీలు, స్వతంత్రులు కింగ్ మేకర్ పాత్ర పోషించే అవకాశం ఉందని, కేంద్రంలో అధికారంలో ఉన్నందున ఆ పరిణామం తమకు అనుకూలిస్తుందని కూడా ఆ పార్టీ భావి స్తోంది. అయితే గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ వాదన మాత్రం దీనికి భిన్నంగా ఉంది, హర్యానాలో బహుముఖ పోటీలు తగ్గిపోతున్నాయని, ఓటర్లు తమ ఓటును వృథా చేయడం లేదన్నది హస్తం పార్టీ నేతల వాదన. రాష్ట్రంలో దేవీలాల్ వారసుల పట్టు రోజురోజుకు తగ్గిపోతోందని, పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పరిమితం కావడానికి అదే కారణమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే తమ అజెండాగా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. రైతు ఆందోళనకు కేంద్ర బిందువైన హర్యానాలో ఈ సారి రైతన్నలే ఫలితాలను నిర్ణయించే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే రైతులకు కనీస మద్దతు ధరకు హామీ ఇస్తామని ఆ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.
సైనిక ఉద్యోగాలపై గంపెడు ఆశలు పెట్టుకున్న నిరుద్యోగులు ‘అగ్నివీర్’ పథకంద్వారా నాలుగేళ్లే ఉపాధి కల్పిస్తామని కేంద్రం చెప్పడంతో రగిలిపోతున్నారు. ఇక ఏడాది పాటు ఢిల్లీలో ఆందోళన చేసిన మహిళా రెజ్లర్ల పట్ల బీజేపీ వ్యవహరించిన తీరు సైతం ప్రజల్లో నిరసనను పెంచింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వినేశ్ ఫొగట్‌కు టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది.
అయితే సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఉండే వర్గ పోరు హర్యానాలో కూడా ఉంది. మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా, పార్టీ దళిత నేత కుమారి షెల్జా మధ్య ఉన్న అంతర్గత విభేదాలు పార్టీ విజయావకాశాలను ఎక్కడ దెబ్బతీస్తాయేనన్న భయం నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కుస్తీలో ఎవరు గెలుస్తారో ఈ నెల 8న వెలువడే ఫలితాలు నిర్ణయించనున్నాయి.