08-02-2025 12:55:04 AM
ప్లాస్టిక్ నిషేధంపై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంవత్సరంలో ఏదో హడావిడిగా ప్లాస్టిక్ నిషేధం కార్యక్రమాలు నిర్వహించడం తప్ప పూర్తి స్థాయిలో అరికట్టడంలో సంబందించిన అధికారులు విఫలమవుతున్నారు.
వనపర్తి, ఫిబ్రవరి 7 ( విజయక్రాంతి): పర్యావరణానికి పెను ప్రమాదాన్ని కలిగించే ప్లాస్టిక్ వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో విచ్చలవిడిగా క్రయ విక్రయాలు జరుగు తున్న మున్సిపాలిటీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం పలు అను మానాలకు తావిస్తోంది.
ప్లాస్టిక్‌ను పూర్తిస్థా యిలో నిర్మూలించే దిశగా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు అవగాహన చర్యలు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ కింది స్థాయిలో వాటిని ఆచరించడంలో అటు అధికారులు ఇటు ప్రజలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
మున్సిపా లిటీ అధికారులు సంవత్సరంలో ఏదో ఒక రోజు మొక్కుబడిగా దాడులు నిర్వహించి కొద్దిపాటి జరిమానా విధించడంతో తిరిగి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో క్రయ విక్రాలు జరిపే వారికి శరామాములుగా తయారైంది.
మాటలకే పరిమితం.. ఆచరణలో శూన్యం
ప్లాస్టిక్ నియంత్రణ అన్నమాట వినడమే తప్పించి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. వనపర్తి పట్టణంలో ఏ మురికి కాలువలు చూసిన ఏ వీధి చెత్తగుట్టలో చూసిన ఏ ఖాళీ స్థలంలో చూసిన ప్లాస్టిక్ అవశేషాలు దర్శనమిస్తున్న మున్సిపాలిటీ అధికారులు మాత్రం ప్లాస్టిక్ నియంత్రణ తమది కానట్లు నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారు.
మున్సిపాలిటీ పారిశుద్ధ అధికారులకు ఎక్కడ ఉత్పత్తులు విక్రయాలు జరుగుతున్నాయో ఏ గోడౌన్ లో ఏ ప్రాంతాల్లో ప్లాస్టిక్ నిల్వలు ఉన్నాయో తెలిసినప్పటికీ చూసి చూడకుండా వదిలి పెట్టడం, ప్రతిరోజు టన్నుల కొద్ది ప్లాస్టిక్ సరఫరా అవుతున్న అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
మున్సిపాలిటీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి భారీ స్థాయిలో జరిమానా విధిస్తేనే తప్ప ప్లాస్టిక్ నియంత్రణ అనేది అమలు కావడం సాధ్యమవుతుందని పర్యావరణ ప్రేమికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.